-ఇదొక రెండున్నరేళ్ల ఫెయిల్యూర్ స్టోరీ!
-ప్రజలను అన్నీ రకాలుగానూ బాదుతున్న వైనం
-ఫలాలను అడిగితే పలాయన మంత్రం
-ప్రశ్నిస్తే.. మీద పడి రక్కే భక్తులు మరోవైపు
-యూపీఏ తో పోలిస్తే.. బీజేపీ ఎక్కడ మెరుగు?
‘గిల్లితే.. గిల్లించుకోవాలి.. అరవకూడదు…’ పోకిరి సినిమాలో ప్రకాష్ రాజ్ డైలాగ్, ప్రస్తుత భారతదేశంలో మోడీ పాలన తీరుకు వంద శాతం సూటయ్యే మాట ఇది. సినిమాలో తన కీప్ ను గిల్లుతూ ఆ డాన్ క్యారెక్టర్ ఆ డైలాగ్ చెబుతాడు. అతడు ఆమెను ‘ఉంచుకున్నాడు’ కాబట్టి.. అతడు గిల్లితే ఆమె గిల్లించుకోవాలి, మోడీ విషయంలోనూ అంతే, ఈయనను ఎన్నుకుంది కాబట్టి, భారతదేశం కూడా ఆయన గిల్లితే గిల్లించుకోవాలి. అరవకూడదు! అరిస్తే.. దేశద్రోహ నేరమే!
ఒకరకంగా కాదు.. మోడీ గిల్లుడు.. ఎన్నో రకాలుగా, ఎన్ని రకాలుగా? అంటే.. వస్తూ వస్తూనే మొదటి బాదుడు, రైల్వేటికెట్ల తో కొట్టారు. రెండు రూపాయలున్న ఫ్లాట్ ఫారమ్ టికెట్ ను పది రూపాయలకు తీసుకెళ్లారు. ఐదు రూపాయల ప్రయాణ చార్జీని ఇరవై ఐదు రూపాయలకు తీసుకెళ్లారు! అంత వరకూ రైళ్లంటే చౌక ధరతో ప్రయాణం చేయవచ్చన్న సామాన్యుడి నమ్మకాన్ని ఒక్క దెబ్బతో మటుమాయం చేయడం మోడీ ప్రభుత్వ ఘనతే!
అదేమంటే.. ఇక రైళ్లన్నీ శుభ్రంగా ఉంటాయన్నారు, ధరలతో గిల్లి, శుచిగా పెడతామని ఒక తప్పుడు వాగ్ధానాన్ని అయింట్ మెంట్ గా రాశారు! ధరల పెరుగుదల తర్వాత రైళ్లలో మెరుగైన సదూపాయాలు ఏమిటో యావత్ భారతానికీ తెలుసు! దాని గురించి మాట్లాడనవసరంలా. మోడీ గిల్లాడు కాబట్టి గిల్లించుకోవాలి!
పెట్రో ధరలు.. అవతల చమురు ఉత్పత్తి మీద ఆధారపడ్డ దేశాలు దివాళా తీసేంత స్థాయికి పతనం అయ్యింది క్రూడ్ ధర. ఈ విషయంల ఒపెక్ దేశాలు, నాన్ ఒపెక్ దేశాలు నోళ్లు కొట్టుకుంటున్నాయి! యూపీఏ హయాంలో ముడి చమురు ధరతో పోలిస్తే.. మోడీ వచ్చాకా నమోదైన పతనం.. రెండొంతులు! స్థూలంగా మూడోవంతుకు పడిపోయింది ధర. అయితేనేం.. ఇంకా పెట్రో ధరలు పెరుగుతూనే పోతున్నాయి. ఇదేంటి? అని అడిగకూడదు. డాలర్ తో రూపాయి మారకం అనే ఒక అసంబద్ధ వాదనను తెరపైకి తీసుకొస్తారు. ఇదేంటి మోడీ జీ? గతంలో పెట్రోల్ ధరలు పెరిగితే ట్వీట్లు పెట్టి తిట్టే వాళ్లు.. మీ హాయంలో ఇంత దారుణం అని ఎవరూ అడగొద్దు. ఎందుకంటే.. గిల్లింది మోడీజీ, గిల్లించుకోవాలి. అరవకూడదు!
