సినిమా హీరోలు... మనలో చాలా మందికి ఆదర్శప్రాయమైన వ్యక్తులు. మన దగ్గరే కాదు.. ప్రపంచం మొత్తం గ్లామర్ ఫీల్డ్‌లోని వ్యక్తులకు దాసోహం అంటూ ఉంటుంది. టాలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్.. ఇలా ఏ వుడ్ తేడాలేదు. కేవలం అలరించడం, ఎంటర్ టైన్‌మెంట్ అందిచడమో లేక అందంగా ఉంటారనో కాదు, కొంతమంది సినీ హీరోలు పనితీరు వ్యక్తిత్వ వికాసపాఠం అవుతూ ఉంటుంది. వారి వ్యక్తిత్వం, వ్యక్తిగత వ్యవహారాలను పూర్తిగా పక్కన పెట్టి చూసినా సినిమా వారి కమిట్‌మెంట్, వారు సాధించే సెక్సస్‌లు.. మేనేజ్‌మెంట్ పాఠాలవుతాయి. వారిని ఆరాధ్య దైవాలుగా చేస్తాయి.
పనిమీద వారికి ఉన్న శ్రద్ధ, అంకిత భావమే .. ఇక్కడ అతిగొప్ప విషయాలు. గ్లామర్, అందం, మానియా.. ఇవన్నీ కొంత కాలం ఉండేవి, ఆఖరికి వారు చేసే సినిమాలు కూడా ఎల్లకాలం గొప్పవి అనే అనిపించుకోవు. అంతిమంగా వత్తి విషయంలో వారు చూపే అంకిత భావం, దానిలో నవ్యత చూపడానికి వారు కష్టపడే తీరే.. సినిమా హీరోలనైనా చిరస్మరణీయులను చేస్తుంది. ఈ విషయాలన్నీ అసలైన హీరోల గురించి.. మరి దగ్గరేంటి.. హీరో అంటే రెమ్యూనరేషన్ తీసుకున్నాడా.. తన క్రేజ్‌ను క్యాష్ చేసుకున్నాడా.. మళ్లీ మరో సినిమా వచ్చే వరకూ మొహం చాటేశాడా.. అన్నట్టుగా ఉంది పరిస్థితి. అదే అతడి పని! సినిమా అడితే అతడికి ఉన్న గత క్రేజ్‌ను, పుట్టుకతో వచ్చిన వారసత్వాన్ని బట్టి ఆడాలి. ఆడకపోతే నిర్మాత దురదష్టం. లాంచింగ్ ప్యాడో లేక తమకు కొన్ని సినిమాలతోనే వచ్చిన ఇమేజ్‌తోనో ప్రతిసారీ బండి లాగించేయడమే గొప్ప అన్నట్టుగా ఉంది తెలగు హీరోల తీరు.
వారసత్వంతో వచ్చారు కదా.. వాస్తవంలోకి రాలేకపోతున్నట్టున్నారా..? అభిమానగణం ఉందిలే అంతా అయిపోతోందనుకుంటున్నారా! అవతల తమ కన్నా తోపులు చాలా కష్టపడుతున్నారనే విషయాన్నీ గ్రహించలేకపోతున్నారే! మా చిన్ని పొట్టకు శ్రీరామరక్ష.. ఇక కష్టపడటం ఎందుకు అనుకుంటున్నారు కాబోలు. కోట్లు వచ్చి పడుతుంటే కొత్తగా చేయాల్సిన పనే ముంది అనుకుంటున్నట్టుంది వీరి తీరు. ఇలాంటి దొరబాబులు మన టాలీవుడ్ హీరోలు. తమ జీవితమే ఏదో బోనస్ కింద స్వర్గ సుఖాలను అనుభవించడానికి దొరికిన వరం అన్నట్టుగా బతికేస్తున్నారు వీళ్లు. ఏ పని చేసినా అందులో ఏదో ప్రత్యేకత ఉండాలి. ఆ ప్రత్యేకత వారి అంకిత భావానికి నిదర్శనంగా నిలవాలి. అయితే ఇలాంటి ఉదాహరణలే మన హీరోల దగ్గర కనిపించకుండా పోయాయి!
