రాజకీయ నాయకులు చిత్రవిచిత్రంగా ప్రవర్తిస్తుంటారు. పొంతన లేకుండా, మతి లేకుండా మాట్లాడుతుంటారు. ఒకే విషయంపై అధికారంలో ఉన్నప్పుడు ఒకవిధంగా, లేనప్పుడు మరోవిధంగా మాట్లాడతారు. దేశంలో తానే అత్యంత సీనియర్ నాయకుడినని, తనతో సమానులెవ్వరూ లేరని అదే పనిగా ఊదరగొడుతున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏం మాట్లాడతారో ఆయనకే అర్థం కాదనిపిస్తోంది. తమ్ముళ్లు కూడా ఆయన టైపేననుకోండి. వైఎస్సార్‌సీపీ అధినేత జగన్‌కు విపరీతమైన అధికార దాహం ఉందని చంద్రబాబు సహా టీడీపీ నేతలు రోజూ విమర్శిస్తుంటారు. వారి విమర్శలకు తగ్గట్లుగానే జగన్ కూడా ఎన్నికలకు ముందే బాబు ప్రభుత్వం కూలిపోతుందని, ఏడాది ఓపిక పడితే తాను అధికారంలోకి వచ్చి కష్టాలు తీరుస్తానని అంటుంటారు. కాని అధికార దాహం చంద్రబాబుకు, టీడీపీ నాయకులకు లేదా? రాజకీయ నాయకులకు అధికారదాహం ఉండటం వింత, విడ్డూరం కాదు. ఏ రాజకీయ పార్టీకైనా, అధినేతకైనా ప్రధాన లక్ష్యం అధికారం చేజిక్కించుకోవడమే.
ఈ విషయంలో జగన్ అదేపనిగా ప్రచారం చేసుకుంటూ అధికారదాహం ఉన్నవాడిగా కనబడుతున్నారు. మీడియాలో జగన్ అధికార దాహానికి వస్తున్నంత ప్రచారం బాబు దాహానికి రావడంలేదు. సందర్భం దొరికినప్పుడల్లా ముఖ్యమంత్రి తన అధికార దాహాన్ని వ్యక్తపరుస్తూనే ఉన్నారు. కాని జగన్ మాత్రమే అధికారం కోసం తాపత్రయపడుతున్నారన్న భావన ప్రజల్లో కలిగిస్తున్నారు. 'ఏపీలో తెలుగుదేశం పార్టీ శాశ్వతంగా అధికారంలో ఉండాలి'...అని చంద్రబాబు అనేకసార్లు అన్నారు. తాజాగా పార్టీ విజయవాడలో నిర్వహించిన వర్క్‌షాపులోనూ తన ఆకాంక్షను వ్యక్తం చేశారు. టీడీపీ శాశ్వతంగా అధికారంలో ఉండాలంటే అర్థమేమిటి? మరో పదేళ్లపాటైనా తాను సీఎంగా ఉండాలని, ఆ తరువాత కుమారుడు లోకేష్ పీఠం ఎక్కాలని చంద్రబాబు కోరిక. దీన్ని అధికారదాహం అనకుండా ఇంకేమంటారు? కొంతకాలం క్రితం ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ టీడీపీ శాశ్వతంగా అధికారంలో ఉండాలన్నారు. ఇండియా టుడే నిర్వహించిన సదస్సులో మాట్లాడినప్పుడూ ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. కాని జగన్‌కే అధికారదాహం ఉందన్నట్లు మాట్లాడుతున్నారు.
