ప్రతిపక్షంగా వైసీపీ ప్రశ్నార్ధకమైన వేళ..!

ఉత్తరాంధ్రపై మిత్రుల కన్ను

మొత్తం సీట్లు కొల్లగొట్టే వ్యూహం

చెలరేగిపోయేందుకు గట్టి కసరత్తు

ఎన్నడూ లేనిది ఉత్తరాంధ్రపై అధికార పార్టీలకు ప్రేమ ఎక్కువైపోయింది, ముందస్తు ఎన్నికల మంత్రం జపిస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు కడు సురక్షితమైన స్ధావరంగా ఉత్తరాంధ్ర కనిపిస్తోందిపుడు. ఒకప్పుడు విపక్ష రణక్షేత్రంగా పేరుగాంచిన ఈ ప్రాంతం వర్తమాన కాలంలో సరైన నాయకత్వం కొరవడడంతో చైతన్యరహితంగా మారడం అధికార పార్టీలకు అనుకోని వరమవుతోంది. వెనుకబాటు తనాన్ని నిలువెల్లా ఆవహించుకున్న ఇక్కడి జిల్లాలు పోరా టాలతోనే పుణ్యకాలాన్ని గడిపేశాయి. ఫలితం దక్కక పోయినా అధికార పార్టీలకు ఖంగు తినిపించడంతో తమదైన రాజకీయాన్ని ప్రదర్శించే ఉత్తరాంధ్ర గడచిన కొన్నేళ్లుగా స్తబ్దుగా ఉంటోంది. ముందుకు నడిపించే సారధి లేకపోవడంతో విభజనపాపాలు, శాపాలతో మరింతగా కునారిల్లుతోంది. ఈ నేపధ్యంలో ప్రత్యేక ప్యాకేజీ, రైల్వేజోన్‌ వంటి వాటి విషయంలో అన్యాయం జరుగుతున్నా ఎలుగెత్తి చాటలేని దౌర్బల్యంతో ఈ మూడు జిల్లాలు ఉండడం అధికార పార్టీలకు రాజకీయ స్వారీచేసే అవకాశాన్ని కల్పిస్తోంది. విభజనానంతరం కాంగ్రెస్‌ ఇక్కడ కనుమరుగైపోగా, తెలుగుదేశాన్ని ఎదుర్కొవడంలో వైసీపీ పూర్తిగా వైఫల్యం చెందింది. పర్యవశానంగా ఇక్కడ సైకిల్‌ జోరుకు అడ్డు లేకుండా పోయింది, ఉత్తరాంధ్రలో ఉన్న ముప్పయి నాలుగు అసెంబ్లీ సీట్లతో పాటు, అయిదు పార్లమెంట్‌ స్థానాలను కూడా గుత్తమొత్తంగా కైవశం చేసుకో వాలన్న గట్టి సంకల్పంతో టీడీపీ ఇపుడు తనదైన శైలిలో రాజకీయానికి పదును పెడుతోంది. 

అదే సమయంలో అధికారంలో తమకూ తగినంత వాటా దక్కకపోతుందా అని మిత్రపక్షమైన బీజేపీ కూడా ఇదే ప్రాంతాన్ని కార్యక్షేత్రంగా చేసుకుని దూకుడుగా సాగుతోంది. రానున్న కొద్ది నెలలలో ప్రధాని నరేంద్ర మోడీ, అమిత్‌ షా ద్వయం ఉత్తరాంధ్ర నేలపై కాలు మోపనున్నారు. వారి కంటే ముందే పాగా వేసేందుకు తెలుగుదేశాధీశుడు చంద్రబాబు పావులు చురుగ్గా కదుపుతున్నారు. ఈ ప్రాంతంపై మమకారం కంటే అధికారమే ఈ రెండు పార్టీలనూ పురి కొల్పుతున్నాయన్నది నమ్మి తీరాల్సిన విషయం. విభజన ఏపీలో చూసుకుంటే మూడేళ్లక్రితం నాటి బలం నానాటికీ తీసికట్టుగా రెండు అధికార పార్టీలకూ కళ్ల ముందు కనిపిస్తున్న వాస్తవం. 2014 ఎన్నికలలో గోదావరి జిల్లాలు ఏకమొత్తంగా టీడీపీ వైపుగా నడిచాయి. దక్షిణ కోస్తా జిల్లాలైతే పసుపు పార్టీకి ఎదురులేదనిపించాయి. రాయలసీమలోని కొన్ని జిల్లాలలోనూ టీడీపీకి మంచి ఫలితాలే దక్కాయి. ఇపుడు అక్కడ ఓడలు బల్లవుతున్నాయి. సామాజిక కారణాలవల్ల గోదావరి జిల్లాలలో మునుపటి ఆదరణ అటు టీడీపీకి, ఇటు బీజేపీకి దక్కే అవకాశం లేదన్నది నిష్టుర సత్యం. ఇక, కోస్తాలోనూ బలాబలాలు తారుమారవుతున్నాయి. 

