ముందుంది మరింత గడ్డుకాలమే..!

-దగ్గరపడుతున్న ఎన్నికలు, బాబుకు కలిసిరాని కాలం

-విపరీత స్థాయికి ప్రజా వ్యతిరేకత, కనిపించని సానుకూలత

-వెంకయ్య నిష్క్రమనం, ఇక మరింత కష్టం

-పెరిగేలాలేని సీట్లు, నియోజకవర్గాల్లో పాట్లు

-అమలు కాని హామీలు, బయటపడుతున్న బలహీనతలు!

ఒకవేళ మొన్నటి ఎన్నికల్లో గనుక తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు తిరిగి ముఖ్యమంత్రి కాకపోయుంటే.. ఆయనంటే ఏమిటో ఈ తరానికి అర్థం అయ్యేదికాదు. హైదరాబాద్‌ను నేనే ప్రపంచ పటంలో పెట్టా, ఐటీని ఇండియాకు నేనే పరిచయం చేశా, అంబేద్కర్‌కు నేనే భారతరత్నను ఇప్పించా, అబ్దుల్‌ కలాంను నేనే రాష్ట్రపతిగా చేశా.. అంటూ బాబు చెప్పుకుంటే, నిజమే కాబోలు.. అని నమ్మేదశలో ఉండింది నేటితరం యువత. వీళ్లే ఎందుకు నమ్మారంటే.. 2004కు ముందు వీళ్లంతా పిల్లలు. అప్పుడు ఏం జరిగిందో వీళ్లకు తెలీదు. వీళ్లకు అవగాహన మొదలైన పదేళ్ల పాటూ కూడా బాబు ప్రతిపక్షంలోనే ఉండినారు. ప్రజలు బాబును వరసగా రెండు పర్యాయాలు చిత్తుచిత్తుగా ఓడించి ప్రతిపక్షంలో ఎందుకు కూర్చోబెట్టారనే.. అంశంపై కనీసం అవగాహన లేనివాళ్లు 'బ్రింగ్‌ బాబు బ్యాక్‌' అన్నారు. మరి ఇప్పుడేమైంది.. మూడేళ్లు గడిచాయి! బాబు వచ్చినందుకు ఏమైందో ఇప్పుడైనా అంతా గమనిస్తున్నారనే అనుకోవాలి.

ఒకవైపు అంతర్జాతీయ టెక్నాలజీ, ప్రపంచానికి అంతుబట్టని అమరావతిని నిర్మిస్తానని బాబు చెప్పుకుంటుంటే.. పన్నెండొందల కోట్ల రూపాయలు వెచ్చి నిర్మించిన అసెంబ్లీ, సెక్రటేరియట్‌లు నిలువునా కారుతున్నాయి. ఇదొక్కటీ చాలు.. బాబు గారంటే ఏమిటో అర్థం చేసుకోవడానికి. బాబుగారి విజన్‌ ఏమిటో, బాబుగారి వ్యవహారాలు ఏమిటో, పన్నెండొందల కోట్లుపెట్టి నిర్మించిన భవనం పరిస్థితిని గమనించి అర్థం చేసుకోవచ్చు. పన్నెండు వందలకోట్లు కాదు.. పన్నెండు వేల రూపాయలు ఖర్చుపెట్టి రేకుల షెడ్డు వేసినా అదికారదు, కానీ.. బాబుగారి పన్నెండొందల కోట్ల భవనం మాత్రం.. ఆయన విజన్‌కు వ్యవహారాలకు నిర్వచనాన్ని ఇస్తోంది!

