ఆమె ఆడింది తెలంగాణతో, ఈయన ఆడుతోంది కాపులతో!
తెలంగాణ ఇచ్చీ గల్లంతైన కాంగ్రెస్!
ఆ పతనం నుంచి పాఠం నేర్వని చంద్రబాబు
అచ్చం సోనియా తీరునే ఆలోచన, ఆట!
ఈయనకూ అదే గతే?!
వ్యక్తులు వేరు.. ఉద్దేశం వేరు.. పాలకులు వేరు.. ప్రజలు వేరు! కానీ ఫలితం మాత్రం ఒక్కటే! ఇదీ ఉద్యమసూత్రం. ఉద్యమిస్తున్న వాడి మనస్తత్వం ఎప్పుడూ ఒకేలా ఉంటుంది. పాలిస్తున్న వాడి ఆలోచన ప్రతిసారి దాని అణచగలననే ధీమానే కలిగిస్తుంది! అంతా తన వెంటే ఉన్నారనే భ్రమనే కలిగిస్తుంది. ఇలా చరిత్ర చూపిన దారిలోనే సాగుతున్న ఉద్యమం కాపు ఉద్యమం. మొన్న సోనియాగాంధీ తెలంగాణ ఉద్యమంతో వ్యవహరించిన తీరునే నేడు కాపు ఉద్యమంతో వ్యవహరిస్తున్న వ్యక్తి చంద్రబాబు.
అడుగడుగునా ఒకేబాణీలో కొనసాగుతున్న ఈ ఉద్యమాల్లో ఒకదాని(తెలంగాణ) ఫలితం వచ్చేసింది. అందుకు పర్యవసనంగా వచ్చిన కాపు ఉద్యమం ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి? ఇప్పుడు పాలకుడి పరిస్థితి ఏమిటి? తెలంగాణ ఉద్యమం దరిమెల సోనియాకు తెలుగు ప్రజలు చేసిన సన్మానాన్నే.. రేపు ఆంధ్రా ప్రజలూ చంద్రబాబుకు చేయబోతున్నారా?! దీనికి సమాధానం ‘ఔను’ అంటోంది చరిత్ర! మరి చంద్రబాబు చరిత్రను మార్చగల సమర్థుడా?! ఆయన మాటల్లో కాదు.. వాస్తవంలో?
ప్రపంచ చరిత్రలో ఆ పదానిది ప్రత్యేక ప్రస్థానం! ప్రజాస్వామ్యం, స్వామ్యవాదాలు పుట్టక మునుపు.. కమ్యూనిజాలు, పాసిజాలు తెరపైకి రాక ముందు నుంచే ఎంతోమంది పాలకుల, రాజ్యాల గతిని మార్చిందది! తమకు తిరుగులేదని విర్రవీగిన నియంతల పాలనకు చరమగీతం పాడింది! సందర్భాలను బట్టి ప్రాణాలనూ తీసింది! మానవ పరిణామ క్రమంలో పాలకులు, ప్రభువులు ఏర్పడిన దగ్గర నుంచి అది వారి ప్రస్థానాలను శాసిస్తూనే ఉందది! ఇంతకీ ఏంటది? నేతల తల రాతలు మార్చిన అది ‘యుద్ధమా’? అంటే కాదు. యుద్ధాలకు మించినది.. ప్రపంచ రాచరిక చరిత్రను ఎక్కువ సార్లు ప్రభావితం చేసినది.. యుద్ధాల కన్నా ఎక్కువ ప్రభావితం అయినది యుద్ధానికి మించినది ‘ఉద్యమం’.
మాకేమని విర్రవీగిన పాలకులను.. పతానవస్థలకు గురిచేసినవి ఉద్యమాలే! శతాబ్దాల పాటు అనువంశికంగా పాలకులుగా చెలామణి అయిన వారికి చరమగీతం పాడింది ఉద్యమలే! అత్యంత ప్రభావం చూపిన ఉద్యమాలను.. పాలకులను ప్రజలే మార్చేసిన ఉద్యమాలను ‘విప్లవాలు’గా పిలుచుకుంటూ.. చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించుకున్నాం! వాటినే సబ్జెక్టులుగా చదువుకుంటున్నాం! ఎందుకంటే.. ఆ విప్లవాలకు, ఉద్యమాలకు మానవాళి ప్రస్థానాన్ని మార్చిన చరిత్ర ఉంది. వాటికి పాలకులు ఒక లెక్క కాదు!