డాలర్ తో రూపాయి మారకం విలువలో పతనం మన్మోహన్ చేతగానికి తనానికి నిదర్శనం అని జాతికి చెప్పిందీ నరేంద్రమోడీనే! అప్పట్లో ఈయన గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉంటూ.. మన్మోహన్ పనితీరుకు మార్కులేసే వారులే! మరి ఈయన ప్రధానమంత్రి అయ్యాకా.. రూపాయి కోలుకోకపోగా, మరింత పతనం అయ్యింది. ఇప్పుడు మాత్రం మోడీ దాని గురించి మాట్లాడరు! ఈ విషయంలో ఎవ్వరూ అడగకూడదు కూడా!
ఉగ్రవాదం… యూపీఏ హయాంలో దేశంపైకి ఉగ్రవాదులు దాడికి దిగితే, అది కాంగ్రెస్ పార్టీ మైనారిటీ రాజకీయాలకు నిదర్శనం అన్నారు. కాంగ్రెస్ చేతగాని తనంతోనే పాకిస్తాన్ రెచ్చిపోతోందన్నారు.. మేము వస్తే పాకిస్తాన్ పీచమణుస్తాం అన్నారు.. ఏమైంది? కాశ్మీర్ లో పరిస్థితులు అదుపుతప్పాయి, ఉగ్రవాదులు రెచ్చిపోయి విరుచుకుపడ్డారు. సర్జికల్ స్ట్రైక్స్ అన్నారు… వాటిని తమ రాజకీయం కోసం బాగానే వాడుకున్నారు. ఆ తర్వాత పాక్ ముష్కరులు మళ్లీ విరుచుకుపడ్డారు. మళ్లీ భారతీయ సైనికుల తలలు తీసుకెళ్లారు. ఆ తర్వాత భారత్ వైపు నుంచి ఎలాంటి సమాధానం లేకపోవడం విస్మయాన్ని కలిగించే అంశం. ఇప్పుడు మాత్రం భారత్ వైపు నుంచి బీరాలు లేవు. మళ్లీ సర్జికల్ దాడుల్లేవు, పాక్ కు సమాధానం చెప్పలేదు.. ఎవ్వరూ అడగొద్దు. అడిగిన వారంతా దేశద్రోహులే!
ఎన్ని అస్త్రాలను వీలైతే అన్ని అస్త్రాలనూ సంధించేశారు! ఎన్నికలే లక్ష్యంగా సెంటిమెంట్లు రగిల్చారు.. అన్ని రకాల మంటలూ పెట్టారు. నల్లధనం తెప్పిస్తామన్నారు, ఒక్కోరి ఖాతాలో పదిహేను లక్షలన్నారు, పాతిక రూపాయలకే లీటరు పెట్రోలన్నారు, ఉగ్రవాద కాండలుండవన్నారు.. అప్పటికే కాంగ్రెస్ పై పతాక స్థాయికి చేరిన ప్రజావ్యతిరేకతకు తోడు, ఈ సెంటిమెంట్లు.. ఆశలు పెట్టడాలూ అనుకూలంగా నిలిచి.. మోడీ కి అదృష్టం కలిసొచ్చింది!
అన్నీ చెప్పిన వాళ్లు అంతిమంగా ఏదీ చేయకుండా కూర్చున్నారు. అప్పట్లో విపరీతంగా మాట్లాడిన మోడీ ఇప్పుడు ఎవరైనా ఏమైనా మాట్లాడితే ఏడుస్తారు! కన్నీళ్లు పెట్టుకుంటారు.. నన్ను చంపేస్తారు అని బాధపడతారు.. తనకు వ్యతిరేకంగా కుట్రలు జరుగుతున్నాయని అంటారు! ఒకప్పుడు తన ఛాతి సైజు చెప్పి మరీ.. పెద్ద సైజు మాటలు మాట్లాడిన నరేంద్రమోడీ ఈ మధ్యకాలంలో మాట్లాడుతున్న బేల మాటలు, ప్రజలకు సమాధానం చెప్పకుండా ప్రతిపక్షాలను విమర్శించుకొంటూ కాలం గడుపుతున్న తీరు ప్రహసనంగా మారిందని వేరే చెప్పనక్కర్లా!
