సినీ కాపీలో ఇదో ఈజీ టెక్నిక్‌ గురూ..!

సినిమాను మక్కికి మక్కి తీసుకుని దించేయడం ఒకటో నంబర్‌ కాపీ. తెలుగునాట కామెడీ సినిమాలు తీసే కొంతమంది డైరెక్టర్లతో సహా, మహామహులే ఈ టెక్నిక్‌ను ఫాలో అవుతూ ఉంటారు. ఇక తీసుకున్న సబ్జెక్టుకు మసాలాలు దట్టించి కొత్త సినిమాగా భ్రమింపజేయడం.. అంటే, మర్యాదరామన్న వంటి సినిమాకు రాజమౌళి పాటించిన టెక్నిక్‌ అన్నమాట. మూకీ సినిమాను టాకీగా చూపడం, బ్లాక్‌ అండ్‌ వైట్‌ను కలర్‌ చేయడం అనమాట. ఇక త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ వంటి దర్శకరచయితతో ఇంకోరకం టెక్నిక్‌. అనేక సినిమాల నుంచి సంగ్రహించిన సీన్లను ఒకే సినిమాలో కూర్చడం అన్నమాట. అదో పద్ధతి.మరి ఇలాంటివెన్నో విజ్ఞత గల సినీ ప్రేక్షకులు గమనిస్తూనే ఉన్నారు. ఏ డైరెక్టర్‌ టాలెంట్‌ ఎంతో అందరికీ తెలిసిందే. ఈ విషయాలను కొత్తగా చెప్పేది ఏమీలేదు. మరి ఆ ఎత్తుగడలకు అనేక ఉదాహరణలు యూట్యూబ్‌ సాక్షిగా గమనిస్తూనే ఉన్నారంతా. ఇది సమాచార యుగం కదా.. నిమిషాల మీద కాపీ క్యాట్స్‌ పట్టుబడిపోతూ ఉన్నారు.

మరి ఇలాంటి పరంపరంలోనే కొంచెం వైవిధ్యకరమైన కాపీని చేస్తున్న వాళ్లూ ఉన్నారు. ఈ విషయంలో దర్శకురాలు సుధాకొంగరను ఆమె సినిమా 'గురు'ను ప్రస్తావించుకోవచ్చు. ముందుగా, హిందీ- తమిళ భాషల్లో రూపొందిన ఈ సినిమానే రీమేక్‌ల రాజా వెంకటేష్‌తో రీమేక్‌ చేశారు. ప్రశంసలు పొందింది ఈ సినిమా. మరి ప్రశంసలు పొందే ఇలాంటి వైవిధ్య భరిత సినిమాలు, 'బాక్సింగ్‌ ' అనే మన స్థానికతకు సంబంధం లేని సినిమా అంటే, ఇది మనది కాకపోయుండొచ్చు.. అనేది సహజంగా కలిగే అనుమానం. నిజమే.. 'గురు' సినిమా కాన్సెప్ట్‌ మూలం ఇక్కడిది కాదు. అమెరికాది, హాలీవుడ్‌ ది! అయితే 'గురు' మక్కికి మక్కి కాపీ కాదు, మూలం ఒకచోట నుంచి తీసుకుని సమూల మార్పులతో రూపొందిన సినిమా. దీని మూలంను ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదు. ఆ సినిమా కూడా సినీ ప్రేక్షకులకు సుపరిచితమైనదే.

''మిలియన్‌ డాలర్‌ బేబీ'' రెండువేల ఐదో సంవత్సరంలో వచ్చిన ఈ సినిమా ఆ యేటిమేటి సినిమాల్లో ఒకటిగా, అంతర్జాతీయ సినీ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన సినిమాగా శాశ్వతంగా నిలిచిపోయింది. మిలియన్‌ డాలర్‌ బేబీ సినిమా గురించి చెప్పాలంటే మాటలుచాలవు. బాక్సింగ్‌ను క్రేజీగా చూసే అమెరికన్‌ సమాజంలోని ఒక ఫిమేల్‌ బాక్సర్‌ కథ. అమెరికాలో కూడా పేదరికం ఉంటుంది, ఆ పేదరికం వారి కుటుంబ బాంధవ్యాలను జీవితాలను ప్రభావితం చేస్తుంది.. అని ప్రపంచానికి చాటి చెప్పే సినిమాల్లో ఒకటి ఈ మిలియన్‌ డాలర్‌ బేబీ. క్లింట్‌ ఈస్ట్‌వుడ్‌ స్వయంగా దర్శకత్వం వహించి, నిర్మాతగా వ్యవహరించి, ముఖ్య పాత్రలో నటించిన ఈ సినిమా తప్పక చూడాల్సిన హాలీవుడ్‌ క్లాసిక్స్‌లో ఒకటి అని చెప్పడానికి సందేహించనక్కర్లేదు.

