పెట్ల అలియాస్‌ పూరి: విచారణ ముగిసినట్టేనా.?

పెట్ల జగన్నాథ్‌ అలియాస్‌ పూరిజగన్నాథ్‌.. తెలుగు సినీ పరిశ్రమలో వెరీ వెరీ స్పెషల్‌ అనదగ్గ దర్శకుల్లో ఈయనా ఒకరు. తన సినిమాలతో తరచుగా వివాదాల్లోకెక్కుతుంటారు. నిజానికి తెలుగు తెరకు సరికొత్త హీరోయిజంని పరిచయం చేసిన గుర్తింపూ ఈయన సొంతం. చాలా బోల్డ్‌గా మాట్లాడటం, 'ఎవరైతే నాకేంటి.?' అన్న తరహాలో వ్యవహరించడం పూరి స్పెషాలిటీ.

ఇప్పుడీ పూరిజగన్నాథ్‌, డ్రగ్స్‌ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. నినా 10 గంటలకు ఎక్సయిజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ 'సిట్‌' విచారణకు హాజరైన పూరిజగన్నాథ్‌, రాత్రి 9.30 నిమిషాల సమయంలో, విచారణ నుంచి బయటకు వచ్చారు. ఈ మధ్య మొత్తం 11.30 గంటల పాటు తీవ్ర ఉత్కంఠ నెలకొంది. లోపల 'సిట్‌' అధికారులు, పూరిజగన్నాథ్‌ ముందు ఎలాంటి ప్రశ్నలుంచారు.? వాటికి పూరి సమాధానం చెప్పాడా.? లేదా.? అన్న ఉత్కంఠ ఓ వైపు, సాయంత్రం 5గంటల తర్వాత కూడా పూరి బయటకు రాకపోవడంతో, ఆయన్ని అరెస్ట్‌ చేస్తారేమోనన్న ప్రచారం మరో వైపు.. పరిస్థితిని తీవ్ర గందరగోళంగా మార్చేసింది.

రాత్రి 9.30 నిమిషాల వరకూ ఈ ఉత్కంఠ ఇలాగే కొనసాగింది. 9.30 నిమిషాల తర్వాత పూరి, 'సిట్‌' విచారణ నుంచి బయటపడ్డారు. 'విచారణకు పూర్తిగా సహకరించారు..' అంటూ ఎక్సయిజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్‌ అకున్‌ సబర్వాల్‌ వెల్లడించారు కూడా. మరోపక్క, సిట్‌ అధికారి, పూరి స్వచ్ఛందంగా బ్లడ్‌ శాంపిల్‌ ఇచ్చారని చెప్పడం గమనార్హం.

మొత్తమ్మీద, పూరిజగన్నాథ్‌ని 'సిట్‌' విచారించడం దాదాపుగా పూర్తయినట్లే. అయితే, మరో దఫా విచారించే అవకాశమూ లేకపోలేదు. బ్లడ్‌ శాంపిల్స్‌ని పరీక్షలకు పంపడం, ఆ వివరాలు వచ్చాక వాటిని విశ్లేషించడం.. జరుగుతాయి. ఆ తర్వాత, మరోమారు పూరిజగన్నాథ్‌ని విచారిస్తారా.? లేదా.? ఏమో మరి, ప్రస్తుతానికైతే సస్పెన్సే. 'కొన్ని క్లూస్‌ ఇచ్చారు..' అని 'సిట్‌' అధికారి పేర్కొనడం ఈ కేసులో కొత్త మలుపుగానే చెప్పుకోవాలి. ఆ క్లూస్‌ ఏంటి.? క్లూస్‌ ఆధారంగా మరికొంతమంది సినీ ప్రముఖుల్ని విచారణకు పిలుస్తారా.? అన్న అనుమానాలు తలెత్తడం సహజమే. 

ఇదిలా వుంటే, రేపు సినిమాటోగ్రాఫర్‌ శ్యామ్‌ కె నాయుడు 'సిట్‌' యెదుట విచారణకు హాజరు కానున్నారు. పూరి జగన్నాథ్‌తో దాదాపు 8 సినిమాలకు వర్క్‌ చేశారు శ్యామ్‌. ఛార్మి, ముమైత్‌ఖాన్‌, సుబ్బరాజు, నవదీప్‌, తరుణ్‌ తదితరులు 'సిట్‌' విచారణను ఎదుర్కోనున్న విషయం విదితమే.

Show comments