మోడీ పని తీరుకు దేన్ని ప్రమాణికంగా తీసుకుందాం? యూపీఏ హాయాం నాడు దేశంలో నెలకొన్ని ఉండిన పరిస్థితులనే కదా? మోడీ అధికారాన్ని సాధించుకుంది.. యూపీఏ ప్రభుత్వాన్ని తీవ్రంగా దునుమాడే కదా, దేశ ప్రజలు కూడా యూపీఏ పదేళ్ల పాలన మీద తీవ్రమైన వ్యతిరేకతను పెంచుకునే కదా..మోడీకి అధికారాన్ని అప్పగించింది? యూపీఏ మీద అన్ని రకాలుగానూ విసిగి, వేసారి.. ప్రజలు మోడీని ఎన్నుకున్నారు. మోడీ ప్రచారం కూడా.. యూపీఏ విధానాలకు విరుద్ధంగా వ్యవహరిస్తాను.. అనే సాగింది. యూపీఏ తరహాకు భిన్నమైన పాలనను అందిస్తాననే సాగింది.
విదేశాల్లోని నల్లధనాన్ని రాబడతాను, దేశంలో అవినీతిని అరికడతాను.. అంటూ మోడీ సత్యప్రమాణకంగా ఇచ్చిన హామీలను మొదలుకుని.. మన్మోహన్ హయాంలో జరిగిన పరిణామాల్లో ఆయన తప్పుపట్టనది అంటూ ఏమీ లేదు. పెట్రోల్ ధరలు పెరిగితే అది ప్రభుత్వ వైఫల్యం అన్నాడు, నాడు గుజరాత్ ముఖ్యమంత్రి హోదాలో మోడీ పెట్టిన ట్వీట్లను గమనిస్తే.. అప్పుడు మోడీ ఏ విషయాలను తప్పుపట్టాడో ఇప్పుడు అదే జరుగుతుండటాన్ని గమనించవచ్చు!
పార్లమెంటు సమావేశాలు ముగిసిన వెంటనే పెట్రోధరలు పెరిగాయని.. మోడీ అప్పట్లో ట్వీట్లు చేసేశారు. ఇవన్నీ కేంద్ర ప్రభుత్వ వైఫల్యానికి, చేతగాని తనానికి, అవినీతికి నిదర్శనం.. అని మోడీ అప్పట్లో చెప్పారు. మరి మొన్ననే.. పార్లమెంటు శీతాకాల సమావేశాలు ముగిసిన వెంటనే, పెట్రోధరలను పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. సమావేశాలు ముగిసిన రోజు రాత్రే.. పెట్రో ధరల పెంపు నిర్ణయాన్ని వెల్లడించారు!
యూపీఏ హయాంలో ఇలాగే జరిగితే, సభలో ప్రతిపక్షాలను ఎదుర్కొనలేకే, సమావేశాలు ముగిసిన వెంటనే పెట్రో ధరలు పెంచారని మోడీ వరస ట్వీట్లు పెట్టారు. మరి అప్పుడైతే అది తప్పు.. మరి ఇప్పుడు మోడీ చేసినదాన్ని ఏమనాలి?
ఇప్పటి వరకూ ఇదొక ఫెయిల్యూర్ స్టోరీ!
