జ‌గ‌న్‌ను త‌ప్పించి, ప‌వ‌న్‌ని జోప్పించ‌డం... ఇదే ప్లాన్‌?

ప్రత్యేక‌హోదా నినాదం జ‌నంలోకి బాగా వెళ్లిపోయింది. బ‌హుశా వ‌చ్చే అసెంబ్లీ ఎన్నిక‌ల్లో అదే ప్రధాన అంశంగా మారినా ఆశ్చర్యం లేదు. ఈ నేప‌ధ్యంలో ఉద్య‌మంలో అంద‌రికంటే ముందుంది వైసీపీ. రాష్ట్రవ్యాప్తంగా  బ‌హిరంగ స‌భ‌ల నుంచి కాలేజ్ క్యాంప‌స్ స‌మావేశాల దాకా నిర్వహిస్తూ దీక్షలూ బంద్‌ల‌తో ప్రధాన ప్రతిప‌క్షం ఈ ఉద్యమంపై ఓ ర‌కంగా పేటెంట్ తీసుకుంది అన‌చ్చు. 

దీంతో ప్రత్యేక తెలంగాణ కెసియార్‌కు లాభించిన‌ట్టుగానే ప్రత్యేక హోదా అంశం జ‌గ‌న్‌కు కూడా ప్లస్సవుతుంద‌నే చంద్రబాబు భ‌య‌మే ప‌వ‌న్ క‌ళ్యాణ్ ని మ‌ళ్లీ తెర‌మీద‌కు ర‌ప్పించ‌డానికి కార‌ణ‌మైంద‌నే సందేహాలు బ‌ల‌ప‌డుతున్నాయి. కాకినాడ స‌భ అనంత‌ర ప‌రిణామాలు చూస్తుంటే అది కేవ‌లం సందేహం మాత్రమే కాద‌ని కూడా అనిపిస్తోంది. ముఖ్యంగా ఎన్నడూ లేని రీతిలో ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌పైన బిజెపి శ్రేణులు విమ‌ర్శ‌ల వ‌ర్షం కురిపిస్తున్న వైనం ఇక్కడ గ‌మ‌నార్హం.  

దీని వెనుక చ‌క్రం తిప్పిన వారి ప్రధాన ఉద్ధేశ్యాలు... ప్రత్యేక హోదా ఉద్య‌మంలో జ‌గ‌న్ పాత్రను త‌క్కువ చేయ‌డం, రాష్ట్ర ముఖ్యమంత్రి ప‌ద‌విలో ఉండీ హోదా సాధించ‌లేక‌పోయిన చంద్రబాబు అస‌మ‌ర్ధత‌ని క‌ప్పిపుచ్చడం, ఈ అంశంలో త‌ప్పంతా కేంద్రంపై నెట్టేసి, ఎలాగూ ఎపిలో బ‌లం లేని భాజాపాను పూర్తిగా దోషిగా నిల‌బెట్టడం... ఈ రెండ్రోజుల ప‌రిణామాల‌ను ప‌రిశీలిస్తే ఇవే అస‌లు ల‌క్ష్యాల‌ని అనిపిస్తోంది 

కాకినాడ స‌భ‌లో చంద్రబాబును ప‌వ‌ర్‌స్టార్ ప‌ల్లెత్తు మాట అన‌లేదు. క‌నీసం హోదాపై కేంద్ర మంత్రి హోదాలో ఉండి ప్యాకేజీని స‌మ‌ర్ధిస్తున్నట్టు మాట్లాడుతూన్న సుజ‌నాచౌద‌రినీ గ‌ట్టిగా విమ‌ర్శించ‌లేదు. త‌న‌నేదో అన్నారంటూ టిజి వెంక‌టేష్‌, అవంతి శ్రీనివాస్ వంటి ప్రత్యేక‌హోదా విష‌యంలో ఏ మాత్రం ప్రభావం చూప‌లేని వ్యక్తుల్ని తిట్టిపోయ‌డం ద్వారా ఏదో అధికార పార్టీకి చెందిన వారిని కూడా తిట్టాన‌ని చెప్పుకోవ‌డానికి మాత్రం ప‌రిమిత‌మ‌య్యాడు. హోదా ఇవ్వక‌పోవ‌డం అనేది అదేదో ఉత్తరాది వారు ద‌క్షిణాది వారిని చుల‌క‌న చేయ‌డంలో భాగం అన్నట్లుగా కోత్త క‌ల‌ర్ ఇచ్చాడు. 

