భాషలపై జగన్‌, రోజా విమర్శలేంటి?

ఆంధ్రప్రదేశ్‌లో (రాష్ట్రం విడిపోయిన తరువాత) టీడీపీ అధికారంలోకి వచ్చి వైఎస్సార్‌సీపీ ప్రధాన ప్రతిపక్షంగా అవతరించిన తరువాత రాజకీయాలు ఎంతగా దిగజారాలో అంతగా దిగజారిపోయాయి. ఆ రాష్ట్ర ప్రజలకు కూడా ఈ రాజకీయాలు అసహ్యం పుట్టిస్తున్నాయంటే అతిశయోక్తి కాదేమో...! టీడీపీ-వైసీపీ మధ్య అసలు రాజకీయాల కంటే అసహ్యం కలిగించే రాజకీయాలే తొంభై శాతం జరుగుతున్నాయి. ఒకరిది తప్పని, మరొకరిది కరెక్టని చెప్పలేం. రాజకీయంగా పాతాళానికి దిగజారడంలో చంద్రబాబు, జగన్‌ పోటీ పడుతున్నారు. ఈ రెండు పార్టీల నాయకులు విధానాల మీద, కార్యక్రమాల మీద విమర్శలు చేసుకోకుండా వ్యక్తిగత బలహీనతలు, లోపాల మీద విమర్శలు చేసుకుంటూ కాట్లాడుకుంటున్నారు. ఏపీలో ఇదో కొత్త ట్రెండ్‌గా మారింది. వైకాపా అధినేత జగన్‌ విమర్శల్లో కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు. అదే బాటలో 'నోరు ఎక్కువ' నగరి ఎమ్మెల్యే రోజా నడుస్తోంది. ఈ కొత్త ట్రెండ్‌ ఏమిటి?

చంద్రబాబు నాయుడికి ఇంగ్లిషు మాట్లాడటం చేతకాదని, ఆ భాష అర్థం చేసుకోవడం తెలియదని జగన్‌ అసెంబ్లీలో, బయటా రెచ్చిపోయి విమర్శిస్తుంటారు. బాబును అవమానించడానికి ఇంగ్లిషు రాదని ప్రచారం చేయడం ఆయనొక పనిగా పెట్టుకున్నారు. ఇంగ్లిషు రాదంటూ విమర్శలు చేసే నాయకుడు రాజకీయాల్లో జగన్‌ తప్ప మరొకరు కనబడటంలేదు. వాస్తవం చెప్పాలంటే ఇది చాలా చీప్‌ విమర్శ. ప్రధాన ప్రతిపక్ష నేతగా ఈ విమర్శ జగన్‌ స్థాయికి తగింది కాదు.  మొన్నీమధ్య అసెంబ్లీలోనూ ఇదే గొడవ. చంద్రబాబు ప్రతిపక్ష నాయకుడిని ఉద్దేశించి చంద్రబాబు ఈయన  జీవితంలో ఎప్పుడైనా పరీక్షలు రాశాడా? రాస్తే ఎప్పుడు, ఎక్కడో రాశాడో చెప్పాలని వ్యంగ్య బాణాలు విసరడం, దానికి జగన్‌ తాను చంద్రబాబు మాదిరి వచ్చీరాని ఇంగ్లిషు నేర్పే స్కూళ్లలో చదవలేదని, బేగంపేటలోని పబ్లిక్‌ స్కూల్లో చదివానని, టెన్త్‌, ఇంటర్‌, డిగ్రీ ఫస్ట్‌క్లాస్‌లో పాసయ్యానని రెచ్చిపోవడం జుగుప్స కలిగించింది. బాబు ఎంఫిల్‌ చదవకుండానే చదివానని చెప్పుకుంటున్నారని కూడా అన్నారు. 