రెండు సంవత్సరాలా రెండు నెలలు పూర్తి అయ్యాయి. 31 నెలలు పూర్తి అయ్యాయి.. 60 నెలల అధికారంలో గడిచిన వాటితో పోలిస్తే మిగిలి ఉన్నవి తక్కువ! ఐదేళ్ల గడువులో సగం కాలానికిపైనే పూర్తి అయ్యింది. అయిపోయిన కాలం కన్నా మిగిలి ఉన్న కాలం చాలా తక్కువ! ఇప్పటి వరకూ నడిచిన కథను గమనిస్తే.. మోడీ సాధించింది శూన్యం! అరచేతిలో స్వర్గాన్ని చూపించి అధికారాన్ని సంపాదించుకున్న ఈయన అన్ని విషయాల్లోనూ మాట తప్పారు. ఆఖరికి ఏపీ వంటి రాష్ట్రానికి ప్రత్యేకహోదా విషయంలో కూడా మాట తప్పిన ఘనత వహించారు. నల్లధనం విషయంలో కానీ, ధరలను అరికట్టడంలో కానీ, పాక్ ను అణచడంలో కానీ, అంతర్జాతీయంగా పాక్ ను ఒంటరి చేయడంలో కానీ, పాక్ భరతంలో పట్టడంలో కానీ.. మోడీ పూర్తిగా ఫెయిల్యూర్! నడిచిందంతా ఒక ఫెయిల్యూర్ స్టోరీనే. ఆశలు ఎంతగా పెట్టారో.. అంతే స్థాయిలో నిరాశ పరిచారు.
వాట్ నెక్ట్స్.. ఏం జరగబోతోంది?
రెండున్నర సంవత్సరాలు పూర్తి అయిన దశలో నోట్ల మార్పిడి అనే సంచలన వ్యవహారాన్ని తెరపైకి తెచ్చి మరింత అప్రదిష్ట మూటగట్టుకున్నారు నరేంద్రమోడీ. మారకంలోని నోట్ల రద్దు గురించి ఇప్పటి వరకూ ఎన్ని మాటలు మార్చారో చెప్పనక్కర్లేదు.. మొదటేమో, నల్లధనికుల పని పట్టడానికి అన్నారు, ఆ తర్వాత ఉగ్రవాదులను అణచడానికి అన్నారు, పాక్ కు ఎదురుదెబ్బ అని ప్రకటించారు, ఆ తర్వాత దొంగ నోట్లను అరికట్టడానికి అన్నారు. అంతిమంగా డిజిటలైజేషన్ దగ్గరకు వచ్చి ఆగారు. నోట్ల రద్దు వ్యవహారంతో ఆర్థిక వ్యవహారాలన్నీ డిజిటలైజ్ అవుతాయని.. దీంతో దేశానికి బోలెడంత లాభం ఉందని చెబుతున్నారు!
నెలన్నర రోజుల్లో ఇలా రకరకాల మాటలు చెప్పినప్పుడే.. ఏ మాత్రం ముందు చూపు, అవగాహన లేకుండా.. ఈ ఈనిర్ణయాన్ని తీసుకున్నారు, ఏదో సంచలనం సృష్టించేస్తే చాలని అనాలోచితంగా ఈ నిర్ణయాన్ని తీసుకున్నారని స్పష్టం అవుతోంది. కొన్ని వందల మంది మరణించారు, దేశ ఆర్థిక వ్యవస్థకు తీరని నష్టాన్ని మిగిల్చారు.. చురుకైన వ్యాపారాలుగా ఉండిన రియలెస్టేట్ వంటి వ్యవహారాలు రెండు మూడు సంవత్సరాల వరకూ కోలుకునే పరిస్థితులు లేవు. నోట్ల మార్పిడి రద్దు పుణ్యమా అని టోల్ గేట్ల వద్దే కొన్ని వేల కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందంటే.. మిగతా రంగాలు ఎంత నష్టపోయి ఉంటాయో చెప్పనక్కర్లేదు. మరి ఇంతజేసీ.. ఏం సాధించారు? నల్లదొంగలు వారి వారి మార్గాల్లో ధనాన్ని మార్పించుకున్నారని స్పష్టం అవుతోంది. నల్లదొంగల వద్ద పట్టుబడిన కొత్తనోట్ల విలువే దీనికి సాక్ష్యం! పట్టుబడిందే ఇంత అయితే.. పట్టుబడని వారి మాటేంటి?