రాయలసీమలో గట్టిపోటీ ఉంటుందన్నది ఇటీవల ఎమ్మెల్సీ ఎన్నికలు తేల్చిన తీర్పు. ఈ పరిస్థితులను విశ్లేషించుకున్నపుడు అన్ని విధాలగా అచ్చి వచ్చిన ప్రాంతంగా ఉత్తరాంధ్ర కనిపిస్తోంది. ఈ మూడు జిల్లాలలో అధికారపార్టీల బలం చెక్కుచెదరకపోవడానికి విపక్షం బలహీనతే ప్రధానంగా చెప్పుకోవాలి. దాంతో, ఇక్కడ కనుక పాగా వేస్తే రేపటి అధికారానికి బలమైన పునాదిని ఏర్పాటుచేసుకోవచ్చునన్నది మిత్రుల ఆలోచనగా కనిపిస్తోంది. తాజాగా జరిగిన ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో టీడీపీ, బీజేపీ ఉమ్మడి అభ్యర్ధి ఘన విజయం సాధించిన క్రమంలో రెండు పార్టీలకూ ఆశలు రెట్టింపు అయ్యాయి. ఉన్నచోటనే వెతుక్కుంటే, బలమున్న ప్రాంతాన్ని జాగ్రత్త చేసుకుంటే మిగిలిన ప్రాంతాలలోని మైనస్‌ పాయింట్లను అధిగమించడం సులువు అన్న సూత్రాన్ని ఆధారం చేసుకుని బీజేపీ, టీడీపీ ఇటు వైపుగా చూస్తున్నాయి. జూలై నెల 15, 16 తేదీలలో బీజేపీ కార్యవర్గ సమావేశాలు నిర్వహణ ఇందులో భాగమే. ప్రధాని మోడీ ఉత్తరాంధ్ర ముఖద్వారం విశాఖపట్నంలో మూడు రోజుల పాటు విడిది చేయనున్నారు. 

సార్వత్రిక ఎన్నికల తరువాత మోడీ విశాఖకు రావడం ఇదే ప్రధమమైతే, ఇన్నిరోజులు నగరంలో ఉండడం రాజకీయంగా ప్రాధాన్యత కలిగిన అంశమే. ఆయనతో పాటు, బీజేపీ జాతీయ అధ్యక్షుడు, వ్యూహకర్త అమిత్‌షా సైతం ఉత్తరాంధ్ర రాజకీయ మంత్రాంగాన్ని నడిపించేందుకు ఇక్కడ బస చేయనున్నారు. దేశంలోని పదమూడు రాష్ట్రాలకు చెందిన బీజేపీ ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, సీనియర్‌ నేతలు పెద్దఎత్తున మందీ మార్బలంతో ఇక్కడకు చేరుకో వడం వెనుక గట్టివ్యూహమే దాగుంది. ఉత్తరాంధ్రకు కడు సమీపంలో ఉన్న ఒడిషాలో పాగా వేస్తున్న కమలం పార్టీ అటు నుంచి ఇటు వైపుగా నరుక్కు రావాలనుకుంటోంది. ప్రాంతాల పరంగా చూసినా సామాజిక అంశాల పరంగా చూసినా ఎంతో సారూప్యత కలిగిన ఈ మూడు జిల్లాలనూ ఒడిషా మ్యాజిక్‌ను అనుసంధానించి గణనీయంగా లబ్ది పొందాలన్నది కమలనాధుల ప్రణాళికగా ఉంది. దానికి పూర్వ రంగంగా ఏప్రిల్‌ చివరి వారంలో రాష్ట్ర కార్యవర్గ సమావేశాలను కూడా నిర్వహిస్తున్నారు. 