ఇక కులం కారణం చేత.. చంద్రబాబును, తెలుగుదేశం పార్టీని అభిమానిస్తున్నాం అనేవారిని పక్కనపెడితే, మిగతావారు మాత్రం ఇంగితంతో ఆలోచించే పరిస్థితి వచ్చిందిప్పుడు. మూడేళ్లలో బాబుగారి పాలనలో జరుగుతున్న దారుణాలు, దాష్టీకాలను గమనిస్తూనే ఉన్నారంతా. జగన్‌పై అవినీతి అన్నారు. మూడేళ్లు గడిచిపోయాయి.. నిన్ననో, మొన్ననో.. ఒక మంత్రిగారు అన్నారు, జగన్‌ నుంచి ప్రతిపైసా రాబడతాం అని. మరి గత మూడేళ్లలో ఎంతరాబట్టారు? జగన్‌కు ఏయే కేసుల్లో శిక్ష వేయించారు, జగన్‌ అవినీతికి ఎన్ని ఆధారాలను సంపాదించారో చెబితే.. ముందు ముందు రాబట్టబోయేది ఎంతో అర్థం అవుతుంది. 'జగన్‌ అన్ని పనులకూ అడ్డు పడుతున్నారు..' ఇదీ రెండురోజుల క్రితం ఒక మంత్రిగారు ఇచ్చిన స్టేట్‌మెంట్‌. మరి అధికారంలో ఉన్నది జగన్‌ మోహన్‌ రెడ్డా లేక తెలుగుదేశం పార్టీనా? ఇది బేసిక్‌ కొశ్చన్‌. కానీ ఇక కామెడీ ఏమిటంటే.. జనాలు కామన్‌సెన్స్‌తో ఆలోచిస్తారు. అడ్డగోలుగా మాట్లాడితే నవ్వుతారు.. అనే స్పృహ తెలుగుదేశం నేతల్లో, బాబుగారి మంత్రుల్లో లేకపోవడం! 

ఇలాంటి మతిలేని మాటలతో.. వీళ్లు జగన్‌ నష్టం చేయడంకాదు, తమ చేతగాని తనాన్ని చాటుకుంటున్నారని మాత్రం స్పష్టం అవుతోంది. అధికారంలో ఉన్నవాళ్లు ప్రతిపక్షంలోని వ్యక్తిని చూసి ఇంతలా కలవరించుకోవడం రాష్ట్ర రాజకీయ చరిత్రలో బహుశా రెండోసారి మాత్రమే. 1999 నుంచి 2004ల మధ్య తెలుగుదేశం నేతల నోళ్లలో వైఎస్‌ పేరు ఇలాగే మార్మోగింది. ఇప్పుడు మళ్లీ వైఎస్‌ జగన్‌ నామస్మరణను అదేస్థాయిలో చేస్తున్నారు తెలుగుదేశం నేతలు. వైఎస్‌ ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలంలో.. అనునిత్యం చంద్రబాబు మీద విరుచుకుపడలేదు కాంగ్రెస్‌ వాళ్లు. బాబు డెవలప్‌మెంట్‌కు అడ్డుపడుతున్నాడనో, బాబు కుట్రలు చేస్తున్నాడనో, బాబు అవినీతిపరుడు అనో.. అనునిత్యం వాగలేదు. నీపని నువ్వు చేసుకో, మా పని మేం చేసుకుంటాం.. అన్నట్టుగా సాగింది వ్యవహారం. అయితే.. ఇప్పుడు అధికార పార్టీ వాళ్ల నోళ్ల నుంచి తమ పార్టీ అధినేత పేరు కన్నా... ప్రతిపక్ష నేత పేరే ఎక్కువగా వినిపిస్తోంది.. తెలుగుదేశం పార్టీ బలహీనతను స్పష్టం చేస్తున్న మరో అంశం ఇది.

కనీవినీ ఎరగని అవినీతి...!

తెలుగు రాజకీయాల్లో అవినీతికి చంద్రబాబు కిటీలు తెరిచాడు.. అనేది ఇప్పుడు తెలుగుదేశంలో ఉన్న నేతలు చెప్పేమాటే, చంద్రబాబు కిటికీలు తెరిస్తే, వైఎస్‌ గేట్లు తెరిచాడు.. అంటూ ఉంటారు. కానీ ఇప్పుడు గ్రామాల్లో జరుగుతున్నది చూస్తుంటే.. జనాలు నోళ్లు తెరుచుకుంటున్నారు! ప్రతిదానికీ ఒక రేటుంది. 'జన్మభూమి కమిటీలు' అనే వాటితో పచ్చచొక్కా వేసుకున్న వాళ్ల ప్రతివాడూ వసూళ్లు చేసే వాడయ్యాడు. ముసలివాళ్ల పేర్లను పెన్షన్‌కు సిఫార్సు చేయాలంటే ఒకరేటు, కొత్తగా రేషన్‌ కార్డు కావాలంటే దానికో రేటు.. ఇలా మొదలుపెడితే ప్రభుత్వం నుంచి అమలయ్యే ప్రతి సంక్షేమ పథకానికీ ఒక ధరను కట్టి అమ్ముతున్నారు తెలుగు తమ్ముళ్లు. కాంగ్రెస్‌ హయాంలోనూ సంక్షేమ పథకాలు అమలయ్యాయి కానీ.. అర్హులను నిర్ధారించడానికి ఇంతలా దోపిడీ జరిగింది మాత్రం లేదని కచ్చితంగా చెప్పాలి. ప్రతి పచ్చచొక్కా జేబు నింపడానికే చంద్రబాబు నాయుడు ఈ జన్మభూమి కమిటీలను ఏర్పాటు చేసినట్టుగా ఉన్నాడు.