ఆయ‌న మీటింగ్ ఇలా అయ్యిందో లేదో వెంట‌నే భాజాపా నేత‌లు వ‌న్ బై వ‌న్  ప‌వ‌న్‌పై దండెత్తారు. వెంక‌య్యను విమ‌ర్శించిన ప‌వ‌న్ క్షమాప‌ణ చెప్పాల‌ని, వ‌చ్చే ఎన్నిక‌ల్లో గెల‌వ‌డానికే ఇలా మాట్లాడుతున్నాడ‌ని, అత‌నికి రాజ‌కీయాల‌పై ఏమాత్రం అవ‌గాహ‌న లేద‌ని....  ఢిల్లీ స్థాయి నుంచి స్థానిక నేత‌ల దాకా ప‌వ‌న్‌పై ఇంకా విమ‌ర్శల వ‌ర్షం కురిపిస్తూనే ఉన్నారు. నిజానికి ప‌వ‌న్ మాట్లాడిన దానికి అదే రోజున భాజాపా అగ్రనేత‌లు ఇచ్చిన కౌంట‌ర్ స‌రిపోతుంది. అయినా కూడా ఓక‌రి త‌ర్వాత ఓక‌రుగా కూడ‌బ‌లుక్కున్న‌ట్టు రెండో రోజు కూడా విమ‌ర్శలు క‌న‌సాగిస్తుండ‌డం వెనుక కూడా చంద్రబాబు ప్లాన్ ఉన్నట్టు ప‌లువురు సందేహిస్తున్నారు. 

దీనికి త‌గ్గట్టే వీరి విమ‌ర్శల ప‌ర్వానికి తేదేపా అనుకూల చాన‌ళ్లు పెద్ద యెత్తున ప్రాధాన్యం ఇస్తున్నాయి.  ప‌వ‌న్‌, భాజాపాల ప‌ర‌స్పర ఘ‌ర్షణ వైఖ‌రి వ‌ల్ల ప్రత్యేక హోదా అంశంలో తెలుగుదేశం పార్టీ,  చంద్రబాబుల పాత్రపై జనంలో త‌లెత్తిన వ్యతిరేక‌త తగ్గుముఖం ప‌ట్టే అవ‌కాశాలున్నాయని భావిస్తున్న తేదేపా అధినాయ‌క‌త్వమే జ‌న‌సేన భాజాపాల మ‌ధ్య వైరాన్ని ఎగ‌దోస్తున్నట్టుగా ఉంది, . 

ప్రత్యేక‌హోదా భాజాపా ఇవ్వలేదు కాబ‌ట్టి ఏదిస్తే అది తీసుకుని రాష్ట్రాన్ని ప్రగ‌తి బాట  ప‌ట్టించ‌డానికి పాపం బాబు తెగ తాప‌త్రయ ప‌డుతున్నార‌ని ఎపి జ‌నాల్ని న‌మ్మించ‌డానికి ఇది మ‌రో ప్లాన్ కావ‌చ్చు. ఈ నేప‌ధ్యంలో  ప‌వ‌న్‌-భాజాపా ఫైట్‌ను మున్ముందు కూడా మ‌రింత ర‌క్తి క‌ట్టించేలా జ‌నానికి చూపెట్టే అవ‌కాశాలు మెండుగ ఉన్నట్టు విశ్లేష‌కుల అంచ‌నా. మ‌రి ప‌వ‌న్‌-బాబు ప్లాన్‌ను జ‌గ‌న్‌-వైసీపీ ఎలా ఎదుర్కుంటుందో  వేచి చూడాలి.  

Show comments