వెర్రి అభిమానులున్నారు కాబట్టి ఈ హీరోలు తమ మెదళ్లకు ఎలాంటి పనీ పెట్టాల్సిన అవసరం లేకుండా పోయినట్టుంది! ఇక సగటు సినీ ప్రేక్షకులంటారా.. ఏ చెట్టూ లేని చోట అముదం చెట్టే మహావక్షం కదా.. చచ్చినట్టు ఈ వారసత్వపు మొక్కలనే వక్షాలని ఒప్పుకోకతప్పని సరి పరిస్థితుల్లో ఉన్నారు. ఈ వర్గంలోని కొందరు తెలివైన వాళ్లు.. తెలుగు హీరోల పోకడలను, తెలుగు సినిమా సోకులను పట్టించుకోవడం ఏనాడో మానేసి.. మనసుకు అహ్లాదాన్ని ఇచ్చే ఏ విదేశీ సినిమాల గురించినో రెసెర్చీ చేసుకొంటూ హ్యాపీగా బతికేస్తున్నారు. ఈ నడమంత్రుపు బడాయి కోరు హీరోల దివాళాకోరు తనపు తీరును.. వీరి ప్రగల్బపు ప్రశంసల ప్రపంచానికి దూరంగా ఉండటమూ ఆరోగ్యానికి మంచిదే కదా!
కథలో కొత్తదనం చూపాలి.. మరేదో చేయాలన్న తపన అక్కర్లేదు.. పుచ్చు పట్టిన కథలతో సినిమాలు తీసుకొంటూ పోయినా.. కులంతోనో మరో ఫీలింగ్‌తోనో ఏర్పడ్డ పునాదులు బలంగా ఉన్నాయి కాబట్టి.. వీళ్లే ఇండస్ట్రీలో ‘బాబు’లుగా చెలామణి అయిపోతున్నారు టాలీవుడ్ ‘హీరోలు’. మూడు నాలుగేళ్లకు అదష్టవశాత్తూ ఏదైనా ఒక్క సినిమా పర్వాలేదనిపించుకుంటే చాలు.. ఆ తర్వాత మరో మూడు నాలుగేళ్ల పాటు వీళ్లను మోసే మీడియా, అభిమానగణం ఉండనే ఉంది. మరి ఇలాంటి నేపథ్యంలో వీళ్లు కష్టపడాల్సిన అవసరం ఏముంది? కొత్తగా ఏదైనా చేయాల్సిన అవసరం ఏముంది? అందుకే హీరోలు కూడా అలా బతికేస్తున్నారు!
అంకిత భావమా.. అంటే ఏమిటి?
