గోదావరికి ఏం చేసారు చినబాబూ?

కృష్ణ పుష్కరాల పనుల్లో నాణ్యత లోపించడానికి కారణమైన కాంట్రాక్టర్లను బ్లాక్ లిస్టులో పెడతామని, దండిస్తామని ఏదేదో చెప్పుకొచ్చారు తెలుగుదేశం నెంబర్ 2 చినబాబు అలియాస్ లోకేష్ బాబు. అలా దండిస్తామని చెప్పడానికి ఆయనకు ఏ హోదా లేదు. అయినా అది వేరే సంగతి. కానీ అసలు విషయం ఏమిటంటే, అటు గోదావరి పుష్కరాల పనులయినా, ఇటు కృష్ణ పుష్కరాల పనులైనా చేసింది అస్మదీయులే. తెలుగుదేశం పార్టీ మద్దతు దారులే. ఇంకా చెప్పాలంటే ఆ పార్టీ ప్రాపకం వున్న వారే.

గోదావరి పుష్కరాల విషయంలో జరిగిన అవకతవకల గురించి అప్పట్లో వినిపించిన ఆరోపణలు ఇన్నీ అన్నీ కావు. పావలా పనికి పది రూపాయిల అంచనాలు రూపొందించేసి, నామినేషన్ పద్దతిపై పనులు కట్ట బెట్టేసి పార్టీ జనాలకు మేలు చేసారు. ఈసారి కృష్ణా పుష్కరాలు కూడా అందుకు తీసిపోలేదు. పుష్కరాలు దగ్గరకు వచ్చేవరకు పనులు ప్రారంభించకుండా, నిధులు విడుదల చేయకుండా జాప్యం చేసుకుంటూ వచ్చారు. తీరా దగ్గరకు వచ్చేసాక, టెండర్లకు సమయం లేదంటూ మళ్లీ నామినేషన్ పద్దతికే ఓకే అనేసారు. దీంతో ఎవరికి కావాల్సిన వారికి వారు పనులు అప్పగించేసారు. దీంతో పనులు ఎలా జరగాలో అలాగే జరిగాయి.

పత్రికలన్నీ ఈ విషయమై వార్తలు రాయడంతో చినబాబు ఇప్పుడు రంకెలు వేస్తున్నారు. కాంట్రాక్టర్ల పని పడతాం అంటున్నారు. గోదావరి పుష్కరాల విషయంలో ఇలాంటిది ఏమన్నా జరిగి వుంటే, ఇప్పుడు నమ్మే వారేమో? అప్పుడు  లేనిది ఇప్పుడు మాత్రం ఎక్కడ నుంచి జరుగుతుంది. ఏదో మీడియా రాసుకోవడానికే ఈ  ‘ లేస్తే మనిషిని కాదు’ అనే రంకెలు. అంతే.

Show comments