నోట్ల రద్దు తప్పు అని కాదు.. తగిన ప్రణాళిక లేదు, ఐదువందల, వెయ్యి నోట్ల ను రద్దు చేసి.. రెండు వేల నోట్లను తీసుకురావడం ఏమిటి? నల్లదొంగల నుంచి ఉగ్రవాదుల వరకూ ఎవరి వారు కొత్త నోట్ల ను ఎలా సంపాదించుకున్నారు? క్యూ లైన్లలో చనిపోయిన వారు ఏం పాపం చేసినట్టు? ఈ తుగ్లక్ చర్య వల్ల నలిగిపోయిన సామాన్యుడికి ఎందుకీ కష్టాలు? వీటన్నింటికీ సమాధానం చెప్పాల్సిన మోడీ, ప్రతిపక్షాల మీద రెచ్చిపోతున్నారు! ఆయన ఫెయిల్యూర్ కు ఇదే సాక్ష్యం.
అన్నింటికీ మించి.. నల్లధనం అనేది ఒక సింప్టమ్ తప్ప.. డిసీజ్ కాదు! అసలు డిసీజ్ అవినీతి. దాన్ని అరికడితే.. నల్లధనం అనే నొప్పి ఉండదు. ఈ విషయాన్ని అర్థం చేసుకోకుండా.. మోడీ ఒక అనాలోచిత చర్యకు పాల్పడి దేశానికి తీరని నష్టాన్ని మిగిల్చారు.
చేస్తాను అని హామీ ఇచ్చిన వాటిని చేయకపోవడమే కాదు, ఇలాంటి అనాలోచిత, అర్థం లేని పనులు చేసినందుకు సంబంధించిన పర్యవసనాలను రేపటి ఎన్నికల్లో అయినా ఆయన ఎదుర్కొనాల్సి ఉంటుంది! ఇదైతే తథ్యం. సెంటిమెంట్లు, భక్తి, మితిమీరిన హిందుత్వవాదం.. ఇవన్నీ ఒక ఎన్నికల్లో వర్కవుట్ అయి ఉండొచ్చు గాక, ఐదేళ్ల అనంతరం కూడా వీటినే నమ్ముకోవచ్చని అనుకుంటే.. పైకి అంతా బాగుందనిపించినా, భంగపాటు తప్పకపోవచ్చు!
మోడీ కన్నా.. ఆయన భక్తులే దేశానికి పెద్ద సమస్య!
మోడీ పాలన గురించి విశ్లేషించినా, ఆయన విధానాలను సమీక్షించినా.. ముందుగా కొంతమందికి బీపీ రైజ్ అయిపోతుంది. ఆగ్రహోద్రిక్తులు అవుతారు! వీరు ఇప్పటికే మోడీ భక్తజనావళిగా పేరు పొందారు. అదొక సిండ్రోమ్! వాస్తవాలను ఒప్పుకోనివ్వదు, అంతగా ఒప్పుకోవాల్సి వస్తే.. ఎదురుదాడి చేయడం. గత పాలకుల తప్పుల గురించి మాట్లాడటం!
మరి గతం గురించి మాట్లాడినంతగా వీళ్లు వర్తమానం గురించి ఆలోచించకపోవడం, గత పాలకుల విధానాలను విమర్శిస్తూ దుమ్మెత్తిపోసే మేధోతనం ఉన్న వీళ్లు… మోడీ పాలనా విధానాల గురించి మాట్లాడకపోవడం విస్మయాన్ని కలిగించే అంశం.
విప్లవాత్మకమైన రీతిలో విజయం సాధించిన ప్రభుత్వం నుంచి విప్లవాత్మకమైన మార్పులను ఆశించడం తప్పా? అద్భుతాలు చేస్తామంటూ అధికారంలోకి వచ్చిన వారి ద్వారా కొన్ని ఆశించడం అత్యాశ అవుతుందా?సూటిగా అడగాలంటే.. మోడీని ఏమీ అనకూడదా? చెప్పిందేమిటి.. చేస్తున్నదేమిటి? అని ప్రశ్నించకూడదా! ప్రశ్నిస్తే మీద పడి రక్కేస్తారా? దేశానికి మోడీ కన్నా మోడీ భక్తులే పెద్ద సమస్యగా తయారయ్యారు!
