అరకొర నిధులు... అయినా అద్భుత రాజధాని...!

ఉమ్మడి రాష్ట్రంలో పదేళ్లపాటు ప్రతిపక్ష నాయకుడి పాత్ర పోషించిన చంద్రబాబు నాయుడు అవశేష ఆంధ్రకు ముఖ్యమంత్రి అయిన తరువాత చిత్రవిచిత్రంగా వ్యవహరిస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రానికి సీఎంగా పనిచేసిన బాబుకు, ఇప్పటి బాబుకు చాలా తేడా ఉంది. ఆయన్ని చూస్తే 'వీడు తేడా' అనే సినిమా టైటిల్‌ గుర్తొస్తోంది. అలాగే 'మింగ మెతుకు లేదు మీసాలకు సంపెంగ నూనె'..అనే సామెత మాదిరిగా ఉంది బాబు వ్యవహారశైలి. ప్రత్యేక హోదా ఇక రాదనే విషయం బహిరంగ రహస్యమే. ప్రత్యేక ప్యాకేజీ కూడా అనుమానాస్పదంగానే ఉంది. తాజాగా కేంద్రం ఇచ్చిన అరకొర నిధులు చూస్తే ఏపీ పట్ల దాని నిర్లక్ష్యం స్పష్టంగా తెలుస్తోంది. 

ఈ నిధులతో కనీసం ఎలక్ట్రికల్‌, టెలికాం కేబుళ్లు కూడా వేయలేమని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. బందేల్‌ఖండ్‌ ప్యాకేజ్‌ ఇస్తామని చెప్పి అరకొర నిధులిస్తారా అని మండిపడ్డారు. సరే...గతంలో పాడిన పాటలే మళ్లీ పాడారు. తాజా నిధుల కేటాయింపు పట్ల రాష్ట్రంలో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. మరి చంద్రబాబు ఏం చేస్తారో చూడాలి. ప్రస్తుతం విదిల్చిన చిల్లర డబ్బులతో కేబుళ్లు కూడా వేయలేమని చెబుతున్న చంద్రబాబు అదే సమయంలో మంత్రి నారాయణ, ఉన్నతాధికారులతో నిర్వహించిన సమావేశంలో 'అద్భుత రాజధాని' నిర్మాణంపై చర్చించారు. 'ప్రపంచంలోనే అత్యుత్తమ నివాసయోగ్యమైన నగరంగా అమరావతి ఉండాలి'..అని అన్నారు. 

ఇందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. ఆయన అమరావతిలో నిర్మించాలనుకున్నవన్నీ 'ఐకానిక్‌' నిర్మాణాలు. అందుకే రాజధాని ఎలా ఉండాలనేదానిపై ఇంకా అధ్యయనం సా....గుతూనే ఉంది. ఈ సమావేశంలో అధికారులు ప్రపంచంలోని పది అత్యుత్తమ నగరాలపై బాబుకు ప్రజెంటేషన్‌ ఇచ్చారు. కజ్‌కిస్తాన్‌లోని ఆస్తానా, మలేసియాలోని పుత్రజయ, ఆస్ట్రేలియాలోని కాన్‌బెర్రా, తుర్కెమినిస్తాన్‌లోని ఆష్కాబాద్‌, బ్రెజిల్‌లోని బ్రెసీలియా, అమెరికాలోని వాషింగ్టన్‌ డీసీలతో పాటు మన దేశంలోని ఢిల్లీ, నయా రాయ్‌పూర్‌, చండీఘడ్‌ నగరాల గురించి అధికారులు బాబుకు వివరించారు. గమనించారా...బాబు చేస్తున్న రాజధానుల అధ్యయనంలో కొత్త విదేశీ నగరాలు చేరాయి.  

