అప్పుడు కొన్ని పొరపాట్లు చేశా: రాం చరణ్

పాత్రల ఎంపికలో ఆ మధ్య కొన్ని పొరపాట్లు చేశానని అన్నాడు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తేజ. తన తాజా సినిమా విజయంతో ఉత్సాహంతో ఉన్న ఈ హీరో, తన గత సినిమాల గురించి ప్రస్తావించాడు. పాత్రల ఎంపికలో, సినిమాలు చేయడం గురించిన జడ్జిమెంట్ లో కొన్ని పొరపాట్లు చేశారని.. చరణ్ వ్యాఖ్యానించడం గమనార్హం. విజయం అత్యవసరం అయిన దశలో ‘ధ్రువ’ తో హిట్టు కొట్టడంతో ఈ హీరో గత పొరపాట్ల గురించి ప్రస్తావించాడు. అదంతా జరిగిపోయిన వ్యవహారం అని, ఇప్పుడు హ్యాపీ అని అన్నాడు.

మరి ‘రీమేక్’ కదా.. అంటే, ‘ఆకట్టుకోలేని ఒరిజినల్ ను తెరకెక్కించడం కన్నా, ఆకట్టుకునే రీమేక్ చేయడం మేలు..’ అని చరణ్ వ్యాఖ్యానించడం గమనార్హం. ఎటు తిరిగీ ఈ సారి అభిమానులకు మంచి సినిమాను చూపించాలనే, రీమేక్ సబ్జెక్ట్ ను  ఎంచుకున్నట్టుగా చరణ్ వివరించాడు.

తన తదుపరి సినిమా గురించి మాట్లాడుతూ.. ఇప్పుడు దాని గురించి పెద్దగా ఆలోచించడం లేదన్నాడు. ‘ఖైదీ-150’ మీదే దృష్టి పెట్టినట్టు చరణ్ చెప్పాడు. ఒక కొడుకుగా మాత్రమే కాకుండా.. ఆ సినిమాకు నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నందున వచ్చే పొంగల్ తనకు ప్రత్యేకమైనదన్నాడు. తండ్రి సినిమాలో తను మెరవడంపై స్పందిస్తూ.. ఆయన సినిమాల్లో తను కనిపించి ప్రత్యేక ఆకర్షణను తీసుకురావాల్సిన అవసరం లేదని, సరదాగా ఒక పాటలో నర్తించానని చరణ్ చెప్పాడు.

సంక్రాంతికి ‘ఖైదీ-150’ విడుదల అయిన తర్వాత ఫిబ్రవరిలో చరణ్ తదుపరి సినిమా పట్టాలెక్కే అవకాశం ఉంది. ఇక వ్యక్తిగత జీవితం గురించి ప్రస్తావించగా, తండ్రి కావడం గురించి తొందర లేదన్నట్టుగా మాట్లాడాడు ఈ హీరో. త్వరలోనే తండ్రి కాబోతున్నారట కదా? అనగా, ‘నేను ఇంకా చిన్న పిల్లాడినే..’ అని చరణ్ చమత్కరించాడు. తనకూ, తన భార్యకు మరింత సమయం జంటగా గడిపేందుకు కావాలన్నాడు. 

Show comments