కథాంశం పరంగా చూస్తే.. ఒక ఔత్సాహికురాలైన అమ్మాయి(హిల్లరీ స్వాంక్‌). మాజీ బాక్సర్‌ కమ్‌ ప్రజెంట్‌ బాక్సింగ్‌ కోచ్‌ (క్లింట్‌ ఈస్ట్‌ వుడ్‌). అతడి సహాయకుడు కమ్‌ మేనేజర్‌ (మోర్గాన్‌ ఫ్రీమన్‌)ల మధ్య సాగుతుంది. ఆర్థిక పరిస్థితి ఏ మాత్రం బాగోలేని.. నిరుపేద కుటుంబానికి చెందిన హిల్లరీకి బాక్సింగ్‌ అంటే బోలెడంత ప్రేమ. చూడటం కాదు.. నేర్చుకుని బాక్సర్‌గా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవాలనేంత ప్రేమ. గురువులేని విద్య పరిమళించదని గుర్తించి.. ప్రముఖ బాక్సింగ్‌ గురువు (ఈస్ట్‌వుడ్‌) దగ్గరకు చేరుతుంది. అయితే ఆమెకు బాక్సింగ్‌ నేర్పేందుకు నిరాకరిస్తాడాయన. అదేమంటే.. తను అమ్మాయిలకు బాక్సింగ్‌ను నేర్పనంటాడు. అబ్బాయిలకు మాత్రమే.. అని నిర్ధయగా, నిష్కర్షగా బయటకు పంపించేస్తాడు.. అలా తిరస్కరణకు గురయిన ఆమె ఆ గురువు శిష్యరికం పొందేంత వరకూ సాగే స్క్రీన్‌ప్లే.. ఈ సినిమాను ఆస్కార్‌కు నామినేట్‌ అయ్యేలా చేసింది.

ఆమెను అతడు ప్రొఫెషనల్‌ బాక్సర్‌గా తీర్చిదిద్దడం.. వివిధ బాక్సింగ్‌ లీగ్‌లకు తీసుకెళ్లడం.. ఆమె పందెం కోడిలా పోటీపడి గెలవడం మొదలుపెట్టాకా, వేలడాలర్ల ప్రైజ్‌ మనీని పొందడం మొదలుపెట్టాకా.. ఆమెతో, ఆమె కోచ్‌తో కుటుంబం వ్యవహరించే తీరు.. దూకుడైన ఆమె మ్యాచ్‌ను చాలా త్వరత్వరగా ముగించేస్తూ ఉంటే, బాక్సింగ్‌ ప్రేక్షకులే విస్తుపోవడం.. ప్రేక్షకుల కోసమైనా మ్యాచ్‌ను కాసేపు పొడిగించాలని నిర్వాహకులు ఆమెను కోరడం.. ఇలా.. ఆరంభం మొదలు, ప్రీ క్లైమాక్స్‌ వరకూ ఎక్కడా బిగి తగ్గకుండా సాగే స్క్రీన్‌ప్లే.. దీన్నంతా ఈస్ట్‌వుడ్‌ తెరకెక్కించిన వైనంతో.. ఇది ఆస్కార్‌ బెస్ట్‌ పిక్చర్‌గా అవార్డును అందుకునేలా చేసింది.

ఈ సినిమాను ఆసాంతం నలుగురే గుర్తుండిపోతారు. ఒకరు హిల్లరీ స్వాంక్‌, రెండు ఈస్ట్‌వుడ్‌, మూడు ఫ్రీమన్‌, నాలుగు ఈ సినిమా! ఈ నాలుగు విభాగాల్లోనూ ఆస్కార్స్‌ దక్కడం... ఆ అవార్డుల హేతుబద్దతకు ఒక నిర్వచనం. స్వాంక్‌కు ఉత్తమ నటిగా, ఈస్ట్‌వుడ్‌కు ఉత్తమ డైరెక్టర్‌గా, ఫ్రీమన్‌కు ఉత్తమ సహాయనటుడిగా, సినిమాకు ఉత్తమ చిత్రంగా ఆస్కార్స్‌ దక్కాయి. మరి 'గురు' సినిమా స్క్రిప్ట్‌ను 'మిలియన్‌ డాలర్‌ బేబీ' సినిమాను బేస్‌ చేసుకునే రూపొందించారేమో.. అనే సందేహం ఈ సినిమా హిందీ, తమిళ వెర్షన్ల ఫస్ట్‌లుక్‌ రోజే అర్థం అయిపోయింది. మేల్‌ బాక్సింగ్‌ కోచ్‌, ఫిమేల్‌ బాక్సర్‌.. ఒక సహాయకుడు.. వీరి చుట్టూ సాగే డ్రామా! ఇందులోనే కొంత వ్యత్యాసం.