ఒకసారి కాదు.. ఒక చోటని కాదు.. ఏ దేశ చరిత్రను పరిశీలించి చూసినా సుస్పష్టంగా అర్థమయ్యే రాజనీతి ఇది! పదో తరగతి పాఠంగా చదువుకునే ఫ్రెంచి విప్లవం దగ్గర నుంచి మొన్నటి వరకూ వార్తల్లోనే ఉండిన అరబ్ స్ప్రింగ్ వరకూ.. ప్రతిదాని ప్రస్థానం ఒకేలా కనిపిస్తుంది. ప్రతిదీ పాలకులు పారిపోయేలా చేసింది. దొరికితే వాళ్ల ప్రాణాలను తీసింది! మరి మనది ప్రజాస్వామ్యం.. భారతీయ మనస్తత్వం ప్రకారం ఇక్కడ హింసాత్మక విప్లవాలు రావు! వచ్చినా అవి కొనసాగవు! ఇది మన దేశ చరిత్ర చెప్పే పాఠమే! లేకపోతే.. ఐదు వందల సంవత్సరాల పాటు భారతదేశం పరాయి జాతీయుల పాలనలో మగ్గదు.
దేనికైనా రాజీపడిపోయే మనస్తత్వం.. చెడులోనూ మంచిని చూసుకునే తత్వం పాలకులను భరించేలా చేస్తోంది. అయిననూ.. ఏదో విధంగా ఈ దేశం దాస్యవిముక్తి అవుతూ వచ్చింది. అరబ్బులు దేశంపైకి దండెత్తి వచ్చినప్పుడు ఏకమైన రాజపుత్ర రాజులైతేనేమీ... ఎదురించిన వైనం దగ్గర నుంచి రెండువందల ఏళ్ల కైనా బ్రిటీష్ వారిని తిప్పిపంపడం ద్వారా అయితేనేం.. భారతీయులు తమకూ ఉద్యమస్ఫూర్తి ఏమిటో తెలుసనే సంకేతాలను ఇస్తూనే ఉన్నారు.
స్వతంత్ర భారతదేశంలో.. ప్రజాస్వామ్య లౌకిక గణతంత్ర రాజ్యంలోనూ ఉద్యమాలకు కొదవే లేదు! ఇవి కూడా పాలకుల, ప్రజాస్వామ్యంలోని పార్టీల మెడకు చుట్టుకుంటేనే ఉన్నాయి! విప్లవానికి, ఉద్యమానికి ఉన్న సహజమైన లక్షణాన్ని నిరూపించుకొంటూనే ఉన్నాయి! అయితే.. పాలకులే రాజనీతి శాస్త్రాన్ని పరిశీలించడం లేదు. తమకు మించిన చాణుక్యులు లేరన్న అతి విశ్వాసమో లేక నిర్లక్ష్యమో కానీ.. వీళ్లను నిండా ముంచేస్తూ వచ్చింది. పదే పదే ఈ ప్రక్రియ పునారవృత్తం అవుతూనే ఉంది!
ఎలాగంటే.. మొన్నటి తెలంగాణ ఉద్యమం బాటలోనే నేడు కాపు ఉద్యమం కొనసాగుతున్నట్టుగా! తెలంగాణ ఉద్యమం ఆంధ్రప్రదేశ్‌ను రెండుగా చీల్చడమే కాదు.. ఈ రెండు రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్ పార్టీకి సమాధి కట్టింది! ప్రజల్లో వచ్చే ప్రతి ఉద్యమానికి పాలకుడు బలి కావాల్సిందే అనే రాజనీతిని అనుసరించింది ఆ ఉద్యమం. ఎన్నో సంవత్సరాల కిందటి కథేమీ కాదు! రాజశేఖరరెడ్డి మరణానంతరం ఆరేళ్ల కిందట తెలంగాణ ఉద్యమం కూడా ఇప్పుడు కాపు ఉద్యమం మొదలైనట్టుగానే మొదలైంది. ఇది అడుగడుగులోనూ ఆ ఉద్యమ పోకడనే అనుసరిస్తోంది!
కేసీఆర్ ఒక్కడే.. ముద్రగడ ఒక్కడే..!
