కన్నుకు కన్ను...పన్నుకు పన్ను అనేది ఆటవిక సిద్ధాంతమైనా అదే పని చేయాలంటారు కొందరు. ముల్లును ముల్లుతోనే తీయాలంటారు మరికొందరు. 'కత్తులు విసిరేవానిని ఆ కత్తితోనే గెలవాలని' అని పాడతాడు ఓ సినిమాలో హీరో. ఒకడు మనపై కత్తి దూస్తే మనమూ కత్తి ఎత్తాల్సిందేనంటారు ఇంకొందరు. ఇప్పటి రాజకీయాల్లో ఇదే ధర్మంగా, యుద్ధ నీతిగా చెలామణి అవుతోంది. రాజకీయ కక్షలు హత్యలకూ దారితీస్తుంటాయి. ఇలాంటి ఘటనలకు ఒక్క రాజకీయ కారణాలే కాకుండా ఇతర కారణాలూ ఉండొచ్చు. ఇప్పటి రాజకీయ నాయకులు పగ, ప్రతీకారం తీర్చుకోవడానికి ఎంచుకున్న మార్గం ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకోవడం.
ఒకరి లూప్‌హోల్స్ మరొకరు తెలుసుకొని, ఒకరి తప్పులు మరొకరు వెతికిపట్టుకొని కోర్టుల్లో కేసులు వేస్తున్నారు. పోలీసు స్టేషన్లలో ఫిర్యాదులు చేస్తున్నారు. ఇదంతా పాలిష్డ్ రాజకీయం. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, కేసీఆర్‌ల రాజకీయాలు చూస్తూనే ఉన్నాం. నోటుకు ఓటు కేసు మళ్లీ తెరమీదకు వచ్చింది. ఏడాది క్రితంనాటి ఈ కేసు పని ఇక అయిపోయిందనే అనుకున్నారు. కాని వైసీపీ ఎమ్మెల్యే పిటిషన్‌తో మళ్లీ ప్రాణం పోసుకుంది. ఇప్పుడిది చంద్రబాబు మెడకు గుదిబండలా చుట్టుకోబోతున్నది. ఈ పరిస్థితి ఆయన ఊహించివుండకపోవచ్చు.
ఏడాది క్రితంనాటి ఈ కేసులో ఇప్పుడు ఏపీలోని మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే రామకృష్ణా రెడ్డి ఏసీబీ కోర్టులో పిటిషన్ వేయడం, వెంటనే కోర్టు బాబుపైన విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని ఆదేశించడం అంతా ప్లాన్డ్‌గానే జరిగుండొచ్చు. వైసీపీ, టీఆర్‌ఎస్ కలిసే ఇది ప్లాన్ చేసి ఉండొచ్చేమో....! అప్పట్లో నోటుకు ఓటు కేసుకు ప్రతిగా చంద్రబాబు కేసీఆర్ మీద ఫోన్ ట్యాపింగ్ కేసు పెట్టారు. బాబుపై పెట్టిన కేసుకు ఆధారాలు పక్కగా ఉండటంతో, బాబు కూడా ఫోన్ ట్యాపింగ్ కేసులో ఏవో ఆధారాలు సంపాదించి కేసు పెట్టారు.
టీడీపీ తెలంగాణ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి కొన్నాళ్లు జైలుకు వెళ్లిరావడం తప్ప ఈ కేసుల్లో ఆ తరువాత పురోగతి లేకుండాపోయింది. బాబు, కేసీఆర్ లాలూచీ పడ్డారనే ప్రచారమూ జరిగింది. కేసు సజీవంగానే ఉందని, త్వరలోనే బాబుకు చిక్కులొస్తాయని కొంతకాలం క్రితం కేసీఆర్ అన్నారు. అది ఇదే అయ్యుండొచ్చు. బాబుపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని ఏసీబీ కోర్టు ఆదేశించడంతో రెండు రాష్ట్రాల టీడీపీ నాయకులు ఇరకాటంలో పడ్డారు. కేసు ఎలాంటి మలుపులు తిరుగుతుందో తెలియదు. తాను నిప్పులాంటివాడినని, జీవితంలో ఇప్పటివరకు ఏ తప్పూ చేయలేదని బాబు ఈమధ్య తెగ ప్రచారం చేసుకున్నారు. ఆ ప్రచారం వికటించి ఇప్పుడిలా అయింది.
