పవన్‌ పోటీ: అదిగో పులంటే, ఇదిగో తోక!

'అనంతపురం నుంచి పోటీ చేయాలని ఉంది...' అని అన్నాడంతే, మీడియా అందుకునేసింది. పవన్‌కల్యాణ్‌ అనంతపురం జిల్లా కదిరి నియోజకవర్గం నుంచి పోటీ చేయబోతున్నాడని గత కొన్ని రోజులుగా హడావుడి చేస్తోంది ఒకవర్గం మీడియా. తెలుగుదేశం పార్టీకి జాకీ లేసే మీడియా వర్గాలన్నీ ఇప్పుడు పవన్‌కల్యాణ్‌ను భుజనా మోస్తున్నాయని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చంద్రబాబు అవసరాల కోసం పవన్‌ బాబును మోస్తున్నాయి ఈ మీడియా వర్గాలు. వెనుకటికి చిరంజీవిని కూడా అచ్చం ఇలాగే మోశాయి.. ఆంధ్రలో ఇంద్రపార్టీ.. అని మొదలుపెట్టి, ఎప్పుడు ఎక్కడ ఎలా పడేయాలో అక్కడ పడేశాయి. వాటి ధాటికి ఎన్నికలు రాకనే చిరంజీవి పరువుపోయింది. మెగాస్టార్‌ బొక్క బోర్లాపడ్డాడు.

మరి ఆల్రెడీ చిరంజీవిని మోసిన అనుభవం, పడేసిన అనుభవం కలిగిన మీడియానే ఇప్పుడు పవన్‌నూ మోస్తోంది. అదే మీడియా వర్గమే పవన్‌ గురించి ఏదో ఒక పోచికోలు కబురు చెబుతోంది. అలాంటి కబుర్లలో ఒకటి.. పవన్‌ అనంతపురంజిల్లా కదిరి నుంచి పోటీ చేయబోతున్నాడు.. అనేది! మరి అనంతపురం జిల్లాలో పోటీ చేయాలని ఉంది.. అని పవన్‌కల్యాణ్‌ చెప్పింది నిజమే, పోటీ చేయాలని ఉందన్నాడు కానీ, చేస్తానని అనలేదు. ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయం ఉంది.. ఇలాంటి సమయంలో ఎవ్వరైనా లక్షాతొంభై చెబుతారు. మరి పవన్‌ ఒకమాట చెప్పగానే.. ఏకంగా ఆ జిల్లాలో నియోజకవర్గాన్ని కూడా ఫిక్స్‌ చేయడం ఏమిటి? అంటే.. అదో బీరకాయ పీచు వ్యవహారం!

అత్యంత అసంబద్ధమైన వ్యవహారాన్ని పట్టుకుని పవన్‌ కదిరి నుంచి పోటీ చేయనున్నాడనే మాట మట్లాడుతున్నాయి తెలుగుదేశం అనుకూల మీడియా వర్గాలు. అత్తారింటికి దారేదీ సినిమాలో 'కాటమ రాయుడా.. కదిరి నరసింహుడా..' అనే పాట ఉంది కదా, అది హిట్‌ అయ్యింది కదా, కాబట్టి పవన్‌కు కదిరి కలిసొచ్చిందట.. కాబట్టి.. పవన్‌ కదిరి నుంచి పోటీ చేస్తాడంతే! వీరి లాజిక్‌ వింటే తలతిరిగి పోదా మరి!

అత్తారింటికి దారేదీ సినిమాలో పాట తప్ప.. పవన్‌ కదిరి నుంచి పోటీ చేస్తాడనేందుకు ఎలాంటి సంబద్ధమైన రీజనూ లేదు. కదిరి రాజకీయ సమీకరణాలు పవన్‌కల్యాణ్‌కు అనుకూలంగా ఉంటాయని కానీ, పవన్‌కు ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ పరంగా కదిరిలో మంచి బేస్‌ ఉందని కానీ.. చెప్పడానికి ఏమీలేదు. సినిమాలో కదిరి ప్రస్తావన వచ్చింది కాబట్టి.. పవన్‌ కదిరి నుంచి పోటీ చేస్తాడట! అదీ లాజిక్‌.

పవన్‌కల్యాణ్‌ మరీ అంత అమాయకుడు కాదు. ఏ మాత్రం రాజకీయ అవగాహన ఉన్నా ఆయన అనంతపురంజిల్లా నుంచి పోటీచేయడు. సోలోగా పోటీ చేసినా, తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుని పోటీ చేసినా.. అనంతపురం నుంచి పోటీచేయడు జనసేన అధినేత. ఒకవేళ సోలోగా పోటీ చేస్తే ప్రయోజనం శూన్యం. పవన్‌ను ఓన్‌ చేసుకునే బలిజల జనాభా అనంతపురం జిల్లాలో ఉన్నది అంతం తమాత్రమే. ఇక కరువు కాటకాలతో ఉక్కిరికి బిక్కిరి అవుతున్న రైతులు గతఎన్నికల్లో పవన్‌కల్యాణ్‌ సినిమాలను చూసి ఊగిపోయేవాళ్లేమీ కాదు. వీరి ఓట్లు పవన్‌కు రాలతాయని అనుకోవడానికి మించిన భ్రమ ఉండదు. ఎందుకంటే.. గత ఎన్నికల్లో తెలుగుదేశం తరపున పవన్‌కల్యాణ్‌ ఈ ప్రాంతమంతా తిరిగాడు. తెలుగుదేశం హామీలకు తను పూచీ అని చెప్పుకొచ్చాడు. మరి అనంత రైతులు బోలెడంత ఆశలు పెట్టుకున్న రుణమాఫీ హామీ ఏమైందో వివరించనక్కర్లేదు.