పూర్వకాలంలో ఒక్కో రాజవంశం వందల ఏళ్లపాటు రాజ్య పరిపాలన చేసినట్లు చరిత్ర పాఠాల్లో ఉంది. అదేవిధంగా 'నారా వంశం' మాత్రమే శాశ్వతంగా రాష్ట్రాన్ని పరిపాలించాలని బాబు ఆకాంక్ష కావొచ్చు. టీడీపీ వచ్చే ఎన్నికల్లోనూ అధికారానికి రావాలనుకోవడం వేరు, శాశ్వతంగా అధికారంలో ఉండాలనుకోవడం వేరు. మొదటిది ఆశ. రెండోది దురాశ, అత్యాశ. శాశ్వతంగా తమ పార్టీయే అధికారంలో ఉంటుందనుకోవడం అహంకారం కూడా. ఇది ప్రజాస్వామ్యమనే విషయం బాబు మరిచిపోయినట్లుగా ఉంది. శాశ్వతంగా అధికారంలో ఉండాలనుకోవడం, ప్రతిపక్షాలు ఉండకూడదనుకోవడం...ఇలాంటి భావనలు రాచరిక లక్షణాలు. హద్దులు దాటిపోతున్న చంద్రబాబు ప్రచార కండూతిని, గొప్పలను ఆపడం ఎవ్వరి తరం కాదు. ఈమధ్య 'ఇండియా టుడే' చెన్నయ్‌లో నిర్వహించిన 'సౌత్ కాంక్లేవ్'లో చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఇండియా టుడే జాతీయ మీడియా కదా. ఇక్కడ గొప్పలు చెప్పుకుంటే జాతీయ స్థాయిలో బ్రహ్మాండమైన ప్రచారం లభిస్తుందన్న ఉద్దేశంతో విజృంభిచారు.
'హైదరాబాదు కంటే పెద్దదైన, మెరుగైన, సౌకర్యవంతమైన రాజధాని నగరం నిర్మిస్తాను. భారత్‌లో అమరావతి ఉత్తమ నగరం అవుతుంది' అని చెప్పారు. ప్రపంచశ్రేణి రాజధాని నగరం, వాటర్ గ్రిడ్, మానవ వనరుల అభివృద్ధి ...ఈ మూడింటికి తన ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తుందన్నారు. 'ప్రజలు నన్ను కలకాలం గుర్తుంచుకోవాలి. ఆంధ్రప్రదేశ్‌ను ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దుతాను'..అని చెప్పారు చంద్రబాబు. ఈయన చెప్పిందాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? హైదరాబాదును మించిన రాజధాని నిర్మించేంతవరకు చంద్రబాబు నాయుడే ముఖ్యమంత్రిగా ఉంటారనుకోవాలి. ఇప్పటి హైదరాబాదులా అమరావతిని అభివృద్ధి చేయాలంటే చంద్రబాబు మరో అరవై ఏళ్ల ముఖ్యమంత్రిగా ఉండాలి. అది సాధ్యమా?
డెబ్బయ్యో పడికి దగ్గరగా వస్తున్న చంద్రబాబు మరో అరవై ఏళ్లు సీఎంగా ఉండగలరా? 2019 ప్రథమార్ధంలో ఎన్నికలు జరుగుతాయి. అంటే ఆయన టర్మ్ పూర్తవడానికి రెండేళ్ల సమయమే ఉంది. అమరావతి నిర్మాణంలో ఇప్పటివరకు ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. ఇలాంటప్పుడు హైదరాబాదును మించిన నగరం ఎన్నేళ్లలో నిర్మిస్తారు? నాలుగొందల ఏళ్లకు పైబడి చరిత్ర ఉన్న హైదరాబాద్ అనేకమంది కృషి ఫలితంగా ఇప్పుడీ స్థాయికి చేరుకుంది. కాబట్టి నగరాన్ని మొత్తం తానే నిర్మించానని, ఆ క్రెడిట్ అంతా తనకే దక్కాలని ఎవ్వరూ క్లెయిమ్ చేసుకునేందుకు, జబ్బలు చరచుకునేందుకు వీల్లేదు. ఫలానా నిర్మాణం నా హయాంలో జరిగిందని ఏ ముఖ్యమంత్రయినా చెప్పుకోవచ్చు. తప్పు లేదు. అంతేగాని మొత్తం నగరాన్ని నేనే ఒంటిచేత్తో నిర్మించానని ఎవరైనా చెప్పుకుంటే ఏమనుకోవాలి?