ఈతరం టాలీవుడ్ హీరోలెవరిలోనూ కనిపించనిది ఇది. అయాచితంగా స్టార్‌డమ్ కలిసి రావడంతో అనుచితంగా ముందుకుపోతున్నారు మన ‘‘బాబులు’’. కష్టపడి ఎదిగిన వాళ్లకు అయితే ఆ కష్టపడటం ఒక అలవాటుగా మారుతుంది. ఆ కష్టం నుంచి కొత్తదనమో మరోటో పుట్టుకొస్తుంది. హీరో కష్ణ గురించి చెప్పుకుంటాం.. ఆయన కెరీర్‌లో ఎన్ని సినిమాలు కోట్ల రూపాయలు సాధించాయి అని మాట్లాడుకోం.. తెలుగు సినిమాకు కొత్త ప్రస్థానాన్ని నేర్పాడని చెప్పుకుంటాం. ఎన్టీఆర్ గురించి మాట్లాడుకుంటాం, చిరంజీవి గురించి చెప్పుకుంటాం.. ఈ పాతతరాన్ని అంతా పక్కన పెట్టేస్తే.. వారి వారసత్వాన్ని అందుకుని వచ్చిన వాళ్లే.. తలా ఒక భ్రమల ప్రపంచంలో బతికేస్తున్నారు! అందం అని ఒకరు.. ఇజం అనుకొంటూ మరొకరు, క్రేజ్ అంటూ ఇంకొకరు, వంశం అంటూ ఇంకొందరు.. ప్రపంచమంతా అన్ని రంగాల్లోనూ పురోగమనిస్తుంటే, వీళ్ల తిరోగమనం ఏమిటో.. వీళ్లతో పాటు జనాలు కూడా అభిమానం అంటూ అదే రూట్లో వెళ్లి బతికేయడం ఏమిటనేది బయటి వాళ్లకు అర్థం కాని విషయం. మూడ్ బాగుంటే మూఢనమ్మకాలను కూడా ప్రోత్సహించే మీడియా కూడా ఈ హీరోల కీర్తిస్తూ ముందుకు సాగుతూ ఈ వ్యవహారంలో తన వంతు పాత్రపోషిస్తూ పోతోంది.
ఇతరులతో పోల్చి చూసినప్పుడే..
మంచోడో చెడ్డోడో.. అమీర్ ఖాన్ పనితీరును పరిశీలిద్దాం.. అతడికేం ఖర్మ అంత కష్టపడుతూ ఉంటాడు? అతడూ ఎక్కడో ఒక ఫామ్‌హౌస్ కట్టుకుని అక్కడ నుంచే ఇంటర్వ్యూలు రికార్డు చేయించి మీడియాకు ముష్టిగా పడేయొచ్చు. లేదా ఒక అపార్ట్‌మెంట్‌కు పరిమితం అయిపోయి... ఎంత అరుదుగా మీడియా ముందుకు వస్తే తన క్రేజ్ అంతగా ఉందని భ్రమల్లో బతికేయొచ్చు! కానీ పిచ్చోడు.. అతడికేం తెలుసు.. స్టార్‌డమ్‌ను ఎంజాయ్ చేయడమంటే? ఇలాంటి విషయంలో తెలుగు హీరోలను ఆదర్శంగా తీసుకోవాలి. లేకపోతే గజిని సినిమా చేశాడని చెప్పి గుండుతోనే రోడ్లపై తిరుగుతాడా? ఆ సినిమా ప్రచారం కోసం స్వయంగా బరిలోకి దిగి వీధి వీధీ తిరుగుతాడా!
అదొక్కటేనా... ప్రతి సినిమా ప్రమోషన్ కోసం ఒక కొత్త ప్రయత్నం. టీవీల ఆఫీసుల చుట్టూ తిరుగుతాడు.. సామాన్యుడిలా జనాల్లో కలిసి పోతాడు.. మరి దీన్ని అమీర్‌కు ఉన్న అంకిత భావం అనకూడదా? అదంతా ప్రమోషనల్ యాక్టివిటీనే కావొచ్చు.. అంతా వ్యాపార దక్పథమే అనొచ్చు. మరి సినిమా కూడా వ్యాపారమే కదా. ఆ వ్యాపారంలో రాణించే మార్గాల్లో కష్టపడటమే కదా అంకిత బావం! అమీర్ ఖానేనా.. హాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకూ స్టార్ హీరోలు.. తమ బ్రాండ్ విలువ దగ్గర స్టార్లు కానీ.. కష్టపడటం దగ్గర కాదు. కష్టపడటం చిన్నతనం అని వారెవరూ భావించడం లేదు. తాము రోడ్ల మీదకు వచ్చేస్తే.. రేపటి నుంచి మనల్ని ఎవరూ పట్టించుకోరనే ఆలోచనలో వారెవరూ లేరు.
