బాబూ...ముందు 'నేషనల్‌' పై చెప్పండి...!

తలాతోకా లేకుండా మాట్లాడటంలో, ప్రచారం కోసం ఉన్నవీ లేనివి చెప్పడంలో రాజకీయ నాయకులు సిద్ధహస్తులు. దశాబ్దాలుగా ముఖ్యమంత్రులుగా పనిచేసినవారు కూడా ఇలాంటి అజ్ఞానుల జాబితాలో చేరడం విచారించదగ్గ విషయం. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఈ జాబితాలో చేరి విచారం ప్లస్‌ ఆశ్చర్యం కలిగించారు. వెనకాముందు చూసుకోకుండా మాట్లాడితే  నవ్వులపాలు కావల్సివస్తుంది. 'మింగ మెతుకు లేదు...మీసాలకు సంపెంగ నూనె'  సామెతలా ఉంది బాబు వ్యవహారశైలి. అమరావతిలో ఒలింపిక్స్‌ నిర్వహించడమే తన ధ్యేయమని బాబు సగర్వంగా ప్రకటించుకున్నారు. అది కూడా రెండేళ్లలోనే. అంటే 2018లోనన్నమాట. 

ఈ ఏడాది జూలై 2న ఈ ప్రకటన చేసిన ముఖ్యమంత్రి మూడు రోజుల క్రితం కూడా ఈ మాట మరింత గట్టిగా చెప్పారు. బాడ్మింటన్‌ క్రీడాకారిణి పీవీ సింధు ఒలింపిక్స్‌లో రజత పతకం గెలిచిన ఆనందంలో బాబు ఏం మాట్లాడారో ఆయనకే తెలియలేదు.  ఒలింపిక్స్‌ నాలుగేళ్లకోసారి జరుగుతాయి. అందరికీ తెలిసిన ఈ విషయం బాబుకు తెలియదా? తెలిసినా అతిగా మాట్లాడుతూ అదుపు తప్పారా? ఏఏ దేశాల్లో ఎప్పుడెప్పుడు ఒలింపిక్స్‌ నిర్వహించాలో కొన్నేళ్ల ముందే డిసైడైపోతుంది. ఇది విదేశాలకు వెళ్లి పెట్టుబడులు తెచ్చుకోవడమంత సులభం కాదు. 

ఇప్పుడు రియో తరువాత నాలుగేళ్లకు అంటే 2020లో ఒలింపిక్స్‌ జపాన్‌ రాజధాని టోక్యోలో జరుగుతాయి. ఆ తరువాత 2024 కోసం బిడ్డింగ్‌ పూర్తయిందని తెలుస్తోంది. ఇవేవీ తెలియని చంద్రబాబు ప్రపంచంలోనే అద్భుత రాజధాని నిర్మిస్తామని చెప్పినంత తేలిగ్గా ఒలింపిక్స్‌ నిర్వహిస్తామని ఊదరగొట్టారు. తాను ఏదైనా చేయగలనని చెప్పుకోవడం బాబుకు అలవాటు కదా...! లక్షల కోట్లు ఖర్చయ్యే ఒలింపిక్స్‌ నిర్వహణ గురించి బాబుకున్న అవగాహన ఏమిటి? అసలు ఒలింపిక్స్‌వంటి మెగా ఈవెంట్‌ను దేశం నిర్వహిస్తుందా? రాష్ట్రం నిర్వహిస్తుందా? ఆంధ్రప్రదేశ్‌ స్వతంత్ర దేశమని బాబు అనుకుంటున్నారా? నిరంతరం గొప్పలు చెప్పుకుంటే ఇలాగే 'తప్పు'లో కాలేస్తారు. ఈ

 ఒలింపిక్స్‌ గోల అలా పక్కన పెట్టి చంద్రబాబు నేషనల్‌ గేమ్స్‌ (జాతీయ క్రీడలు) గురించి జనాలకు వివరణ ఇస్తే బాగుంటుంది. అవశేష ఆంధ్రప్రదేశ్‌కు ముఖ్యమంత్రి కాగానే 2019 జాతీయ క్రీడలను విజయవాడలో నిర్వహిస్తామని ప్రకటించారు. రాష్ట్రాన్ని అన్యాయంగా విభజించారని, కట్టుబట్టలతో రోడ్డుపై పడేశారని, డబ్బులు లేక పుట్టెడు కష్టాల్లో ఉన్నామని చెప్పుకునే బాబు మీసాలకు సంపెంగ నూనె సామెత మాదిరిగానే నేషనల్‌ గేమ్స్‌ ప్రకటన చేశారు. రాష్ట్రస్థాయి క్రీడలనే మన పాలకులు అవకతవకలుగా నిర్వహిస్తారు. ఇక నేషనల్‌ గేమ్స్‌ అంటే ఆషామాషీ వ్యవహారం కాదు కదా...! Readmore!

పోనీ రాష్ట్రం ఆర్థికంగా బలంగా ఉండి, పూర్తిస్థాయిలో వసతులు సౌకర్యాలుంటే అది వేరే విషయం. కాని అవేమీ పట్టించుకోని బాబు జాతీయ క్రీడలు నిర్వహిస్తామని మెహర్బానీగా ప్రకటించారు. కాని ఇప్పటివరకు దీనిపై ఎప్పుడైనా మాట్లాడారా? దీనికి సంబంధించి ఇప్పటివరకు ఒక్క అడుగూ ముందుకు పడలేదు. దీన్ని గురించి మాట్లాడిల్సిన బాబు ఒలింపిక్స్‌ గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా లేదా? బాబు అధికారంలోకి వచ్చినప్పటినుంచి క్రీడారంగానికి అందించిన ప్రోత్సాహం ఏమిటి? ఆ రంగానికి వసతి సౌకర్యాలు కల్పించారా? అవసరమైన నిధులు సమకూర్చారా? క్రీడా పరికరాలు, శిక్షకులు మొదలైనవాటిపై దృష్టి పెట్టారా? స్టేడియంల పరిస్థితి ఆలోచించారా? ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు జవాబులు చెప్పాల్సివుంది. 

రాష్ట్రంలో ఏ క్రీడలకూ సంబంధించి కూడా అంతర్జాతీయస్థాయి ప్రమాణాల వసతి సౌకర్యాలు లేవు. ఒక్క విశాఖపట్నంలో మాత్రమే అంతర్జాతీయ క్రికెట్‌ పోటీలు నిర్వహించగల స్టేడియం ఉంది. విజయవాడలో క్రికెట్‌ స్టేడియం దశాబ్దాలుగా కాగితాల మీద ఉంది. రాష్ట్రంలో 30 స్టేడియంల  నిర్మాణం డబ్బు కొరత కారణంగా అసంపూర్తిగా ఉండిపోయాయి. బడ్జెటులో క్రీడలకు భారీగా నిధులు కేటాయించడంలేదు. పాఠశాలల్లో మైదానాలు కరువు. ఇక కార్పొరేట్‌ పాఠశాలల సంగతి చెప్పక్కర్లేదు. పీఈటీల పోస్టులు భర్తీ చేయడంలేదు. ఇన్ని లొసుగులు పెట్టుకొని ఒలింపిక్స్‌ నిర్వహిస్తాననడం బాబు అజ్ఞానమా? అమాయకత్వమా? అహంకారమా? అసలు ముందు నేషనల్‌ గేమ్స్‌ గురించి మాట్లాడితే అదే పదివేలు. 

Show comments

Related Stories :