ఇంతకు ముందు ప్రభుత్వ విధానాల సంగతెలా ఉన్నా.. ఆ విధానాలను తప్పుపట్టడానికి మాత్రం అవకాశం ఉండేది. సోనియాను తిట్టినా.. మన్మోహన్ పై జోకులేసినా.. వాళ్ల రెస్క్యూకోసం ఎవరూ కత్తులు కట్టుకుని తిరిగే వాళ్లు కాదు!
ఆశ్చర్యం కలిగించే అంశాలు ఏమిటంటే.. మోడీ విషయంలో ఎదురవుతున్న ప్రశ్నలకు ఆయన అనుకూల వాదులు ఇచ్చే సమాధానాలు! అరవై సంవత్సరాల పాటు కాంగ్రెస్ ను భరించారు, మోడీని ఆ మాత్రం భరించలేరా? అని కొంతమంది సూడో మేధావులు ప్రశ్నిస్తూ ఉంటే, నిస్పృహ కలగక మానవు. మరి వీరు ఇంతకీ ఏం చెప్పదలిచారు? మోడీకీ కాంగ్రెస్ కు తేడా లేదనే కదా? సూటిగా ఆ విషయాన్ని చెప్పే ఉద్దేశం లేకపోయినా.. వీళ్లు చెప్పే ఫిలాసఫీ మాత్రం అదే సందేశాన్నే ఇస్తోంది! భరించడం మీ ఖర్మ.. ఇన్నాళ్లు కాంగ్రెస్ ను భరించారు, ఇప్పుడు మోడీని భరించండి అని వీళ్లు బోధిస్తున్నారు. కాంగ్రెస్ ను తిట్టి అధికారంలోకి వచ్చిన వ్యక్తిని.. కాంగ్రెస్ ను తిడుతూ బతికేస్తున్న వ్యక్తిని.. కాంగ్రెస్ తోనే పోల్చడమా! ఇక నిర్ణయాధికారం భారత ప్రజానీకానిదే!
సూడో మేధో వర్గం చేరిందా!
వెనుకటికి భారత్ వెలిగిపోతోంది.. అనే నినాదాన్ని ఇచ్చి బీజేపీ భంగపడింది. ఇప్పుడైతే అంతకు మించిన స్థాయికి చేరిపోయింది వీరి స్వోత్కర్ష. కొంతమంది మేధావులు కూడా బీజేపీని, మోడీని ఇలా తయారు చేస్తున్నారేమో అనిపించక మానదు! వీళ్ల అడ్డగోలు వాదనలకు అడ్డే లేకుండా పోతోంది.
డినామినేషన్ ను సమర్థిస్తూ మీడియా ముందుకు వచ్చి మాట్లాడే.. శక్తికాంతదాసు లాంటి మేధావులు అయినా, మోడీని సమర్థిస్తూ ట్వీట్లు పెట్టే.. చేతన్ భగత్, అర్నాబ్ గోస్వామిలైనా.. అంతిమంగా మోడీకే నష్టం చేస్తున్నారని చెప్పనక్కర్లా!
పాక్ ముష్కరులు భారతీయ సైనికుడి తలను తీసుకెళితే..నాటి ప్రధాని మన్మోహన్ మౌనంగా ఉన్నాడని చేతన్ భగత్ అప్పట్లో ట్వీట్లు పెట్టి.. సామాన్యులందరినీ ఆకట్టుకున్నాడు. అయితే.. ఇటీవల అదే పాక్ ముష్కరులు, మరో భారత సైనికుడి తలను తీసుకెళ్లారు (సర్జికల్ స్ట్రైక్స్ అనంతరం). అయితే.. దానిపై మోడీ మారు మాట్లాడటం లేదు, ఇలాంటి మేధావులూ ప్రస్తావించడం లేదు! మోడీకి అనుకూలమైన వాదనలను పోస్టు చేయడమే తప్ప.. వాస్తవాలను అంగీకరించడానికి వీళ్లు ఒప్పుకోవడం లేదు.
