జూ.ఎన్టీఆర్‌ని వదిలేశావెందుకు నానీ.?

జూనియర్‌ ఎన్టీఆర్‌ అంటే కొడాలి నానికి ప్రత్యేకమైన అభిమానం. ఆ నాని కారణంగానే ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో జూనియర్‌ ఎన్టీఆర్‌ నానా రకాల ఇబ్బందులూ ఎదుర్కొంటున్నాడు. ఒకప్పుడు ఇదే ఎన్టీఆర్‌ పుణ్యమా అని తెలుగుదేశం పార్టీలో ఓ వెలుగు వెలిగిన నాని, ఆ తర్వాత వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలోకి వెళ్ళారు. వెళుతూ వెళుతూ జూనియర్‌ ఎన్టీఆర్‌ని ఇరకాటంలో పడేశాడాయన. 

కొడాలి నాని, జూనియర్‌ ఎన్టీఆర్‌కి అత్యంత సన్నిహితుడు. జూ.ఎన్టీఆర్‌తో నిర్మాతగా సినిమాలు చేశాడు కూడా. అది గతం. ప్రస్తుతానికి జూనియర్‌ ఎన్టీఆర్‌తో కొడాలి నానికి పెద్దగా సంబంధాల్లేవన్నది ఇటీవలి కాలంలో విన్పిస్తోన్న మాట. అయినాసరే, అడపా దడపా కొడాలి నాని, హరికృష్ణతో కలిసిన సందర్భాలు కన్పిస్తూనే వున్నాయి. 

ఇక, అసలు విషయానికొస్తే.. వైఎస్సార్సీపీ విస్తృత స్థాయి సమావేశంలో కొడాలి నాని, షరామామూలుగానే చంద్రబాబుపై దుమ్మెత్తి పోసేశారు. పనిలో పనిగా చంద్రబాబు బావమరిదినీ, చంద్రబాబు సోదరుడి కొడుకునీ సీన్‌లోకి లాగేశారాయన. 'మీ బావమరిది సినిమాలు.. మీ తమ్ముడి కొడుకు సినిమాలే చూడాలా.?' అంటూ మండిపడ్డారు కొడాలి నాని. చంద్రబాబు బావమరిది అంటే, నందమూరి బాలకృష్ణ. చంద్రబాబు సోదరుడి తనయుడంటే నారా రోహిత్‌. 

ఆంధ్రప్రదేశ్‌లో సాక్షి మీడియా ప్రసారాలపై చంద్రబాబు సర్కార్‌ ఉక్కుపాదం మోపడాన్ని ఖండించేస్తూ, ఆవేశపూరితంగా ప్రసంగించేసిన కొడాలి నాని, పై విధంగా విమర్శించేశారు. 'మేం తలచుకుంటే టీవీ ఛానళ్ళు కాదు.. అసలు కరెంటు వైర్లలో కరెంటు వుండదు.. కరెంటు వైర్లు స్తంభాల మీద వుండవు.. నేలమీదే అవి వుంటాయి..' అంటూ హెచ్చరించేశారు. ఆద్యంతం కొడాలి నాని ప్రసంగంలో 'సన్నాసులు' అన్న మాటే ఎక్కువగా విన్పించింది. 

ఇక, బాలకృష్ణనీ.. నారా రోహిత్‌నీ పరోక్షంగా ప్రస్తావించిన కొడాలి నాని, తనకు అత్యంత సన్నిహితుడైన జూనియర్‌ ఎన్టీఆర్‌ పేరుని ఎందుకు ప్రస్తావించలేకపోయారో మరి.? అంటే, ఇంకా జూనియర్‌ ఎన్టీఆర్‌తో నానికి సన్నిహిత సంబంధాలు కొనసాగుతున్నట్లేనా.? ఏమో మరి, ఆయనకే తెలియాలి.

Show comments