కాంగ్రెస్‌ హాయంలో భారీఎత్తున అమలయిన సంక్షేమ పథకం ఇందిరమ్మ ఇళ్లు. ఆ పథకంలో కొన్ని లోటుపాట్లు నిజమే. ఒకే ఇంట్లోని వాళ్లు రెండుమూడు ఇళ్లను తెచ్చుకోవడం.. ఆ డబ్బునంతా ఖర్చుపెట్టి ఒకే ఇంటిని నిర్మించడం.. తరహావి. అది అక్రమమే. కానీ.. అక్కడ లబ్ధిదారుడు సామాన్యుడు. ఇక కేంద్రంలో మోడీ, రాష్ట్రంలో చంద్రబాబు వచ్చాకా ఇళ్ల నిర్మాణ పథకాన్ని కొండెక్కించారు. మూడేళ్లలో సబ్సిడీతో ఇచ్చిన ఇంటిలోన్లు ఎన్నో.. దానికి బడ్జెట్‌ నుంచి జరిపిన కేటాయింపులు ఎన్నో గమనిస్తే చాలు వాస్తవం అర్థం అవుతుంది. వైఎస్‌ హాయంలో ప్రతి ఊరిలో పార్టీలకు అతీతంగా ఊర్లో ఉన్న ప్రతి ఒక్కరికీ ఇళ్ల కేటాయింపు జరిగితే.. చంద్రబాబు హాయాం వచ్చేసరికి ఊరికి రెండు మూడు ఇళ్ల దగ్గరకు వచ్చింది పరిస్థితి. అవి కూడా ఎస్సీఎస్టీలకు, బీసీలకు ఇస్తున్నవే. మరి వారికైనా సూటిగా ఇస్తున్నారా అంటే.. అదీ లేదు. జన్మభూమి కమిటీలోని వారు లబ్ధిదారులను ఎంపిక చేస్తారు. లక్ష రూపాయల లోన్‌ వచ్చే అవకాశం ఉంటే.. అందులో పదోవంతు మొత్తం జన్మభూమి కమిటీ సభ్యుడి చేతిలో పడితే.. అప్పుడు ఆ లోన్‌ గ్రాంట్‌ అవుతుంది. తామరతంపరగా పెరిగిన అవినీతికి ఇలాంటివి చాలా చిన్న ఉదాహరణలు.

అవినీతికి కొత్త మార్గాలను అన్వేషించారు!

కాంగ్రెస్‌ వాళ్లు కూడా చెబుతున్న విషయం ఏమిటంటే.. ఇన్ని రకాలుగా అవినీతి చేయవచ్చని మాకు కూడా తెలీదు అని! అలా తెలుగుదేశం వాళ్లు అన్వేషించిన కొత్త అవినీతి వనరుల్లో ఇసుక అక్రమ రవాణా వంటివెన్నో ఉన్నాయి. మరి గ్రామాల స్థాయిలోనే ఈస్థాయి దోపిడీ జరుగుతుంటే.. పైకి వచ్చేకొద్దీ దాని పరిధి, స్థాయి పెరుగుతుందని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదుకదా. సాగునీటి ప్రాజెక్టులను అడ్డం పెట్టుకున్న దోపిడీకి కూడా హద్దులేదు. హంద్రీనీవా వంటి ప్రాజెక్టు లిస్టులో లేని లైనింగ్‌ వంటి వాటిని తెరపైకి తెచ్చే వందల కోట్ల రూపాయలు దోచుకుంటున్నారు. ఇక పట్టీసీమలోని అక్రమాలను కాగ్‌ ఎండగట్టింది. సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి ప్రతి కాంట్రాక్ట్‌నూ అంచనాలు పెంచారు, కొత్త నంబర్లను తెరపైకి తెచ్చారు.. ఇలాంటి అవినీతి మొత్తాన్ని లెక్కగడితే కళ్లు బైర్లుకమ్మే స్థాయికి చేరుతుంది. కాంగ్రెస్‌ హాయంలో అవినీతి జరిగిందని ఏ రంగాలనైతే టీడీపీ ప్రస్తావించిందో.. అవే రంగాల్లో అంతకు మించినస్థాయి అవినీతిని చేయడంతో పాటు.. కొత్త మార్గాలనూ అన్వేషించి తెలుగుదేశం ముఖ్యనేతలు దండుకుంటున్నారు.