కోటి రూపాయల కారు అమ్మేవాడు కూడా.. రోడ్డు మీద దాన్ని ప్రదర్శనకు పెట్టి.. పాంప్లేట్లు పంచుతూ.. దాని ఫీచర్స్‌ను వివరించుకొంటున్న రోజులివి. అంతేగానీ.. నేను అమ్మేది కారు కాబట్టి.. అవసరమైన వాడే షోరూమ్‌కు రావాలి.. అనే ఆలోచనా దక్పథంతో బతికేకాలం కాదిది. టాలీవుడ్ హీరోలు మాత్రం ఈ విషయంలో వాస్తవంలోకి రాలేదు. డబ్బులు ఖర్చు పెట్టుకునేది.. అభిమానించేది.. సినిమా బాలేకపోతే ఆ తలనొప్పిని భరించేది.. అన్ని బాధ్యతలూ సినీ ప్రేక్షకులు, అభిమానులవే! మన హీరోలు మాత్రం పారితోషకాలు తీసుకుని తమ ప్రపంచంలో తాము బతికేస్తూ ఉంటారు.
సల్మాన్.. స్థాయేంటి, ఆ పనేంటి!
కపిల్ శర్మ ఎవరు? అతడి స్థాయి ఏమిటి? సల్మాన్ రేంజ్ ఏమిటి? సుల్తాన్ సినిమాకు వందకోట్ల రూపాయల పైస్థాయి రెమ్యూనరేషన్ పొందాడు సల్మాన్. ఆ స్థాయి వ్యక్తి.. తన సినిమా ప్రమోషన్ కోసం కపిల్‌తో కలిసి కూర్చుకున్నాడు. వెకిలి హాస్యమో మరోటో.. ఇంకోటో.. అవన్నీ వేరే కథ. తన ఇమేజ్‌లు తొక్కా తోటకూర అంతా పక్కన పెట్టి.. ఆ షోలో పాల్గొని.. తన సినిమాను చూడమని జనాలకు చెప్పుకుని.. వెళ్లాడు. రణ్‌బీర్ కపూర్, అక్షయ్ కుమార్.. వీళ్లు తమ ప్రతి సినిమా ప్రమోషన్‌కూ హైదరాబాద్‌కు , బెంగళూరుకు, చెన్నైకి వస్తారు. ఒక్కో ఊరిలో ఒకటీ రెండ్రోజులు కూర్చుని.. ఏదో ఒక యాక్టివిటీలో భాగస్వాములై తమ సినిమాల గురించి జనాలకు విన్నవించుకుని .. దాన్ని చూడమని చెప్పుకొంటూ పోతారు.
హైదరాబాద్‌లో ఉన్న కాలేజీల్లోకి అనేకమంది బాలీవుడ్ యంగ్ హీరోలు వచ్చి.. స్టూడెంట్స్‌తో మమేకం అయిపోయి.. వాళ్లతో సరదాగా ఆడి, పాడి.. అంతిమంగా తమ సినిమా గురించి చెప్పుకుని.. తప్పక చూడండి అమ్మాయిలు అని ముద్దుగా విజ్ఞప్తి చేసుకుని వెళతారు. మరి ఏ తెలుగు హీరో అయినా.. ఈ మాత్రం చొరవ, తెలివి, కలిసిపోయే తనం ఉందా? ఆ మధ్య శేఖర్ కమ్ములా చెప్పాడు.. ‘ఆనంద్’ సినిమాను విడుదల రోజుకు ఐదు థియేటర్లు దొరికాయి.. ప్రమోషన్ కోసం డబ్బుల్లేవు, హీరో రాజా అయితే కాలేజీలు పట్టుకు తిరిగి.. సినిమా గురించి స్టూడెంట్స్‌కు చెబుతూ కష్టపడ్డాడు.. అని వివరించాడు. ఇలాంటి మాటలు మనకు అరుదుగా వినిపించేవే!