ప్రస్తుత పరిస్థితుల్లో తెలుగు రాజకీయాల గురించి మాట్లాడుకుంటే.. రాజశేఖరరెడ్డి ముందు, రాజశేఖరరెడ్డికి తర్వాత.. అనే తేడానే ప్రధానాంశం. వైఎస్ మరణమే.. రాష్ర్ట విభజనకు ప్రధానాంశం అని ఆయనను ద్వేషించే వారు కూడా ఒప్పుకుని తీరతారు. వైఎస్ మరణానంతరం అలుముకున్న రాజకీయ శూన్యతలో కేసీఆర్ కొత్త ప్రస్థానాన్ని మొదలుపెట్టాడు. చిన్నగామొదలైన ఉద్యమం.. చినికి చినికి గాలివానగా మారింది. కాంగ్రెస్ అధిష్టానపు కుతంత్రం.. తెలంగాణ వాదుల ఉద్యమమంత్రం రాష్ట్రాన్ని నిలువునా చీల్చింది.
నిరాహార దీక్ష కూర్చున్న తర్వాత కేసీఆర్ పతాక శీర్షికలకు ఎక్కాడు. అంతకన్నా మునుపు.. పత్రికా ప్రకటనలు, ప్రెస్ మీట్లు.. తెలంగాణకు సంబంధించిన 14ఎఫ్ ఉద్యమం.. ఇదంతా పరిస్థితిని నివురుగప్పిన నిప్పులా తయారు చేసింది. ఒక్కసారి ఉద్యమం కేసీఆర్ చేతుల నుంచి అదుపు తప్పాకా మాత్రం కథే మారిపోయింది. కాంగ్రెస్ అధిష్టానం కదిలొచ్చింది! కాపు ఉద్యమ తీరును గమనిస్తే.. ఇప్పుడు కాదు దాదాపు ఒకటిన్నర సంవత్సరం కిందటే ముద్రగడ అనే వ్యక్తి అలజడి సృష్టించడం మొదలుపెట్టాడు. కాపులకు రిజర్వేషన్ల విషయంలో చంద్రబాబు మాట నిలబెట్టుకోవాలని.. అంటూ మొదలుపెట్టిన ముద్రడను అప్పుడు ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు.
తెలుగుదేశం అనుకూల మీడియా అయితే ఆయన ప్రెస్‌నోట్‌ను కూడా పట్టించుకోలేదు. చంద్రబాబు ఎన్నికల ముందు ఎన్నో హామీలు ఇచ్చాడు. వాటి అమలు గురించి ఎవరో ఒకరు మాట్లాడుతూనే ఉన్నారు. అలా కంఠశోష తెచ్చుకుంటున్న వారిలో ముద్రగడ కూడా ఒక్కడిగా మిగిలిపోవాల్సింది! అయితే.. కేసీఆర్ దగ్గర ప్రాంతీయతత్వం అనే ఆయుధం ఉన్నట్టుగానే ముద్రగడ వద్ద కులం అనే ఆయుధం ఉంది! అదే వీళ్లిద్దరినీ అనామకులుగా మిగిలిపోయేలా చేయలేదు. ప్రాంతీయ తత్వం, కులతత్వం రెండూ కవల పిల్లల్లాంటివనడంలో సందేహం లేదు. తెలంగాణ ఉద్యమం, కాపుల ఉద్యమం కూడా అలాంటి కవలలే!
తెలంగాణ వాదులు.. కాపు నేతలు!
ఒక్కసారి కేసీఆర్ చుట్టూ నలుగురు మూగడంతో సంఘీభావం ప్రకటించే ఎంతో మంది తయారయ్యారు. ఈ గాలిలో తమకు కూడా కొంత పేలపిండి దొరకకపోదా.. అని కేసీఆర్‌కు సంఘీభావం ప్రకటించిన వాళ్లు కొందరైతే.. ఉద్యమాన్ని క్రియాశీలకంగా ముందుకు తీసుకెళ్లిన వారు మరికొందరు. కేసీఆర్ ఉద్యమం మొదలయ్యాకా.. అప్పటికే కాంగ్రెస్ పాలనపై అసంతృప్తితో ఉన్న వర్గాలు ఎన్నో తెలంగాణ ఉద్యమంలోకి రంగ ప్రవేశం చేశాయి. ఏ విధంగా కాంగ్రెస్ ప్రభుత్వంపై తమకు వ్యతిరేకత ఉన్నా.. అప్పటికి మాత్రం తెలంగాణ ఉద్యమంలో భాగస్వామ్యులయ్యారు అనేకమంది. దీంతో ఉద్యమం వేడి పెరిగింది!