కేంద్రం విదిల్చే చిల్లర డబ్బులతో, ప్రభుత్వ ఖజానాపై భారం మోపే స్వదేశీ, విదేశీ ఆర్థిక సంస్థల రుణాలతో రాజధాని కడతారా? ఓ పక్క బీద ముఖ్యమంత్రిగా (ఆయన కాదు రాష్ట్రం), మరో పక్క 'కలల బేహారీ'గా రెండు పాత్రలను అద్భుతంగా పోషిస్తున్నారు. డబ్బులు లేవంటూనే రైతుల రుణాలన్నీ మాఫీ చేశామంటారు. విదేశాలకు వెళ్లినప్పుడు రాష్ట్రం రాకెట్‌ వేగంతో అభివృద్ధి చెందుతోందని, రెండంకెలు మూడంకెల వృద్ధి రేటు సాధించామని అక్కడి పెట్టుబడిదారులకు ఊదరగొడతారు. తనను తాను ట్వంటీఫోర్‌ ఇంటూ సెవెన్‌ కష్టజీవిగా, వందశాతం నిజాయితీపరుడిగా అభివర్ణించుకుంటారు. 

ఇలా అనేక పాత్రల్లో అవలీలగా జీవించేస్తున్నారు. డబ్బుల లెక్కలకు, అద్భుత రాజధానికి ఎక్కడా పొంతన కుదరడంలేదు. మొత్తం రాజధాని నిర్మాణానికి (బాబు కలలు కంటున్న విదేశీ నగరం) కేంద్రం ఎట్టి పరిస్థితిలోనూ సహాయం చేసే ప్రసక్తే లేదు. సచివాలయం, అసెంబ్లీ, హైకోర్టు, రాజ్‌భవన్‌, మరో ఒకటి రెండు ప్రభుత్వ భవనాల నిర్మాణానికి మాత్రమే కేంద్రం సాయం చేస్తుందని ఓ ఆంగ్ల పత్రిక తాజాగా  కథనం రాసింది. నిజానికి ఇది కొత్త విషయం కాదు. ఈ విషయం కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు చాలాకాం క్రితమే ఓ టీవీ ఇంటర్వ్యూలో చెప్పారు. మిత్రపక్షమైన బీజేపీ అధికారంలోకి రావడంతోపాటు తాను ముఖ్యమంత్రి కావడంతో కేంద్రం నుంచి లక్షల కోట్లు వస్తాయని బాబు అనుకున్నారు. 

అందుకే అద్భుత రాజధాని నిర్మించబోతున్నట్లు ప్రచారం చేశారు. కాని చివరకు కేంద్రం  ఇంత అద్భుతమైన రాజధాని నిర్మాణానికి సాయం చేయడం తన వల్ల కాదని, ప్రధాన నిర్మాణాలకు మాత్రమే సాయం చేస్తామని తేల్చిపారేసింది. ఇతర హంగులు ఆర్భాటాలు, రంగురంగలు నగరాలు, ఉద్యానవనాలు, ఆకాశహర్మ్యాలు, ఐకాన్‌ నిర్మాణాలు ...బుర్రలో ఏం ఊహించుకున్నారో అవన్నీ రాష్ట్ర ప్రభుత్వమే చూసుకోవాలని చెప్పేసింది. చంద్రబాబు ప్రచారం చేసిందేమిటి? జరుగుతున్నదేమిటి? చంద్రబాబు తెలుగు ప్రజల ఊహకు కూడా అందని నగరాన్ని (గ్రాఫిక్స్‌ చిత్రాలు) సింగపూర్‌ నిపుణుల చేత ఆవిష్కరింపచేశారు. అది సాకారమవుతుందా? ఓ కేంద్ర మంత్రి చేసిన కామెంట్‌ను ఆంగ్ల పత్రిక తన కథనంలో ఉటంకించింది. ''ఏపీ ప్రభుత్వం ఒక్క తాజ్‌మహల్‌ కడతానంటే నిధులు ఇస్తాం. కాని పది తాజ్‌మహళ్లు కడతామంటే వాటన్నింటికీ నిధులు ఇవ్వాలా?''...అని ప్రశ్నించారు. ఇది చాలు చంద్రబాబు పరిస్థితి ఏమిటో తెలియచేయడానికి. 

Show comments