ఇక భూముల కుంభకోణం సరేసరి. అమరావతిలో దీని విలువ వేలకోట్లు అయితే.. మిగతా చోట ప్రభుత్వ భూములను తెలుగుదేశం నేతలు ఆక్రమించిన తీరు, రికార్డులను మాయం చేసిన తీరు కూడా వెలుగులోకి వచ్చి.. ఈ కుంభకోణం విలువను లక్షకోట్ల లెవల్‌కు తీసుకెళ్తున్నాయి. ఇదంతా చెప్పాలంటే.. రోజుల సమయంచాలదు. రీళ్లకొద్దీ పేపర్లు సరిపోవు. మొన్న అనంతపురం జిల్లాకు ఇన్‌పుట్‌ సబ్సీడీ వచ్చింది.. ఏదో రైతులకు అంతో ఇంతో మేలు జరుగుతుందని అనుకుంటే, ప్రభుత్వ భూములను, దేవాలయాల కింద ఉండే భూములను సాగు చేయకపోయినా... సాగు చేసినట్టుగా చూపించి, లీజు పత్రాలను క్రియేట్‌ చేసి.. ఇన్‌పుట్‌ సబ్సీడీలను పొందారంటే.. ఈ కుంభకోణం మొత్తం విలువ కోట్ల రూపాయల్లో ఉందంటే.. అవినీతి పరాకాష్టకు చేరిందని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

నిప్పు.. అని చెప్పుకుంటే అయిపోతారా?

ఇప్పటికీ బాబుగారు చెప్పుకునేది ఏమిటంటే.. తను 'నిప్పు'అని. వాస్తవం ప్రజల కళ్ల ముందు కనిపిస్తూ ఉంటే, అనుకూల మీడియాలో అచ్చేసుకోవడానికి బాబుగారు సూక్తిముక్తావళి వల్లెవేస్తూ ఉన్నారు. అయితే బాబుగారు చెప్పే సూక్తి ముక్తావళిని జనాలు నమ్ముతున్నారని అనుకోవడం తెలుగుదేశం పార్టీ, ఆ పార్టీ అనుకూల మీడియాల అమాయకత్వం తప్ప మరోటికాదు. ఒకరకంగా కాదు.. అన్ని రకాలూగానూ చంద్రబాబు నాయుడు నమ్మకాన్ని కోల్పోయాడు. పచ్చి మోసగాడు, నోరుతెరిస్తే అబద్ధాలు, అనవిగాని మాటలే.. అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు జనసామాన్యం. రైతు రుణమాఫీ దగ్గర అయితేనేం, డ్వాక్రా రుణమాఫీ దగ్గర అయితేనేం.. ఉద్యోగాల విషయంలో, పెన్షన్ల విషయంలో ఇలా ఏదో ఒక విషయంలో బాబుగారిని నమ్మి, ఆశ పెట్టుకుని మోసపోయిన వారు ప్రతి ఇంటా ఒకరున్నారు. కొందరు బయటపడుతున్నారు.. కొందరు బయటపడటంలేదు అంతే తేడా. 

ప్రతి'ఫలం'ఉంటుంది చంద్రబాబు...