ఇప్పుడూ అదే జరుగుతోంది. మొన్నటి వరకూ ముద్రగడ అనామకుడు. ప్లేటు గరిటె ఉద్యమంతో ముద్రగడ వార్తల్లోకి వచ్చాడు. తుని సంఘటతనో ఉద్యమ తీవ్రత పెరిగింది. చల్లారి పోతుందిలే అనుకుంటే.. ఆ సంఘటన పర్యవసనంగా నమోదైన కేసుల పుణ్యమా అని మళ్లీ ఉద్యమం రాజుకుంది! మళ్లీ ముద్రగడ నిరాహార దీక్ష.. ముద్రగడ కుటుంబీకులపై పోలీసుల దురుసుప్రవర్తన అనేక మంది కాపులను కలిచి వేసింది! ఇదే సమయంలో రాజకీయ నిరుద్యోగులుగా ఉన్న కాపు ప్రముఖులు కూడా ముద్రగడ ఫుణ్యమా అని కాపు జనోద్దరకులనే ఇమేజ్ కోసం ప్రయత్నాలు మొదలుపెట్టారు.
కాపులకు ఏం చేశారో ఎవరికీ తెలియని.. దాసరి, పల్లంరాజు, చిరంజీవి వంటి వాళ్లు కూడా తిరిగి కాపుల్లో భావోద్వేగాలను పండించే నేతలైపోయారు! వీరి మాటలు కాపులను కదిలించగలుగుతున్నాయి. కళ్లలో కన్నీటి పొరలు తెప్పించగలుగుతున్నాయి. ఇక ముద్రగడ అయితే సరేసరి! ఇప్పుడు రిజర్వేషన్లు సాకారం అయినా, కాకపోయినా.. ముద్రగడ తిరుగులేని ఇమేజ్‌ను సంపాదించుకున్నాడు. ఎప్పుడో ఆయన రాజకీయ జీవితం చరమాంకానికి చేరుకుందని అనుకుంటే.. నిన్నటి వరకూ ఆయనెవరో కూడా తెలియని కాపులకు ఆయన ఇప్పుడు ప్రత్యక్ష దైవంగా మారాడు!
తెలంగాణలోనూ ఇదే జరిగింది. కరీంనగర్ ఉప ఎన్నికలో కేసీఆర్ అత్యంత స్వల్ప మెజారిటీతో మాత్రమే విజయం సాధించినప్పుడు ఆయన కథ కంచికి చేరింది అనుకున్నారంతా! ఇక 2009 ఎన్నికల్లో తెరాస మహాకూటమి రూపంలో ఎదుర్కొన్న ఎదురుదెబ్బ అలాంటిలాంటిది కాదు. బూడిద.. బూడిద మిగిలిందనుకున్నారంతా.. అలాంటి బూడిద నుంచి పినిక్స్‌లా పుట్టుకొచ్చాడు కేసీఆర్.
కాంగ్రెస్ హైకమాండ్.. చంద్రబాబు!
తనలో ఇప్పటికీ కాంగ్రెస్ రక్తం కొంత ఉందని దాదాపు పదిహేనేళ్ల కిందట చంద్రబాబు ప్రకటించుకున్నాడు. పదిహేనేళ్లు గడిచినా.. ఇప్పటికీ అదే నిజం అనిపిస్తోంది! 2009 డిసెంబర్‌లో కాంగ్రెస్ పార్టీ చేసిన ప్రకటన కేసీఆర్‌కు కొత్త ఊపిరి దక్కింది. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఉద్యమాన్ని గుర్తించి.. తెలంగాణను ఇస్తామన్నట్టుగా అప్పుడు చేసిన ప్రకటనే ఆ తర్వాత ఆపార్టీకి శాపమైంది. చంద్రబాబు కూడా అంతే.. కాపులకు అలుసు ఇచ్చాడు! తన మనుగడ కోసం.. ఎటు తిరిగీ అధికారం సాధించుకోవాలనే ధ్యాస తప్ప సాధ్యాసాధ్యాలను పట్టించుకోని ఆయన అధికారం కోసం కాపులకు రిజర్వేషన్ల హామీని ఇచ్చాడు.