గత పదేళ్లలో తాము ‘స్టార్లం’ అని ఫిక్సయిపోయిన ఏ సినీ వారసత్వపు హీరో అయినా.. తమ సినిమా ప్రమోషన్ కోసం హైదరాబాద్‌లోని తమ కోట గోడలు దాటి కనీసం విశాఖ వరకూ వెళ్లారా? విజయవాడ సరిహద్దులను టచ్ చేశారా? మరి వీళ్లు ఇలా మగ్గిపోతుంటే.. తమిళ హీరోలు హైదరాబాద్ వరకూ వచ్చి తమ సినిమాల ఆడియోలను విడుదల చేసుకుంటున్నారు. తమిళంలో సరిసమానమైన ఇమేజ్‌ను తెలుగునాట సంపాదించుకుంటున్నారు.
తమ సినిమాల్లో నవ్యతను చూపడమే కాదు.. ఇగోలు, అహాలు పక్కన పెట్టి.. తమ ఉనికిని చాటుకోవడానికి, తమను నమ్ముకుని పెట్టుబడులు పెట్టిన వారికి లాభాల రుచి చూపడటానికి, తమ మార్కెట్‌ను పెంచుకోవడానికి, తమ సినిమాల విస్తతిని పెంచడానికి వాళ్లు ఓపిక చేసుకుంటున్నారు. మన హీరోలతో పోలిస్తే ఎక్కువ రెమ్యూనరేషన్లే అందుకుంటున్నా.. నటులుగా గొప్ప ప్రశంసలే పొందుతున్నా తమిళులు మనోళ్ల కన్నా చాలా ఎక్కువగా కష్టపడుతున్నారు. ఫ్యాన్సు, ఫాలోయింగ్ అనే భ్రమల ప్రపంచంలో బతకడం లేదు వాళ్లు.
తెలుగు హీరోలు.. కమ్యూనికేషన్‌లో వీకా?
తెరపై చిలిపి దనాన్ని ప్రదర్శించడం, పంచ్‌లు వేయడం, హీరోయిన్లను పడేయడం.. సంగతి పక్కన పెడితే తెలుగు హీరోలు ఎవరూ జనాల్లోకి రాకపోవడానికి, తమ సినిమాల ప్రమోషన్ కోసమైనా కనీసం కాలేజీ స్టూడెంట్స్‌లో కలవలేకపోవడానికి కారణం ఏమిటి? అంటే.. వీరి ఇన్ ఫిరియారిటీ కాంప్లెక్స్, వీక్ కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా ఒక కారణం అనే అభిప్రాయం వినిపిస్తుంది. సినిమాల ఆడియో విడుదల వేడుకల్లో ఒకరినొకరు భజనలు చేసుకోవడం, ఏదైనా అవార్డుల కార్యక్రమంలో తమ వాళ్ల పక్కనే కూర్చుని మాట్లాడుకోవడం వరకూ ఓకే కానీ, చాలా మంది హీరోలు పదుగురిలో కలవాలంటే మానసికంగా ధైర్యం లేని వారే అనేది టాలీవుడ్ సర్కిల్స్‌లో వినిపించే మాట.
అడుగడుగునా అభద్రతా భావమే!
మన హీరోల్లోనే కాదు, సినిమాల రూపకర్తల్లోనే ఎంతో అభద్రతాభావం ఉందనేది కూడా ఇట్టే పసిగట్టగల విషయం. విదేశీ సినిమాల కథలను కాపీ కొట్టి సినిమాలు తీసిన వాళ్లు కూడా సదరు సినిమాలకు తమ జీవితంలో ఎదురైనా సంఘటనలే స్పూర్తి అంటూ అబద్ధాలు చెప్పుకోవడాన్ని చూస్తే.. టాలీవుడ్ టాప్ డైరెక్టర్లే ఇలా చెప్పుకొంటూ ఉండటాన్ని అభద్రతాభావం అనక ఏమనాలి? ఇక ఎక్కువగా జనాల్లో కనిపిస్తే ఎక్కడ తమకున్న క్రేజ్ కరిగిపోతుందో అన్నట్టుగా వ్యవహరిస్తూ.. తక్కువ కనిపిస్తూ, తమ క్రేజ్‌ను తక్కువగా ఖర్చు పెట్టుకోవాలన్నట్టుగా వ్యవహరించడం హీరోల అభద్రతాభావంలోని మరో అంకం.