ఇప్పటికే బాబు ప్రభుత్వం మీద తీవ్రమైన వ్యతిరేకత నెలకొని ఉంది. ఇది ఊరికే అర్రీబుర్రీగా చెబుతున్న మాటకాదు. చంద్రబాబు చేష్టలే ఈ మాటకు నిదర్శనాలు. గత ఎన్నికల్లో తమకు పూర్తిగా అనుకూలంగా నిలిచిన ప్రాంతాల్లో కూడా పెండింగ్‌లో ఉన్న మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికలు నిర్వహించలేనంత దారుణమైన స్థితిలో ఉంది తెలుగుదేశం పార్టీ. తమకు ఏమాత్రం ఇష్టంలేకుండా వచ్చిన నంద్యాల ఉపఎన్నికల్లో గెలవడానికి చంద్రబాబు పడుతున్న పాట్లు ఆయనలోని భయానికి, ప్రజల్లో పెరిగిన వ్యతిరేకతకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. ఒక్క ఎమ్మెల్యే సీటు కోసం యాభైమంది నేతలను బరిలోకి దించారు బాబుగారు. మరి ఇప్పుడంటే ఒక్కసీటు కోసం యాభైమంది వచ్చారు.. మరి రేపటి ఎన్నికల్లో ఈ యాభై మందిని రక్షించడానికి నేతలను ఎక్కడ నుంచి తెస్తారు? ఒక్క నియోజకవర్గంలో నెగ్గడానికే ఇంత కష్టపడుతుంటే.. రేపు 175 నియోజకవర్గాల్లో గెలవడానికి ఏం కష్టం పడతారు? ఎలా కష్టపడతారు?

ముందుంది ముసళ్ల పండగ...

అప్పుడే అయిపోలేదు. గత మూడేళ్లలో బాబుగారి పాలన తీరు, ఆయన చేసిన రాజకీయాల ఫలితాలు.. ప్రబలిన ప్రజా వ్యతిరేకత.. రానున్న రెండేళ్ల పరిణామాలనూ శాసించనున్నాయి. నంద్యాల ఉపఎన్నికల తర్వాత మొత్తం కథ మారిపోయే అవకాశం ఉంది. నంద్యాల్లో తెలుగుదేశానికి ఎదురుదెబ్బ తప్పదు. యాభైమంది నేతలను పంపి, తనే రంగంలోకిదిగి, తన తనయుడిని రంగంలోకి దించి.. కూడా బాబు గెలవలేరు. తలకిందుల తపస్సు చేసినా టీడీపీకి విజయం దక్కదు అక్కడ. నంద్యాల ఉపఎన్నికను బాబు పాలనకు రెఫరండం కాదు.. అని అంటే అది తెలుగుదేశం పార్టీ తనను తాను మోసం చేసుకోవడం తప్ప మరోటికాదు. ఇలా బాబుగారి పాలనపై ప్రజల్లో ఉన్న భావన బయటపడటమే కాదు.. అటు కేంద్రంలో కూడా పరిణామాలు వేగంగా మారుతున్నాయి. అందులో ముఖ్యమైనది.. వెంకయ్యను బీజేపీ వాళ్లు చాలా తెలివిగా కట్టడి చేయడం.

వెంకయ్య సేవలను కోల్పోతున్నందుకు బాధగా ఉందని అంటున్నాడు అమిత్‌ షా, చాలా బాధతో ఉప రాష్ట్రపతి బాధ్యతలు తీసుకుంటున్నాను అన్నాడు వెంకయ్య.. మరి ఇందులో ఎవరి బాధ నిజం ఎవరి బాధ అబద్ధం అనేది అర్థం చేసుకోవడం చాలా సులభం. సీట్లపెంపు బిల్లును తను గట్టెక్కిస్తానని నిన్నలా మొన్న వెంకయ్య నాయుడు ప్రకటించారు. అలా ప్రకటించిన కొన్ని గంటల్లోనే ఆయనను గట్టు ఎక్కించారు బీజేపీ పెద్దలు. మూడేళ్ల నుంచి తను మొత్తుకుంటుంటే మోడీ పట్టించుకోవడం లేదని, మీరైనా సీట్లపెంపు విషయంలో ఒత్తిడి తీసుకురావాలని, మోడీ, అమిత్‌ షాలు ఎక్కడ కనపడితే అక్కడ సీట్ల పెంపు బిల్లు గురించి అడగాలని బాబుగారు తన ఎంపీలను ఆదేశించారు. మరి తనతో కాలేదు.. ఇక చివరి ప్రయత్నాలు మీతోనే..అని బాబుగారు చెప్పడం కాదా అది? 