ఇక అరవై ఏళ్లు కాంగ్రెస్ కు అధికారం ఇచ్చారు, మోడీ రెండున్నరేళ్ల యినా అధికారం అనుభవించక ముందే.. చందమామను తెచ్చివ్వమంటున్నారని మరో మేధావి ఒకరు ట్వీట్ చేశారు. మరి చందమాను తెచ్చి ఇస్తామని మోడీ హామీ ఇచ్చాడా లేదా? మోడీ చెప్పిందాని గురించి అడిగితే.. ఇంత ఉలికి పాటు ఎందుకు?
మోడీ మీకంతా సీన్ ఉందా?
ఇందిరాగాంధీ ఎందుకు స్మార్ట్ ఫోన్ వాడలేదు? నెహ్రూ ఎందుకు వరస పెట్టి నా లాగా విదేశాలు తిరగలేదు? ఇలాంటి.. ప్రశ్నలు వేస్తున్నారు శ్రీమాన్ నరేంద్రమోడీ! మాటెత్తితే అరవై యేళ్ల కాంగ్రెస్ పాలన అంటారు.. మరి ఈ లెక్కన వాజ్ పేయి కూడా కాంగ్రెస్ వ్యక్తేనా? దాదాపు ఆరున్నర సంవత్సరం ఆయన ప్రధానిగా ఉన్నారాయన. అంటే అరవై ఏళ్లలో పదోవంతు కాలం బీజేపీ చేతిలోనే అధికారం ఉండింది. అదిగాక గత రెండున్నరేళ్ల నుంచి అధికారమూ మోడీ చేతిలోనే ఉంది!
మరి మీరు పొడిచింది ఏమిటో చూపించాలి. సామాన్యులను రోడ్డుపై నిలపడం తప్ప.. గత రెండున్నరేళ్లలో సాధించిన మరో అంశం ఏమిటో వివరించాలి. ఇది చేయలేక.. నెహ్రూను, ఇందిరను విమర్శించడమా! టెక్నాలజీ, రవాణా సౌకర్యాలు ఇంతగా అభివృద్ధి చెందిన ఈ కాలంలో బ్యాంకులకు సకాలంలో కరెన్సీని చేరవేయలేని వాళ్లు, కనీస ప్రణాళిక లేకుండా, నిరక్షరాస్యతతో నిర్ణయాలు తీసుకునే వాళ్లు.. నెహ్రూలను, ఇందిరలను విమర్శించడమా!
స్వతంత్ర పోరాటంలో.. నెహ్రూ ఎన్నేళ్లు జైల్లో ఉన్నారా తెలుసా వీళ్లకు? ఒక సంపన్న కుటుంబం నుంచి వచ్చిన వాడెవడైనా ఒక్కరోజు జైల్లో ఉండమంటే ఉంటాడా? అప్పుడప్పుడే స్వతంత్రం సంపాదించుకున్న దేశం నుంచి వచ్చి అలీన విధానంతో.. ప్రపంచంలోని అనేక దేశాలకు ఒక వారధిగా నిలిచి, చనిపోయే వరకూ ప్రధానిగా భారతీయుల మద్దతు పొందిన నెహ్రూను, రాజభరణాల రద్దు, బ్యాంకుల జాతియీకరణ, బంగ్లాదేశ్ ఏర్పాటుకు సహకరించి పాక్ రెక్కలు విరిచిన.. ఇందిరను విమర్శించడమా! ఆకాశాన్ని చూసి ఉమ్మివేసే ఇలాంటి యత్నాలు చేస్తూ.. బ్యాలెన్స్ పరువును కూడా మోడీ పొగొట్టుకుంటున్నారు. అధికారాన్ని చేతిలో పెట్టుకుని.. అల్లకల్లోలం సృష్టిస్తున్న ఈయన, నెహ్రూ-ఇందిరలను విమర్శించడం ఎంత త్వరగా ఆపితే ఈయనకే అంత మంచిది!