తను ఎన్నికల ముందు ఇచ్చిన అన్ని హామీలనూ గాలికి వదిలిపెట్టినట్టే.. కాపులకు ఇచ్చిన హామీని కూడా ఏదో రీజన్ చెప్పి గాలికొదలొచ్చని బాబు లెక్క వేశాడు. అయితే కాపులు ఇప్పుడు గట్టిగా తగులున్నారు. అచ్చం తెలంగాణ విషయంలో సోనియాగాంధీని తెలంగాణ వాదులు తగులుకున్నట్టుగా! డిసెంబర్ తొమ్మిది ప్రకటన.. అనే మాట అప్పట్లో ఎలా నానిందో, చంద్రబాబు ఎన్నికల హామీ కూడా ఇప్పుడు అలాగే జనాల్లో నానుతోంది! ఈ విధమైన పోలికే కాదు.. సోనియా వ్యవహరించిన తీరునే చంద్రబాబు వ్యవహరిస్తున్నాడనడానికి కూడా ఇంకా పోలికలున్నాయి.
డిసెంబర్ తొమ్మిది ప్రకటన తర్వాత సీమాంధ్రలో వెల్లువెత్తిన వ్యతిరేకతకు భయపడి కాంగ్రెస్ వెనక్కుతగ్గింది. అక్కడ నుంచే తాము ఏదో గేమ్ ఆడుతున్నామన్న భ్రమలో పడింది కాంగ్రెస్ హైకమాండ్. కేసీఆర్‌కు పోటీగా కొంతమంది తెలంగాణ కాంగ్రెస్ నేతలను బరిలోకి దించింది. వీరిని వీర తెలంగాణ వాదులనే భ్రమలు కల్పించే ప్రయత్నం చేసింది. తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలతో అయితే ఎన్నో విన్యాసాలు చేసింది. ఇలాంటి చిల్లర చేష్టలనే కాంగ్రెస్ రాజకీయ వ్యూహాలుగా భావించింది. ఇప్పుడు బాబు కూడా అదే చేస్తున్నాడు. ముద్రగడ వెనుక జగన్ ఉన్నాడు.. అని తొలి రోజే మొదలుపెట్టారు.
అక్కడ నుంచి తెలుగుదేశంలోని కాపు మంత్రుల చేత ముద్రగడను ఇష్టానుసారం తిట్టించడం మొదలైంది. ముద్రగడను, చిరంజీవిని, దాసరిని.. ఇలా అందరినీ కాపునేతలతోనే బాబు తిట్టిస్తున్నాడు. మాట్లాడుతున్నది కాపు నేతలే అయినా.. మాట్లాడిస్తున్నది చంద్రబాబే అని వేరే చెప్పనక్కర్లేదు! కానీ బాబు మాత్రం దీన్నో సెక్సస్ ఫార్ములాగా భావిస్తున్నాడు. వెనుకటికి ఇదే ఫార్ములాను అనుసరించి కేసీఆర్‌ను తెలంగాణ కాంగ్రెస్ నేతలతో తిట్టించి కాంగ్రెస్ దారుణంగా ఫెయిలయిన విషయం ఆయనకు మదికి రాకపోవచ్చు! అధికారంలో ఉన్నప్పుడు ఉండే ఆత్మవిశ్వాసం చాలా విషయాలను అర్థం చేసుకోనివ్వదులే!
డబుల్ గేమ్‌కూ బాబు యత్నాలు!