ఈస్ట్‌వుడ్‌ వయసు మీద పడిన బాక్సింగ్‌ కోచ్‌గా కనిపిస్తే.. మాధవన్‌, వెంకటేష్‌ల వయసు అంత కన్నా కొంచెం తక్కువ. ఇక మిలియన్‌ డాలర్‌ బేబీలో గురువుకు, శిష్యురాలికి మధ్యన ఎక్కడా రొమాంటిక్‌ యాంగిల్‌ లేదు. ప్రేమాభిమానాలు, సరదాలు మాత్రమే.. ఇక ఫ్రీమన్‌ చేసిన మేనేజర్‌ కమ్‌ సహాయకుడి పాత్రకు ప్రత్యామ్నాయమే నాజర్‌ చేసిన రోల్‌! మూడు పాత్రలు.. వాటి నేపథ్యంను హాలీవుడ్‌ నుంచి తీసుకుని వాటి చుట్టూ ఉన్న పరిస్థితులను మాత్రం కొత్తగా కల్పించి.. కథాగమనంలో కొన్ని మార్పులు చేయడం.. అది కూడా పరిమిత స్థాయిలో! అమెరికా సంస్కరుతిలో బాక్సింగ్‌ భాగం. ప్రొఫెషనల్‌ బాక్సింగ్‌ అక్కడ క్రేజీ. అందుకు తగ్గట్టుగా మిలియన్‌ డాలర్‌ బేబీ సాగుతుంది. మనదగ్గర ఫిమేల్‌ ఫ్రొఫెషనల్‌ బాక్సింగ్‌ ఉందా? అందుకే.. అకాడమీలు, కోచ్‌లు, ఈ రాజకీయం చుట్టూ మళ్లింది కథ. హాలీవుడ్‌ వెర్షన్లో ఏ పాత్రా ప్రేక్షకుడి నుంచి జాలిని కోరదు. సాగిపోతుంటాయంతే. క్లైమాక్స్‌ కూడా అంతే, పాత్రలేవీ కన్నీళ్లు పెట్టుకోవు.. ప్రేక్షకుడి గుండెను మాత్రం పిండేస్తాయి! బాక్సర్‌గా ఆకాశం అంతఎత్తు ఎదిగిన మెయిన్‌ రోల్‌లోని అమ్మాయి.. కథ ఒకే మ్యాచ్‌తో విషాదాంతం అవుతుంది. కాపీకొట్టినా అలాంటి క్లైమాక్స్‌ తీసేంత గట్స్‌ ఇండియన్‌ ఫిల్మ్‌ మేకర్స్‌లో కొంత మందికే ఉంటాయి. అందుకేనేమో 'గురు' స్క్రిప్ట్‌ క్లైమాక్స్‌ మారిపోయింది. ఏడ్వడాలు, కన్నీళ్లు పెట్టుకోవడాలు, భావోద్వేగాలు.. ఇలా వెళ్లిపోయింది. ఇండియన్‌ స్టైల్‌ అన్నమాట. ''మిలియన్‌ డాలర్‌ బేబీ'' క్లైమాక్స్‌ మాత్రం ఇవేవీ లేకపోయినా వెంటాడుతుందంతే!

సాధారణంగా కమల్‌ హాసన్‌ ఈ తరహా టెక్నిక్‌ను ఫాలో అవుతుంటాడు. ఏదో ఒక హాలీవుడ్‌ సినిమా నుంచి మరేవో పాత్రలను తీసుకుని.. వాటిని మొత్తం మార్చేసి.. ఒరిజినల్‌ కన్నా గొప్ప అనుభూతిని ఇచ్చే మరో సినిమాను తయారు చేస్తాడు కమల్‌. పంచతంత్రం, తెనాలి, బ్రహ్మచారి.. వంటి సినిమాలన్నీ అలాంటివే. వాటి ఒరిజినల్‌ వెర్షన్లు.. కమల్‌ సినిమాల ముందు చిన్నబోతాయి. అయితే 'మిలియన్‌ డాలర్‌ బేబీ' మాడిఫైడ్‌ వెర్షన్‌కు మాత్రం అంతలేదు! కాకపోతే.. కాపీ కొట్టాలంటే, పాత్రలను వాటి నేపథ్యాలను తీసుకుని.. అదే జోనర్‌లో మరో సినిమాను తయారు చేసి ప్రశంసలు అందుకోవచ్చు.. అని ఔత్సాహిక దర్శకులకు చెబుతోంది ఈ సినిమా!

Show comments