ఇప్పటికే విశాఖ పార్లమెంట్‌ సీటుతో పాటు, ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే స్ధానాన్ని సొంతం చేసుకున్న బీజేపీకి ఏజెన్సీలోనూ పట్టు ఉంది.అక్కడ గిరిజనులను ఆకట్టుకునేందుకు ఆర్‌ఎస్‌ఎస్‌ శిక్షణా శిబిరాలను నిర్వహిస్తోంది కూడా దాంతో, గ్రామీణ ప్రాంతాలలోనూ బలంగా చొచ్చుకుపోవాలనుకుంటోంది. అలాగే, జూలైలో జరిగే మూడు రోజుల జాతీయ కార్యవర్గ సమావేశాలలో భాగంగా అమిత్‌షా బూత్‌ స్ధాయి వరకూ కమిటీలతో నేరుగా చర్చించడమే కాదు, ప్రజలతో మమేకం అయ్యేలా కార్యక్రమాలను కూడా రూపకల్పన చేసుకున్నారు. మూడు జిల్లాల ప్రజానీకాన్ని ఉద్దేశించి ప్రధాని హోదాలో నరేంద్రమోడీ ప్రత్యేక సందేశం ఇవ్వనున్నారు. ఈ విధంగా అటు పార్టీపరంగా, ఇటు ప్రభుత్వపరంగా దూసుకుపోవాలన్నది బీజేపీ ఎత్తుగడగా కనిపిస్తోంది. మరో వైపు టీడీపీ కూడా బీజేపీ వ్యూహాన్ని పసిగట్టి అడ్డు కట్ట వేసేందుకు రంగంసిద్ధం చేసుకుంది. దాదాపు రెండు దశాబ్దాల తరువాత టీడీపీ మహానాడును విశాఖపట్నం వేదికగా నిర్వహిస్తోంది. మే 27నుంచి 29వరకూ మూడురోజుల పాటు భారీ ఎత్తున నిర్వహిస్తోంది. అసలే ఈ ప్రాంతంలో టీడీపీకి పట్టు ఉంది.బీసీలు, కాపులు, ఇతర సామాజిక వర్గాలను ఎప్పటి నుంచో తన గొడుగు కిందకు చేర్చుకున్న పసుపు పార్టీ దానిని మరింతగా బలోపేతం చేసుకునే దిశగా అడుగులు వేస్తోంది. 

గత సార్వత్రిక ఎన్నికలలో మొత్తం 34 అసెంబ్లీ సీట్లకు 25, అయిదు ఎంపీ స్థానాలకూ నాలుగింటిని సాధించిన టీడీపీ ఏడాది క్రితం ఫిరాయింపుల పర్వానికి తెరలేపి మరీ వైసీపీ ఉనికికే దెబ్బ కొట్టింది. ప్రస్తుతం అరడజను ఎమ్మెల్యేలు మాత్రమే ఫ్యాన్‌ పార్టీకి ఉన్నా వారి నియోజకవర్గాలలో నామమాత్రమయ్యారు. అరకు ఎంపీ కొత్తపల్లి గీత ఏనాడో వైసీపీ పార్టీ గిరిని దాటేశారు. మూడు జిల్లాలలో బలమైన నాయకత్వానికి తోడు, గట్టి వారిని మంత్రులుగా చేసిన టీడీపీ 2019లో ఎన్నికలు జరిగినా, అంతకు ముందే జరిగినా నూటికి నూరుశాతం ఎంపీ, ఎమ్మెల్యేలను గెలుచుకోవాలని పదునైన వ్యూహరచన చేసింది. ఆ దిశగానే అడుగులు వేస్తూ ముందుకు సాగుతోంది. 

-పివిఎస్‌ఎస్‌ ప్రసాద్‌

Show comments