రాష్ట్రమంతా ముక్తకంఠంతో కోరింది. బాబు తప్ప?

"బీజేపీ పథకం ప్రకారమే ఆంధ్రప్రదేశ్‌కు అన్యాయం చేసింది. వైసీపీతో లాలూచీ పడి ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంది. రాష్ట్రమంతా ముక్తకంఠంతో ప్రత్యేకహోదా కోరినా, ఇవ్వలేదు. ఇప్పుడు నన్ను ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతోనే బాబ్లీపై నోటీసులు పంపింది."

సిగ్గులేని చంద్రబాబు అర్థరాత్రి పెట్టిన ట్వీట్ ఇది. ఈ ట్వీట్ లో ఒక్కో వాక్యంలో ఒక్కో పచ్చి అబద్ధం కళ్లకు కనిపిస్తోంది. తను పెడుతున్నవి అబద్ధాలనే విషయం కూడా బాబుకు తెలుసు. కానీ చీకట్లో అలా పెట్టేశారంతే. అయితే ఇన్ని పచ్చి అబద్ధాల మధ్య కూడా తనకు తెలియకుండానే ఓ నిజాన్ని ప్రస్తావించారు చంద్రబాబు. 

ప్రత్యేక హోదాను రాష్ట్రమంతా ముక్తకంఠంతో కోరిందని బాబు ట్వీట్ చేశారు. ఇది మాత్రం నిజం. స్పెషల్ స్టేటస్ ను రాష్ట్ర ప్రజలంతా ముక్తకంఠంతో కోరుకున్నారు. కానీ ఇదే రాష్ట్రంలో ఉన్న చంద్రబాబు మాత్రం కోరుకోలేదు. అందుకే ప్రత్యేకహోదా రాలేదు. రాష్ట్ర ప్రజలతో పాటు రాష్ట్రాన్ని నడిపిస్తున్న చంద్రబాబు కూడా గట్టిగా కోరుకున్నట్టయితే, తనే ముందుండి ఉద్యమాన్ని నడిపించినట్టయితే ప్రత్యేకహోదా వచ్చి ఈపాటికి మూడేళ్లు అయి ఉండేది. 

కానీ చంద్రబాబుకు హోదా కంటే ప్యాకేజీ నచ్చింది. హోదా వస్తే ప్రజలకు లాభం. అదే ప్యాకేజీ వస్తే తనకు లాభం. తన పార్టీ నేతలకు లాభం. తన తనయుడికి లాభం. అందుకే ప్యాకేజీకి జై కొడుతూనే అసెంబ్లీలో అప్పట్లో ప్రత్యేక తీర్మానం కూడా చేశారు. వెంకయ్యనాయుడు లాంటి ప్రముఖులకు సన్మానాలు చేశారు. హోదా అంటే జైలుకే అంటూ స్టేట్ మెంట్స్ కూడా ఇచ్చారు. ప్రత్యేకహోదా అందుకున్న రాష్ట్రాలు ఏం బాగుపడ్డాయంటూ పెదవి విరిచారు. 

ఇన్ని కబుర్లు చెప్పిన చంద్రబాబు, ఇప్పుడు ప్రత్యేకహోదా రాలేదంటూ బీద అరుపులు అరుస్తున్నారు. తనే రాష్ట్రానికి హోదా రాకుండా అడ్డుకొని, ఇప్పుడు మళ్లీ తనే హోదా రాలేదంటూ విమర్శలకు పాల్పడుతున్నారు. ఇంతకంటే సిగ్గుమాలిన వ్యవహారం ఇంకోటి ఉండదు. 

అప్పట్లో ప్రత్యేక హోదాను అడ్డుకున్నది కాక, ఇప్పుడు అదే అంశాన్ని తనకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం కూడా చేస్తున్నారు బాబు. ప్రత్యేకహోదా కోసం గట్టిగా పోరాడుతున్న తనను, ఇబ్బంది పెట్టే ఉద్దేశంతో బాబ్లీ ఘటనకు సంబంధించి నోటీసులు ఇచ్చారట. ఇలా బాబ్లీ నోటీసులకు, ప్రత్యేక హోదాకు లింకు పెట్టి రాజకీయ లబ్దిపొందాలని చూస్తున్నారు చంద్రబాబు. 

Show comments