ఇక మరో అంశం.. చిరంజీవి అనుభవాన్ని జనాలు ఇంకా మరిచిపోలేదు. అప్పట్లో చిరంజీవి పార్టీకి ఓట్లేసిన మాస్‌ ఓటర్లు.. ఆ పార్టీ కాంగ్రెస్‌లో విలీనం అయ్యే సరికే విస్తుపోయారు. అన్న కథ అలా అయ్యింది, ఇప్పుడు తమ్ముడొచ్చాడురా.. అనే భావనే పోవడం కష్టం. రాజకీయం విషయంలో మెగా ఫ్యామిలీపై నమ్మకం పోయిందిప్పటికే. పవన్‌ను చిరంజీవికి తమ్ముడిగానే చూస్తారక్కడ. అలాగే బీసీల్లో తెలుగుదేశం పార్టీకి మంచి పట్టుంది. ఆఖరికి ప్రజారాజ్యం ఆవిర్భవించినప్పుడు కూడా బీసీలు జై తెలుగుదేశమే అన్నారు, కొంతశాతం బలిజ ఓటు బ్యాంకును కూడా చిరంజీవి ఆకర్షించలేకపోయాడప్పుడు, మరి చిరంజీవితో కాని పని పవన్‌తో అవుతుందనుకోవడానికి మించిన పొరపాటులేదు. 

సోలోగా పోటీ చేస్తే పవన్‌ పరిస్థితి అది.. 18 నుంచి 30 వయసు మధ్యలో గత కొద్దిశాతం మంది ఓట్లను మాత్రం పవన్‌ పొందగలడు. వాటి వల్ల ఎలాంటి ఉపయోగమూ ఉండదు. ఇక రెండో కేస్‌.. తెలుగుదేశంతో పొత్తు పెట్టుకుని బరిలోకి దిగడం. టీడీపీ, పవన్‌లకు సీట్ల ఒడంబడిక కుదిరితే.. పవన్‌కు తెలుగుదేశం పార్టీ అనంతపురం జిల్లాలో ఎక్కడో ఒక చోట పోటీ చేయడానికి అవకాశం ఇవ్వొచ్చు. తెలుగుదేశం మద్దతుతో పోటీ చేస్తే పవన్‌ కొంత సేఫ్‌జోన్లో ఉన్నట్టే. అదే సమయంలో డేంజర్‌ జోన్లో కూడా ఉన్నట్టే!

డేంజర్‌ ఏమిటంటే.. చంద్రబాబు నాయుడు! నిస్సందేహంగా అలాంటి పరిస్థితి వస్తే, చంద్రబాబే పవన్‌ను ఓడించడానికి పక్కా స్కెచ్‌ వేస్తాడు. పొత్తులు పెట్టుకోవడం, పొత్తులను ఉల్లంఘించడం బాబుకు వెన్నతో పెట్టిన విద్య. ఆఖరికి సొంత బామ్మర్ధిని, వియ్యంకుడిని మొన్నటి ఎన్నికల్లో హిందూపురం నుంచి ఓడించడానికి బాబు తీవ్రంగా ప్రయత్నించాడనే పేరుంది జిల్లాలో. అంతేకాదు.. పీఏ వ్యవహారాన్ని అడ్డంపెట్టుకుని బాలయ్యపరువును తీసింది చంద్రబాబు కాదని ఎవరైనా చెప్పగలరా? తనకు ప్రత్యామ్నాయంగా మారతారనే భయం ఉన్న నేతల పతనానికి స్కెచ్‌లు వేయడమే కానీ.. పొత్తు పెట్టుకుని పవన్‌ను గెలిపించే బాధ్యతను తీసుకునే టైపు చంద్రబాబు.

పైకి మెత్తగానే ఉండి, తమకు స్ట్రాంగ్‌ హోల్డ్‌ ఉన్నచోట పవన్‌ను పోటీ చేయించి.. అక్కడ ఓడించిన ఓడించగలడు చంద్రబాబు. ఇవి ఒట్టి ఊహాగానాలు కాదు, గతానుభవాల ఫలితాలు. మరి ఇవేవీ పవన్‌కు తెలియనివి కావు. అందుకే ఆయన అనంతజిల్లా నుంచి ఎట్టి పరిస్థితుల్లోనూ పోటీ చేయడు. సామాజికవర్గ సమీకరణాలు అను కూలంగా ఉన్న చోట నుంచి మాత్రమే జనసేనాధినేత పోటీకి దిగుతాడు. ఈ విషయంలో నిస్సందేహంగా బెట్‌ కాయొచ్చు.

Show comments