కేసీఆర్‌పై కాంగ్రెస్ ఎంపీలను, తెలంగాణ ప్రాంతానికి చెందిన నేతలను కమ్మించిన సోనియాగాంధీ అంతటితో ఊరికే ఉండలేదు. అవతల సీమాంధ్ర ఎంపీలనూ ప్రోత్సహించింది.. వారినీ ఢిల్లీకి పిలిపించింది. వీళ్లను చూపి వాళ్లను, వాళ్లను చూపి వీళ్లను బ్యాలెన్స్ చేయాలని యత్నించింది. బాబు ఈ విషయంలోనూ తక్కువ తినలేదు! కాపులకు రిజర్వేషన్లకు వ్యతిరేకంగా మొదట్లోనే బీసీలను ప్రయోగించాడు తెలుగుదేశాధినేత! ఆర్.కృష్ణయ్య రూపంలో ఎలాగూ తెలుగుదేశం ఎమ్మెల్యే అందుబాటులో ఉన్నాడు. కాపులకు రిజర్వేషన్లు ఇస్తే బీసీలకు అన్యాయం జరుగుతుంది.. కాపులను బీసీల్లోకి చేరిస్తే.. వారు ఇప్పటికే బీసీల్లో ఉన్న వారికి అన్యాయం జరుగుతుంది అనే వాదనను వారి చేత హైలెట్ చేయించాడు చంద్రబాబు!
మరి తనకు ముప్పై ఏళ్ల అనుభవం ఉందని కొన్ని వేల సార్లు చెప్పుకునే చంద్రబాబుకు ఈ విషయంపై అవగాహన లేదా? తన పార్టీ కే చెందిన ఎమ్మెల్యే కాపులను బీసీల్లోకి చేర్చడాన్ని వ్యతిరేకిస్తుంటే.. వీధికెక్కి రచ్చ చేస్తుంటే.. ‘‘అలా కాదు.. కాపులకు మనం హామీని ఇచ్చాం..’ అనే మాటను చెప్పలేడా?! చెప్పగలడు. కానీ చెప్పడు. ఎందుకంటే.. ఈ వివాదాన్ని తేల్చకూడదు. నాన్చాలి అదే బాబు కోరిక!
శ్రీకృష్ణ కమిటీ.. మంజునాథన్ కమిటీ!
కోటయ్య కమిటీ, ఎల్లయ్యయ కమిటీ, పుల్లయ్య కమిటీ.. ఇలా ప్రతి హామీనీ ఒక్కో కమిటీని పెట్టి కొట్టాడు చంద్రబాబు. కాపుల రిజర్వేషన్ల విషయంలో మాత్రం ఎలాంటి కమిటీ లేదు. ముద్రగడ గడగడలాడించడం మొదలుపెట్టిన తర్వాత మాత్రం దీనిపైనా ఒక కమిటీ వచ్చింది. అది అధ్యయనం చేస్తుందట.. దీనిపై సంగ్రహమైన రిపోర్టును ఇస్తుందట. దాన్ని ఆధారంగా చేసుకుని బాబు తేలుస్తాడట! ఇదంతా చూస్తుంటే శ్రీకృష్ణ కమిటీ గుర్తుకు వస్తే తప్పు మనది కాదు!
టైమ్ కిల్లింగ్ కోసం.. తెలంగాణ, సమైక్యాంధ్ర ఉద్యమాల పట్ల నాన్చుడు ధోరణిని అవలంభించడానికి కాంగ్రెస్ హైకమాండ్ జస్టిస్ శ్రీకృష్ణతో కమిటీ ఏర్పాటు చేసింది! అప్పటికే తెలంగాణ ఏర్పాటు ప్రక్రియను ఆరంభించాం అని డిసెంబర్ తొమ్మిదిన ప్రకటించిన కాంగ్రెస్ వాళ్లు.. మళ్లీ శ్రీ కమిటీ అన్నారు. తాను అధికారంలోకి రాగానే కాపులంతా బీసీలు అవుతారని ప్రకటన చేసిన చంద్రబాబు కూడా తీరా ఆ వ్యవహారంపై తేల్చాల్సి వచ్చినప్పుడు మంజునాథన్ కమిటీ అన్నాడు! దీనికి టైం బౌండ్ లేదు!
ఇన్ని సాపత్యాలు.. నెక్ట్స్ ఏం జరగబోతోంది?