బాబుకు ఈ పరిస్థితి తెప్పించిన వైసీపీ మీద కుతకుత ఉడికిపోతున్న టీడీపి ఏదో ఒకటి చేయకపోతే లాభం లేదనుకుంది. ఆనాడు కేసీఆర్ మీద ప్రతీకారంగా ఫోన్ ట్యాపింగ్ కేసు పెట్టినట్లుగా మంగళగిరి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డిపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. ఏమని? గత ఎన్నికల సమయంలో రామకృష్ణా రెడ్డి అఫిడవిట్లో తనకున్న ఆస్తులను పూర్తిగా చూపించలేదని, ఉద్దేశపూర్వకంగా కొన్ని ఆస్తుల వివరాలను బహిర్గతం చేయలేదని, దీనిపై విచారణ జరిపించాలని ఓ న్యాయవాదితో ఫిర్యాదు చేయించింది. అర్జంటుగా ఫ్యాక్స్ ద్వారా ఈ సమాచారాన్ని ఎన్నికల సంఘానికి పంపింది.
ఎన్నికలు జరిగి రెండున్నరేళ్లయింది. రామకృష్ణారెడ్డిపై ఫిర్యాదు చేయాలనుకుంటే ఇంతకాలం ఆగాలా? ఆయన ఇప్పటివరకు విమర్శలకే పరిమితమయ్యాడు. కాబట్టి ఆయన జోలికి పోలేదు. ఇప్పుడు చేతల్లో చూపించాడు కాబట్టి టీడీపీ నాయకులూ రంగంలోకి దిగి కేసులో ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు. దీనిపై ఎన్నికల సంఘం ఎలా స్పందిస్తుందో చూడాలి. చంద్రబాబు మీద కేసు విచారణ 'సాక్షి' టీవీకి షడ్రసోపేతమైన విందు భోజనంలా ఉంది. ప్రతి గంటకూ ప్రసారమయ్యే న్యూస్ బులిటన్‌లో అధిక భాగం దీనికే కేటాయించారు.
చంద్రబాబు ఇక జైలుకు వెళ్లడమే మిగిలివుందని వైసీపీ నాయకులు అంటున్నారు. రిజైన్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. నైతిక విలువలకు ప్రాధాన్యమివ్వని బాబు రాజీనామా చేస్తారని ఎలా అనుకుంటారు? ఈరోజు జరిగిన మీడియా సమావేశంలోనూ బాబు చాలా అసహనంగా ఉన్నారు. పాత్రికుయుల మీద చిరాకు పడ్డారు. 'కేసులో ఏముందో మీరు స్టడీ చేసి చెప్పండి' అని అన్నారు. ఏమీ లేని దానికి తానెందుకు మాట్లాడాలన్నారు. అంతా తన అడ్వొకేట్లు చూసుకుంటారని చెప్పారు.
ఇక బాబు వాయిస్‌ను ఎక్కడ పరీక్షించారు? రామకృష్ణా రెడ్డి ముంబయిలోని హెలిక్ డిజిటల్ ఫోరెన్సిక్ ల్యాబ్‌లో పరీక్ష చేయించినట్లు 'నమస్తే తెలంగాణ' రాయగా, తాను లండన్‌లో పరీక్ష చేయించానని ఆయన చెప్పినట్లు 'ఆంధ్రజ్యోతి' రాసింది. ఈ పరీక్ష ఎలా ఉన్నా అసలు పరీక్షలో బాబు నెగ్గుతారా?