చంద్రబాబు స్క్రిప్ట్‌.. పవన్‌ యాక్షన్‌.!

'ఇచ్చింది తీసుకోవాల్సిందే.. అలాగే, ప్రత్యేక హోదా కోసం నినదించాల్సిందే..' 

సీమాంధ్ర హక్కుల జన చైతన్య వేదికపైనుంచి జనసేన పార్టీ అధినేత పవన్‌కళ్యాణ్‌ చేయబోయే ప్రసంగం తాలూకు పూర్తి పాఠం ఇలాగే వుండబోతోందట. నవంబర్‌లో అనంతపురంలో జనసేన పార్టీ ప్రత్యేక హోదా కోసం భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్న విషయం విదితమే. దీనికి సంబంధించి ఏర్పాట్లను టీడీపీకి చెందిన కొందరు ముఖ్య నేతలే పర్యవేక్షించబోతున్నారంటూ రాజకీయ వర్గాల్లో గుసగుసలు విన్పిస్తున్నాయి. 

'నాకు ఒకరు సహాయ పడాలా.? నేను ఒకరికి వంగి వంగి నమస్కారాలు చెయ్యాలా.?' అంటూ వేదికలెక్కి పవన్‌కళ్యాణ్‌ బీభత్సమైన డైలాగులు పేల్చేస్తారుగానీ, 2014 ఎన్నికలకు ముందు నుంచీ చంద్రబాబు అంటే పవన్‌కళ్యాణ్‌కి అదేదో ఇది. అందుకే, ఓటుకు నోటు కేసు విషయంలో అయినా, అమరావతి భూ సమీకరణ వివాదంలోగానీ, భీమవరంలో మెగా ఆక్వాఫుడ్‌ పార్క్‌ వివాదంలోగానీ పవన్‌కళ్యాణ్‌ ప్రవర్తన, చంద్రబాబు విషయంలో ఒకేలా వుంది. 

అన్ని సందర్భాల్లోనూ పవన్‌కళ్యాణ్‌, చంద్రబాబునే వెనకేసుకొస్తున్నారు. మొన్నటికి మొన్న కాకినాడ బహిరంగ సభలో కూడా, చంద్రబాబుని విమర్శించే సాహసం చేయని పవన్‌, బీజేపీపై మాత్రం దుమ్మెత్తి పోసేశారు. అప్పట్లోనే, 'చంద్రబాబు స్క్రిప్ట్‌నే పవన్‌కళ్యాణ్‌ చదువుతున్నారు..' అనే విమర్శలు బీజేపీ నుంచి విన్పించాయి. 

తాజాగా, ప్రత్యేక హోదా - ప్రత్యేక ప్యాకేజీ విషయంలో చంద్రబాబు, పవన్‌కళ్యాణ్‌ పేరుని ప్రస్తావిస్తూ, 'ప్యాకేజీని పవన్‌కళ్యాణ్‌ అధ్యయనం చేస్తున్నారు..' అనే సంకేతాలు ఇచ్చారు. ఆ సంకేతాలకు బలం చేకూర్చేలా, పవన్‌ ఓ టీమ్‌ని పెట్టుకుని ప్యాకేజీని అధ్యయనం చేస్తున్నారనే గాసిప్‌ తెరపైకి వచ్చింది. కాకినాడ సభ తర్వాతే పవన్‌కళ్యాణ్‌ ఈ అధ్యయనంపై ఓ ప్రకటన చేశారనుకోండి.. అది వేరే విషయం. అయితే ఆ టీమ్‌ని కూడా చంద్రబాబే 'సమర్పించారు' అన్నది తాజా గాసిప్‌ సారాంశం. 

ఇకనేం, ఆ టీమ్‌ రాసిచ్చిన స్క్రిప్ట్‌ని చదవడానికే పవన్‌కళ్యాణ్‌, అనంతపురం సభను వేదికగా చేసుకుంటున్నారని ఫిక్సయిపోవచ్చు. 'నా దగ్గర డబ్బులు లేవు..' అని పదే పదే చెప్పుకుంటున్న పవన్‌కళ్యాణ్‌కి, బహిరంగ సభలు నిర్వహించడానికి ఆర్థిక సహాయం ఎలా అందుతోందబ్బా.? అంటే, ఇదిగో ఇలా.. టీడీపీ సహకారంతో.. అన్న విమర్శలకు జనసేన నుంచి ఇంతవరకు సరైన స్పష్టతే రాలేదు. ఎందుకొస్తుంది, చంద్రబాబు డైరెక్షన్‌లో పవన్‌కళ్యాణ్‌ పనిచేస్తున్నప్పుడు.!

Show comments