కేవలం వీరి వ్యక్తిగత ఇమేజ్ మీదే కాదు.. సినిమాల విషయంలో కూడా అభద్రతాభావమే! ఏ టాలీవుడ్ సినిమా ట్రైలర్‌ను చూసినా ఈ విషయం అర్థం అవుతుంది. అది కూడా మనోళ్లు ట్రైలర్లు కట్ చేసే విధానాన్ని బాలీవుడ్‌తోనో, హాలీవుడ్‌తోనో పోల్చి చూస్తే.. వీళ్ల తీరు ఏమిటో బోధపడుతుంది. ఏదైనా ఇంగ్లీష్ సినిమా, లేదా హిందీ సినిమా ట్రైలర్‌ను చూస్తే.. ఆ లెంగ్తీ ట్రైలర్‌లో సదరు సినిమా కథాంశం ఏమిటో స్పష్టంగా అవగాహన అవుతుంది. మూల కథ, అందులోని పాత్రలు, వాటి తీరు, మలుపులు.. తదితరాలన్నీ కూడా సినిమా విడుదలకు ముందెప్పుడో విడుదల అయ్యే ట్రైలర్‌లోనే తెలిసిపోతాయి.
అయితే.. టాలీవుడ్ ట్రైలర్లు మాత్రం ప్రేక్షకుడికి అలాంటి అవకాశం ఇవ్వవు. సినిమా జోనర్ ఏదో అర్థం కానివ్వవు. హీరో చెప్పే డైలాగొకటి, హీరోయిన్ లుక్ ఒకటి, కమేడియన్ పంచ్ ఒకటి.. విలన్ క్రౌర్యమైన లుక్ ఒకటి.. వీటిని కలిపేసీ ఒకటీ, ఒకటిన్నర నిమిషం బీజీఎంతో ట్రైలర్ అయిపోతుందంతే! అంతకు మించి చూపితే.. జనాలకు సినిమాలపై ఎక్కడ స్పష్టత వచ్చేస్తుందో.. తమ సినిమాలపై వారిలో ఎక్కడ ఆసక్తి తగ్గిపోతుదో అనేది మనోళ్ల భయం.
అందరూ అందరే..!
కేవలం హీరోలే కాదు.. సదరు సినిమాకు పని చేసే హీరోయిన్లు, ఇతర టెక్నీషియన్లు కూడా సినిమా చేయడం వరేక మా బాధ్యత అన్నట్టుగా తయారయ్యారు. ఏ సినిమా ప్రమోషన్ ఈవెంట్స్‌కు కూడా హీరోయిన్లు రారు. ఆఖరికి జనతా గ్యారేజ్ లాంటి భారీ సినిమా ఆడియో విడుదల వేడుకలో ఆ సినిమా మెయిన్ హీరోయిన్ రాలేదంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఆ తర్వాత డ్యామేజీ కంట్రోల్‌కు ఎన్ని ట్వీట్లైనా పెట్టి ఉండొచ్చు అది వేరే కథ. ఇక మ్యూజిక్ డైరెక్టర్లు, ఇతర టెక్నీషియన్లు ఆడియో విడుదల వేడుకలో కనిపిస్తే అదే గొప్ప. మరి ఆ కార్యక్రమాలైనా అర్థవంతంగా అయినా ఉంటాయా అంటే? భజనలు, భజంత్రీలు, సినిమా గురించి సంబంధం లేని సోది తప్ప అక్కడ మరేమీ ఉండదాయె!
