‘అర్థక్రాంతి’ అనిల్ బోకిల్… మోడీపై మండిపాటు!

ప్రతిపక్షాలు కాదు.. మీడియా కాదు.. బాధితులు కాదు.. అసలు ఎవరి సలహా మేరకు అయితే మోడీ ఈ నోట్ల రద్దు నిర్ణయాన్ని తీసుకున్నారని తొలి రోజు నుంచి ప్రచారం జరిగిందో ఇప్పుడు అదే వ్యక్తి ప్రధానమంత్రి తీరుపై, ప్రభుత్వ విధానంపై అసహనం వ్యక్తం చేశారు! 

మోడీ నిర్ణయం వెనుక వ్యక్తిగా.. వార్తల్లోకి వచ్చిన ‘అర్థక్రాంతి’ సిద్ధాంత కర్త అనిల్ బోకిల్ కరెన్సీ విషయంలో భారత ప్రభుత్వ తీరును తప్పుపట్టాడు. మారకంలోని ఐదువందల, వెయ్యి నోట్ల రద్దు.. తదనంతర పరిణామాలపై స్పందిస్తూ… ప్రభుత్వం అనుసరిస్తున్న విధానం సరికాదని స్పష్టం చేశాడాయన!

అనిల్ బోకిల్ ఈ ఏడాది జూలైలో ప్రధానమంత్రితో సమావేశం అయ్యారు. అంతకు ముందే ‘అర్థక్రాంతి’ పేరుతో తను రూపొందించిన ఆర్థిక సిద్ధాంతాలను ప్రచారం చేస్తున్న ఆయనకు మోడీతో తొమ్మిది నిమిషాల పాటు సమావేశం అయ్యే అవకాశం లభించింది. జూలైలో అర్థక్రాంతి గురించి బోకిల్ మోడీకి వివరించాడు.

తను మొత్తం ఐదు పాయింట్ల రూపంలో అర్థక్రాంతి గురించి వివరిస్తే.. మోడీ ప్రభుత్వం కేవలం రెండు పాయింట్లనే పరిగణనలోకి తీసుకుని ‘సెలెక్టివ్’ గా వ్యవహరించిందని బోకిల్ అంటున్నారు. ఇలా వ్యవహరించడం వల్ల ఏ మాత్రం ప్రయోజనం ఉండదని, దీన్ని సమర్థించేటందుకూ ఏమీ లేదు, వ్యతిరేకించేటందుకూ ఏమీ లేదని ఈ ఆర్థికవేత్త స్పష్టం చేశాడు.

తమ నిర్ణయాలను మోడీ ప్రభుత్వం అమలు పరుస్తున్న విధానం సమంజసంగా లేదని కూడా ఈయన వ్యాఖ్యానించడం విశేషం. సామాన్యులను, మధ్య తరగతి ప్రజలను బ్యాంకుల క్యూ లైన్లలో నిలబెట్టి.. మోడీ ప్రభుత్వం వారిని ముప్పుతిప్పులు పెడుతోందని అన్నారు.

ప్రత్యక్ష, పరోక్ష పన్నులను పూర్తిగా రద్దు చేయడం, బ్యాంక్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ ను ప్రవేశ పెట్టడం, రూ.50 మినహా ఆపై విలువ ఉన్న అన్ని నోట్లనూ రద్దు చేయడం, రెండువేల రూపాయలకు మించిన క్యాష్ ట్రాన్సాక్షన్స్ విషయంలో చట్టపరమైన పరిమితులు పెట్టడం.. వంటి సూచనలు ఉన్నాయి ‘అర్థక్రాంతి సిద్ధాంతం’ లో. అయితే వీటిలో మోడీ ప్రభుత్వం పరిగణనలోకి తీసుకున్న అంశాలు ఏమిటో అందరికీ తెలిసిందే.

పన్ను విధానంలో, ఇతర వ్యవహారాల్లో ఆర్థిక వేత్తల సూచనలేమీ తీసుకోకుండా ఉన్న ఫలంగా మారకంలోని నోట్ల మార్పిడి అంటూ సామాన్యులను ముప్పుతిప్పలు పెడుతున్నారు. ఫలితంగా పక్షం రోజులు అయినా గడవకముందే.. ఎవరి సలహా మేరకు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారన్నారో అదే వ్యక్తి నుంచి పెదవి విరుపులను ఎదుర్కొంటున్నారు. మరి ఇప్పుడు మోడీభక్తులేమంటారో.. ఈ సిద్ధాంత కర్తను కూడా నల్లధనికుడు అనేస్తే పోలా!

Show comments