బాబు పుట్టని అమెరికా

పాపం, అమెరికా ఎంత నష్టపోయింది. చిన్న అవకాశం ...అదే ఏ దేశంలో పుట్టాలనుకుంటున్నావు అని భగవంతుడు బాబును అడిగి వుంటే, ఆయన తను, తన నేస్తం వెంకయ్య కలిసి అమెరికానే ఎంచుకుని వుండేవారు కదా.

చంద్రబాబు సరే, ఆయనవన్నీ కార్పొరేట్ విధానాలు అలాంటి వ్యక్తి అమెరికాను ఎంచుకునేవాడిని అని చెప్పడంలో అర్థం వుంది. కానీ ఆరెస్సెస్ భావజాలంతో ఎదిగిన వెంకయ్య నాయుడు కూడా అమెరికానే ఎంచుకుంటారు అని చంద్రబాబు ఆయన తరపున ప్రకటించేయడం ఏమిటో? అంటే బాబు లేని చోట, బాబు పుట్టని చోట వెంకయ్య కూడా మనలేరా? లేక వెంకయ్య లేకుండా బాబు వుండలేరా?

సరే, వైకాపా జనాలు బాబు భారతదేశాన్ని అవమానించాడని, అమెరికా లో పుట్టేవాడిని అని అన్నాడని విమర్శిస్తే విమర్శించవచ్చు. కానీ ఇక్కడ బాబు అంతరంగాన్ని కూడా తెలుసుకోవాలి కదా? అమెరికా అధ్యక్షుడికి వున్న అపరిమిత అధికారాలు, ప్రపంచాన్ని శాసించగల అవకాశం బాబుగారి మనసు దోచుకున్నాయేమో? అక్కడ పుట్టి వుంటే తాను అమెరికా అధ్యక్షుడినై వుండేవాడినేమో అన్న చిన్న ఆశ లోపల వుండిపోయిందేమో? అందుకే మనసులో మాట అలా బయటకు వచ్చిందేమో?

కానీ చంద్రబాబు అమెరికాలో పుట్టకపోవడం అటు అమెరికాకు అదృష్టమే.  ఎందుకంటే సకల వ్యవస్థలను చంధ్రబాబు మేనేజ్ చేయగలరు. ఇదే టాలెంట్ అక్కడా చూపించితే, అక్కడ ప్రస్తుతం కాస్తయినా నిస్పక్షపాతంగా వున్న వ్యవస్థలన్నీ ఇప్పుడున్న పరిస్థితిలో వుండేవి కావు. అక్కడ కూడా మీడియాను, ఇంకా ఇతరత్రా వ్యవస్థలను బాబు మేనేజ్ చేసి వుంటే, తరువాతి తరాలు అమెరికాలో పుట్టాలని కోరుకోకుండా అయిపోయేది కదా?

Show comments