ఈ విధంగా ఇన్ని రకాలుగా.. తెలంగాణ ఉద్యమం దారిలోనే కాపుల ఉద్యమం నడుస్తోంది. ప్రత్యేక ఉద్యమంతో సోనియా వ్యవహరించిన తీరు, రిజర్వేషన్ల ఉద్యమంతో చంద్రబాబు వ్యవహరిస్తున్న తీరూ ఒకలేలా ఉంది. 2014 ఎన్నికలు దగ్గరపడే వరకూ ఏమీ తేల్చకూడదు అని సోనియా భావించింది. ఎన్నికల ముందు ఏదో ఒకటి ప్రకటించి.. ఒక ప్రాంతంలో అయినా ఓట్లు పొందుదామని ఆమె లెక్కలేసింది. బాబు లెక్కలూ అలాగే ఉన్నాయి. ఇప్పుడు కాపు ఉద్యమాన్ని తేల్చేయాల్సిన అవసరం లేదు. ఇలాంటి వేడి ఒకటి ఉంటే.. లోలోపల తన వ్యవహారాలు కూడా ఎవరూ పట్టించుకోరు.
ఎన్నో ఫైళ్లు గట్టెక్కించేయవచ్చు. ఎన్నో భూముల సంతర్పణ చేయవచ్చు. అందరి దృష్టీ కాపుల మీద ఉంటే.. ఎవ్వరూ మిగతా వ్యవహారాలను పెద్దగా పట్టించుకోరు. ఇక కాపుల విషయం.. ఎన్నికల నాటికి ఏదో ఒకటి తేల్చడం. ఎలాగూ చట్ట పరంగా రిజర్వేషన్లు చెల్లవు. దానికి కొన్ని సవరణలు అవసరం. ఆ సవరణలేవీ చేయకుండా.. ఎన్నికల నాటికి కాపులకు రిజర్వేషన్లు ప్రకటించి.. ఆ వ్యవహారాన్ని కోర్టు దారి పట్టించి.. చూశారా. మాట నిలబెట్టుకున్నా, కాపులకు రిజర్వేషన్లు ప్రకటించా కానీ కోర్టు అడ్డుకుందంతే! అని ప్రకటించాలనేది చంద్రబాబు వ్యూహంగా కనిపిస్తోంది.
ఇప్పుడే రిజర్వేషన్లను ప్రకటిస్తే.. ఆ వ్యవహారం వెంటనే కోర్టుకుపోతోంది. ఈ ఫలాలు అందవని కాపులకు క్లారిటీ వస్తుంది. మెలికలు సవరించకుండా బాబు కాపులను బీసీల్లోకి చేర్చిన విధానం పై చర్చ మొదలవుతుంది. అదే జరిగితే బాబు ఇరకాటంలో పడతాడు. అందుకే.. ఎన్నికల వరకూ ఇలాగే బండి లాగించవచ్చు.
చివరకు మిగిలేది?
జనాలు నేతలు ఊహించినంత వెర్రి వాళ్లు కాదు. ఇది అనేక సార్లు రుజువు అయ్యింది. జనాలతో గేమ్స్ ఆడితే.. అడుగడుగునా వారిని రాజకీయ ప్రయోజనాలకు అనుగుణంగానే వాడుకోవాలని చూస్తే ఏం జరుగుతుందో ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ పరిస్థితిని చూస్తే అర్థం అవుతుంది! కాంగ్రెస్‌కు మిగిలిన అనుభవమే బాబుకు కూడా అనుభవంలోకి వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. తన దగ్గర పవన్ కల్యాణ్ ఉన్నాడు.. కాపు మంత్రులున్నారు.. ఇలాంటి లెక్కలు ఎన్నైనా ఉండవచ్చు. గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే.. 70 శాతం కాపులు గత ఎన్నికల్లో చంద్రబాబుకు మద్దతుగా నిలవడం వల్లనే టీడీపీకి అధికారం సిద్ధించింది.
వారు మాత్రమే గాక రుణమాఫీ అంశంతో సహా సవాలక్ష హామీలకు పడ్డవారూ ఉన్నారు. ఆయా అంశాల విషయంలో వ్యతిరేకత.. వాటి అమలు జరగకపోవడమే బాబుకు వచ్చే ఎన్నికల నాటికి చాలా నష్టం చేసే అవకాశం ఉంది. ఇప్పుడు రిజర్వేషన్లు కల్పించినా, కల్పించకపోయినా.. మద్దతుగానిలిచిన 70 శాతం కాపుల్లో పది నుంచి ఇరవై శాతం మంది రూటు మార్చినా బాబు భవితవ్యం వేరే రకంగా ఉంటుంది. అదెలా ఉంటుందంటే.. కాంగ్రెస్ వర్తమాన స్థితిలా!
-వెంకట్ ఆరికట్ల