కేసీఆర్- చంద్రబాబు మధ్య అద్గదీ అసలుతేడా?

ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కేబినెట్ పునర్ వ్యవస్థీకరణకు సంబంధించిన చర్చ నడుస్తోంది. తెలంగాణలో 18 మంది మంత్రులతో కేబినెట్ నిండుగా ఉంది. కొందరిని తొలగిస్తే తప్ప కొత్తవారికి అవకాశం దక్కదు. ఏపీలో ఖాళీలున్నాయి. కానీ అక్కడ కూడా తొలగింపులు- కొత్తవారి చేర్పులు ప్రక్రియ నడుస్తుందనే ప్రచారం జరుగుతోంది. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు తమ పుత్ర రత్నాల మీద ఈ కీలక సమయంలో మాగ్జిమమ్ ఫోకస్ పెడుతున్నారు. ఆ విషయంలోనే కేసీఆర్- చంద్రబాబుల వ్యవహార సరళి మధ్య ఉండే వ్యత్యాసం స్పష్టంగా కనిపిస్తోంది. ఒకరిలో ముందు జాగ్రత్త, మరొకరిలో దూకుడుతనం కనిపిస్తోంది.

తెలంగాణ విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ తన తనయుడు కేటీఆర్ రాజకీయ కెరీర్ విషయంలో భిన్నమైన వ్యూహాన్ని అనుసరిస్తున్నారు. ప్రభుత్వం ఏర్పడినప్పుడే కేటీఆర్ కు మంత్రి పదవి దక్కింది. ఇప్పటిదాకా చాలా దూకుడుగా, తెలంగాణ రాష్ట్ర కీర్తిని ప్రపంచవ్యాప్తం చేస్తున్న యువ నాయకుడిగా కేటీఆర్ చాలా పేరు తెచ్చుకున్నారు. ఐటీ రంగం విస్తరణ, పారిశ్రామికాభివృద్ధి విషయంలో మంత్రిగా అన్నీ తానే అయి నడిపిస్తున్నారు. ఇన్ని చేస్తున్నప్పటికీ.. ప్రస్తుతం మంత్రి వర్గ పునర్ వ్యవస్థీకరణలో కేటీఆర్ ను కేబినెట్ నుంచి తొలగించి తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ బాధ్యతలను పూర్తిస్థాయిలో అప్పగించే అవకాశం ఉన్నదనే ప్రచారం రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. కేటీఆర్ సమర్థతను నిరూపించుకున్నారని, పార్టీని మరింతగా బలోపేతం చేయడానికి ఆయన సేవల్ని పూర్తిస్థాయిలో వినియోగించుకోవడానికి కేసీఆర్ వ్యూహరచన చేస్తున్నారని అనుకుంటున్నారు. మంత్రి పదవి భారాన్ని కేటీఆర్ కు తగ్గించి పార్టీ నాయకుడిగానే పరిమితం చేయాలనుకోవడం ఇక్కడ వ్యూహం అయ్యే అవకాశం ఉంది.

అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పూర్తి విరుద్ధమైన రాజకీయ వ్యూహాన్ని అక్కడ సీఎం చంద్రబాబునాయుడు అనుసరిస్తున్నారు. అక్కడ కూడా కొడుకు లోకేష్ రాజకీయ కెరీర్ ను స్థిర పరచడానికి చంద్రబాబునాయుడు నానా పాట్లు పడుతున్నారు. లోకేష్ ను మించిన రాజకీయచతురులు లేరన్నట్లుగా ఆయనే తన కొడుకు తెలివితేటల గురించి బహుధా ప్రచారం చేస్తూ గడుపుతున్నారు. 2014 ఎన్నికలను కేవలం లోకేష్ తెలివితేటలతోనే గెలిచాం అంటూ చంద్రబాబు ఎన్ని సార్లు టముకు వేశారో లెక్కలేదు. ఆ రీతిగా పార్టీ ప్రధాన కార్యదర్శి పదవిలోకి కొడుకును తీసుకువచ్చారు. పార్టీలో సకల నిర్ణయాలకు కొడుకును కేంద్రబిందువుగా చేశారు. తీరా ఎమ్మెల్సీగా శాసనమండలిలో ప్రవేశింపజేసి.. కేబినెట్ లోకి కూడా తీసుకోబోతున్నారు. పార్టీ బాధ్యతలను పూర్తి స్థాయిలో పర్యవేక్షించడమే చాలా పెద్ద పని. అయితే అదనంగా లోకేష్ మీద మంత్రి పదవిని కూడా రుద్దబోతున్నారు. కీలకమైన శాఖలే లోకేష్ చేతికి వస్తాయనే మాట పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. ఆ రకంగా లోకేష్ జోడుగుర్రాల సవారీ చేసేలా చంద్రబాబునాయుడు తన ప్లాన్ సిద్ధం చేస్తున్నారు.

ఈ ఇద్దరు ముఖ్యమంత్రులు వ్యూహాల్లో ముఖ్యమైన తేడా ఇదేనని... ఇక్కడేమో కేసీఆర్ కొడుకు మంత్రి పదవికి కోత పెట్టి అయినా సరే.. పార్టీ మీద పట్టుగల నాయకుడిగా ఎదిగేలా తీర్చదిద్దాలని అనుకుంటూ ఉంటే... అక్కడేమో చంద్రబాబునాయుడు ఇటు పార్టీ- అటు ప్రభుత్వం సకలం కొడుకు చెప్పుచేతల్లోనే ఉండాలని అత్యాశకుపోతున్నట్లుగా వారి వ్యూహాలు ఉన్నాయని పలువురు విశ్లేషిస్తున్నారు. 

Show comments