వాళ్లది కామెడీ కాదు.. పూర్తి ఇరకాటంలో ధనుష్!

తమిళ స్టార్  హీరో ధనుష్ తమ తనయుడు అంటూ కదిరేశన్ దంపతులు దాఖలు చేసిన పిటిషన్ ను చాలా మంది కామెడీగా భావించారు. ధనుష్ తమ తనయుడు అని.. కొన్నేళ్ల కిందట ఇంటి నుంచి పారిపోయి.. డైరెక్టర్ కస్తూరి రాజాను కలిశాడని.. అతడు ధనుష్ ను తన కొడుకుగా తీసుకున్నాడని.. హీరోని చేసి, సినిమాల్లోకి తీసుకొచ్చాడని… ఇప్పుడు ధనుష్ తమను పూర్తిగా మరిచిపోయాడని, వృద్ధులైన తమకు ఇప్పుడు  ఆసరా లేదని, కాబట్టి ధనుష్ నెల నెలా అరవై ఐదు వేల రూపాయలు తమకు ఇవ్వాలని కదిరేశన్ దంపతులు కోర్టులో దాఖలు చేసిన పిటిషన్లలో కోరారు.

మరి వీరు నెల నెలా భత్యం ఇవ్వాలని కోరడంతోనే… వీళ్ల అసలు ఉద్దేశం ఏమిటో స్పష్టం కావడంతో, వీరి వాదనను కామెడీగా తీసుకున్నారంతా. కేవలం డబ్బు కోసం, సంచలనం కోసమే ఇలాంటి పని చేస్తున్నారనే అభిప్రాయమే బలపడింది. అయితే కోర్టు మాత్రం వీరి పిటిషన్ ను స్వీకరించింది, సీరియస్ గా తీసుకుంది, ధనుష్ కు నోటీసులు జారీ చేసింది.

కదిరేశన్ దంపతుల కొడుకు కాదు.. అనే విషయాన్ని ధనుష్ నిరూపించుకోవాల్సి వస్తోంది. అయితే.. ఈ విషయంలో ధనుష్ క్రమక్రమంగా ఫెయిల్ అవుతున్నాడు. ధనుష్ పుట్టుమచ్చల పరిశీలనలో తొలి అంకంలో ఇప్పటికే కదిరేశన్ దంపతులు విజయం సాధించారు. టెన్త్ క్లాస్ మార్క్ షీట్ ప్రకారం.. కదిరేశన్ దంపతులు పుట్టుమచ్చల వివరాలను కోర్టుకు సమర్పించగా, ధనుష్ వైపు నుంచి ఎలాంటి ఆధారాలూ ఇవ్వలేదు. మరి కదిరేశన్ దంపతులు ఇచ్చిన పుట్టుమచ్చల గురించి ప్రభుత్వ వైద్యులు జరిపిన పరీక్షలో ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది.

ధనుష్ పుట్టుమచ్చలను తీయించేసుకున్నాడు… అని వైద్యులు తేల్చారు. అధునాతన సాంకేతికతను ఉపయోగించుకుని ధనుష్ ఆ పని చేశాడని వైద్యులు తెలిపారు. మరి దీని భావమేమి? అనేది చర్చ మొదలైందిప్పుడు. తను కదిరేశన్ దంపతుల తనయుడు కాదనే విషయాన్ని నిరూపించుకోవడానికి ధనుష్ ఈ పని చేశాడా? అనే మాటకు అవకాశం ఏర్పడిందిప్పుడు. కదిరేశన్ దంపతులు అదే వాదన వినిపిస్తారిక. 

Readmore!

ధనుష్ వారి కొడుకు… అంటే నిన్నటి వరకూ అంతాకామెడీగా చేశారు. ఇప్పడు వారికి వెయ్యేనుగుల బలం వచ్చింది. ఈ కేసు మరింత సంక్లిష్టంగా మారింది. ధనుష్ ఇరకాటంలో పడిన వైనం స్పష్టం అవుతోంది. మరి ఇంకా ఎలాంటి మలుపులు ఉండబోతున్నాయో!

Show comments