ఇదంతా ఒక ఎత్తయితే, చంద్రబాబుకు ఇంగ్లిషు మాట్లాడటం రాదని, అర్థం కాదని అనడం మరో ఎత్తు. చంద్రబాబుకు ఇంగ్లిష్‌ రాదని జగన్‌ విమర్శలు చేయడం ఇది మొదటిసారి కాదు. ఆయన సీఎం, ఈయన ప్రతిపక్ష నేత అయినప్పటినుంచి ఈ విమర్శలు కొనసాగుతూనే ఉన్నాయి. జగన్‌ ఈ విమర్శలు పనిగట్టుకొని చేస్తున్నట్లు అర్థమవుతూనే ఉంది. బాబును ప్రజల్లో చులకన చేయడానికి జగన్‌ ఎంచుకున్న మార్గాల్లో ఇంగ్లిషు ఒకటి. జగన్‌ పరీక్షలు రాయలేదనడం, చదువుకోలేదనడం ఎంత తప్పో, చంద్రబాబుకు ఇంగ్లిషు రాదని అదే పనిగా ప్రచారం చేయడమూ అంతే తప్పు. విమర్శలు పరిపాలన, విధానాల మీద ఉండాలేగాని వ్యక్తిగత బలహీనతల మీద, లోపాల మీద ఉండకూడదు. గతంలో జగన్‌ అసెంబ్లీలో మాట్లాడుతూ చంద్రబాబుకు ఇంగ్లిష్‌ రాకపోవడంవల్లనే రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వలేదన్నారు. ఈ విమర్శకు అర్థముందా? చంద్రబాబు ఇంగ్లిష్‌లో చాలా పూర్‌ అని, ఆ భాషను అర్థం చేసుకోలేరని అన్నారు. ఇంగ్లిష్‌కు, హోదాకు సంబంధం ఏమిటి?  చంద్రబాబు ఢిల్లీ వెళ్లినప్పుడు కేంద్ర మంత్రులు, ఉన్నతాధికారులు, మీడియా ప్రతినిధులతో హోదా గురించి ఇంగ్లిష్‌లో సరిగా చెప్పలేకపోతున్నారట....!

బాబుకు ఇంగ్లిష్‌లో కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ సరిగ్గా లేకవపోవడం వల్లనే హోదా విషయాన్ని కేంద్రం పట్టించుకోవడంలేదట...! బాబు హోదాపై ఇంగ్లిషులో చెప్పేదాన్ని ఇతర పార్టీలవారు కూడా అర్థం చేసుకోలేకపోతున్నారట...!  ఇంగ్లిష్‌ నాలెడ్జ్‌, కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ బాగా ఉన్నాయనకుంటున్న జగన్‌ అధికారంలోకి వచ్చాడనుకుందాం. దాంతో అన్ని పనులు సాధించగలరా? వ్యక్తిగత విమర్శలు చేయడంలో ఆరితేరిన నగరి ఎమ్మెల్యే రోజా తాజాగా లోకేష్‌పై విమర్శలు చేసింది. 'తెలుగు సరిగా రాని లోకేష్‌కు మంత్రి పదవి ఎలా ఇచ్చారు?' అని ప్రశ్నించింది. మంత్రి పదవికి, తెలుగు సరిగా రాకపోవడానికి సంబంధం ఉందా? ప్రభుత్వ కార్యకలాపాలన్నీ తెలుగులో జరుగుతున్నాయా? పత్రాలు, డాక్యుమెంట్లు వగైరా తెలుగులో ఉంటాయా? తెలుగు రాని తమిళ దర్శకుడు సెల్వమణిని రోజా పెళ్లి చేసుకుంది కదా...! తెలుగు రానోడిని ఎలా పెళ్లి చేసుకున్నావంటే ఏం చెబుతుంది? గతంలో రోజా చంద్రబాబును 'బొల్లి బాబు' అని విమర్శించింది. బొల్లి ఉన్నోడు పరిపాలనకు పనికిరాడంది. వ్యాధులపై విమర్శలు చేయడం రోజా దిగజారుడుతనానికి నిదర్శనం. తనకేదైనా వ్యాధి వచ్చి విమర్శిస్తే బాధపడదా? విమర్శలు హుందాగా ఉండాలని అధికార, ప్రతిపక్షాలు తెలుసుకోకపోవడం, బూతు రాజకీయాలు చేయడం ఏపీ ప్రజల దురదృష్టం.

Show comments