ఇది పోటీ ప్రపంచం.. ఎవరి కోసం ఎవరూ వేచి ఉండరు. తెలుగు హీరోల బలహీనతలను ఆసరాగా చేసుకునే.. ప్రయోగాల విషయంలో మనోళ్లకు ఉన్న భయాలను అవకాశంగా మలుచుకుని.. తమిళ హీరోలు తెలుగునాట పాగా వేశారు. ఆఖరికి వారి ప్రయోగాత్మక సినిమాలకు తమిళంలో కన్నా తెలుగులోనే ఎక్కువ ఆదరణ లభిస్తోందంటే పరిస్థితి ఎంత వరకూ వచ్చిందో.. అర్థం చేసుకోవచ్చు. తమిళ డబ్బింగ్ సినిమాలు వస్తున్నాయంటే.. తెలుగు సినిమాల విడుదలేక వణుకు పుట్టే పరిస్థితి వచ్చి చాలా కాలం అయ్యింది.
ఒకవేళ తెలుగు హీరోలే ప్రయోగాత్మక, వైవిధ్య భరితమైన సినిమాలు చేసే పరిస్థితి ఉండుంటే.. తమిళులకు ఇక్కడ వ్యాక్యూమే ఉండేది కాదు. ఇది అన్ని విషయాలకూ వర్తిస్తుంది. టాలీవుడ్ స్టార్ హీరోలు తమ ప్రపంచంలో తాము బతుకుతూ పోతే.. సగటు సినీ ప్రేక్షకుడికి, వీరికి మధ్యన వచ్చే గ్యాప్‌లో మరెవరో చేరిపోతారు. అప్పుడు ఈ స్టార్ హీరోలు తమ వైభగాలను కీర్తించుకొంటూ అంతఃపురాలకు పరిమితం కావాల్సి ఉంటుంది. వీరు ఇదే తీరుతో కొనసాగితే.. ఆ పరిస్థితి రావడానికి మరెంతో కాలం పట్టకపోవచ్చు.
ఇప్పుడిప్పుడే మార్పు వస్తోంది..
సినిమాల ప్రమోషన్ విషయంలో బాలీవుడ్ హీరోల ధోరణి మంచిది. పెట్టుబడులు పెట్టిన నిర్మాతలకు మేలు చేసే ధోరణి అది. ఈ విషయంలో టాలీవుడ్‌లో ఇప్పుడిప్పుడే మార్పు కనిపిస్తూ ఉంది. స్టార్ హీరోలు కూడా తలుపులేసుకుని కూర్చోకుండా.. బయటకు వస్తున్నారు. టీవీ ఛానళ్ల వరకూ వస్తున్నారు, రియాలిటీ షోల వరకూ వస్తున్నారు. ఇప్పుడిప్పుడు వస్తున్న మార్పు ఇది. క్రమంగా మనోళ్ల వాళ్లకూ ఇది అలవాటుగా మారవచ్చు. బాలీవుడ్ ధోరణిని అంది పుచ్చుకోవచ్చు. అయితే మాల్స్ వరకూ రావడం, బహిరంగ ప్రదేశాల్లో జనాలను కలిసి.. సినిమాపై వారిలో ఆసక్తి పెరిగేలా చేయడం తెలుగు హీరోలకు సాధ్యం కాకపోవచ్చు.
-మధుర శ్రీధర్ రెడ్డి, నిర్మాత.
జనాల్లోకి వెళితే.. బాగుంటుంది..
తాము నటిస్తున్న సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచడానికి హీరోలు జనాల్లోకి వెళ్లడం మంచి పనే. మన దగ్గర ఆడియో విడుదల వేడుకలు ఘనంగానే జరుగుతున్నాయి. బాలీవుడ్ హీరోల్లా మన వాళ్లు కూడా ప్రమోట్ చేస్తే బాగుంటుంది.
-నవీన్, జనతా గ్యారేజ్ నిర్మాత.
-వెంకట్ ఆరికట్ల