జగన్‌కు అపాయింట్‌ మెంట్‌ ఇవ్వడం దగ్గర నుంచినే బీజేపీ చంద్రబాబుకు చెక్‌ చెప్పింది. ఇక వెంకయ్య నిష్క్రమనం టీడీపీకి మరో ఎదురుదెబ్బ.. సీట్లపెంపు వంటి అంశానికి తెలంగాణ బీజేపీ కూడా వ్యతిరేకమే. ఇలాంటి తరుణంలో సీట్లు పెరుగుతాయని అనుకుంటే అంతకు మించిన అమాయకత్వం లేదు. బీజేపీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ బిల్లును కదపదు ఇక. ఒకవేళ బీజేపీ కదిపినా.. రాజ్యసభలో ఆ బిల్లు గట్టెక్కడం కలలోమాట. మరి బాబుగారు ఆడిన రాజకీయ చదరంగంలో.. ఇప్పుడు సీట్లు పెరగకపోతే.. తెలుగుదేశం పుట్టి మునగక తప్పదు. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం అభ్యర్థుల కన్నా.. టీడీపీ రెబల్స్‌ ఎక్కువ మంది నిలబడతారు. ప్రతి నియోజకవర్గం ఒక నంద్యాల అవుతుంది. బాబుగారి రాజకీయ 'మేధస్సు'కు నిదర్శనం అవుతాయి ఆ పరిణామాలు. అప్పుడు బాబుగారి 'సమర్థత' బయటపడుతుంది.

ఎక్కడికక్కడ స్థానిక సమస్యలు.. 

ముద్రగడ - కాపులు- రిజర్వేషన్లు.. దీన్ని తక్కువ అంచనా వేస్తే అది చంద్రబాబు అనుకూల వర్గాల అమాయకత్వం మాత్రమే. రిజర్వేషన్లు ఇవ్వడం, ఇవ్వకపోవడం కాదు.. ముద్రగడపై వ్యక్తిగత కక్ష దగ్గరకు వచ్చింది ప్రభుత్వం. ఇలాంటి చీప్‌గేమ్స్‌, ఆయనను అణదొక్కడానికి తీవ్రంగా ప్రయత్నిస్తూ ఉండటం.. గోదావరి జిల్లాల వరకూ అయినా టీడీపీని దారుణంగా దెబ్బతీసేలా ఉంది. ఇక రాయలసీమ విషయానికి వస్తే.. మొన్న అన్నో ఇన్నో సీట్లు ఇచ్చిన అనంతపురం కూడా రేపు ఇచ్చిన వాటిల్లో సగం చోట్ల టీడీపీని దించేయడం ఖాయంగా ఉంది. ఎంతమంది చేత ఫిరాయింపు చేయించినా.. ఆయా నియోజకవర్గాల్లో టీడీపీ బలం పుంజుకోలేదు. ఫిరాయింపులతో పరువు పోతుంది, కొత్త పితలాటకం మొదలవుతుంది తప్ప.. ఈ వాపు బలంకాదు. నంద్యాలతో సహా అన్ని నియోజకవర్గాల్లోనూ ఇదే పరిస్థితి ఉంది. ఎన్నికలు వస్తే... ఉన్న సీట్లను పోగొట్టుకోవడమే తప్ప.. సీమలో కొత్తగా సాధించలిగేది శూన్యం. గ్రేటర్‌ రాయలసీమ అనదగ్గ నెల్లూరు, ప్రకాశంలలో కూడా ఇదే పరిస్థితి ఉంది.

నెగిటివ్స్‌ లెక్కలేనన్ని.. పాజిటివ్స్‌ ఏవీ?

ఆఖరికి నారా లోకేష్‌ బాబును నిలదీస్తున్నారు.. ఇదీ జనాల్లోకి వెళితే పరిస్థితి. అలవిగాని హామీలను ఇచ్చారు.. అందులో కనీసం ఒక్కవంతు కూడా అమలు చేయలేకపోయారు. అలాంటప్పుడు నిలదీతలు గాక హారతులు ఇస్తారా? పాలన, అనుసరిస్తున్న విధానాలతో వ్యతిరేకతను పెంచుకవోడమే తప్ప చెప్పుకోవడానికైనా కొన్ని సానుకూలతలను సంపాదించుకోలేకపోతున్నారు చంద్రబాబు. ఆయన కొట్టుకునే సొంతడబ్బా, నారాలోకేష్‌ పలకలేక పలికే చిలక పలుకులే మిగిలిన పాజిటివ్‌ పాయింట్లు.. వాటికి కూడా ఇంకా ఓట్లుపడే పరిస్థితి ఉందా?

 

Show comments