దళితులపై ప్రేమతోనేనట.. కేసు.. చింతమనేనా మజాకా!

చింతమనేని ప్రభాకర్ కు దళితులపై ప్రేమ పొంగుకు వచ్చింది. అందుకే ‘పిచ్చి ముండాకొడుకుల్లారా.. మీకెందుకు రాజకీయాలు..’ అన్నారు. అయితే ఈ దుష్ట ప్రపంచానికి చింతమనేని ప్రేమ అర్థం కాలేదు. అందుకే..ఆ వీడియో వైరల్ అయ్యింది, చింతమనేని  తీరును అందరూ ఖండించారు.  ఇంకేముంది.. చింతమనేని ప్రేమను అర్థం చేసుకోలేని దుష్ట ప్రపంచానికి తగిన బుద్ధి చెప్పాలి. అందుకే ముందుగా.. ఆ వీడియోను వెబ్ లో పోస్టు చేసిన వ్యక్తి పై కేసు నమోదు చేశారు!

ఒక కులాన్ని దారుణంగా తిడితే.. పిచ్చి ముండాకొడుకుల్లారా.. అని దూషిస్తే.. చింతమనేని పై ఎలాంటి కేసులూ లేవు. ఎందుకంటే.. ఆయన ప్రేమతో అలా అన్నారట. దళితులపై అభిమానంతో.. వారి మీద ఆప్యాయతతో అలా దూషించారట. కాబట్టి ఆయనపై కేసులు లేవు. ఆయన ప్రేమ పంచిన వైనాన్ని వీడియోగా పోస్టు చేసిన వ్యక్తిది మాత్రం పాపం. అందుకే సదరు  దళితుడి మీద కేసులు పెట్టి. అరెస్టు చేశారు!

తెలుగుదేశం పార్టీ అనుకుంటే ఏమైనా చేయగలదు. ఇది చాలా సార్లు రుజువు అయ్యింది కూడా. పుష్కర తొక్కిసలాటలో ఇరవై తొమ్మిది మంచి చనిపోతే.. ఆ వ్యవహారాన్ని ఎలా డైల్యూట్ చేశారో అందరికీ తెలిసిందే. ఇక చింతమనేని ఇది వరకూ అనేక మంది పై చిందులు తొక్కిన సందర్భాల్లో ఆయనను ఎలా కాపాడుకున్నారో తెలిసిందే. అలాంటిది దళితులను దూషించిన వ్యవహారం నుంచి ఆయనను కాపాడుకోవడం ఒక లెక్క లోనిదే.

స్వయంగా చంద్రబాబే అన్నారట.. అది మార్ఫింగ్ వీడియో అని. అంత స్పష్టం గా చింతమనేని బూతులు చెవికి వినిపిస్తుంటే.. దాన్ని కూడా మార్ఫింగ్ అని తేల్చేశారు! బ్రీఫ్ డ్ మీ ఆడియో తరహాలోదే ఇది కూడా అనేశారట!