చంద్రబాబు ఫ్లాప్‌ షో: ఏమి సేతుర లింగా.!

జూన్‌ 2, 2014న 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం ఏర్పడింది. అదే రోజున తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యింది గనుక, 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్‌కి కూడా అదే ఆవిర్భావ దినోత్సవం. కానీ, దాన్ని ఒక 'చీకటి రోజు'గా అభివర్ణిస్తున్నారు టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు. 'విభజించండి మొర్రో..' అంటూ కేంద్రానికి అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ నుంచి మొట్టమొదట లేఖ రాసింది ఇదే చంద్రబాబు.. అన్న వాస్తవాన్ని ఎలా విస్మరించగలం.? 

'అబ్బే, విభజనకు నేను వ్యతిరేకం కాదు.. కానీ విభజన తీరుకే వ్యతిరేకం..' అని చంద్రబాబు ఇప్పుడు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారుగానీ, 'విభజనకు జై' కొట్టినప్పుడు మాత్రం చంద్రబాబు 'సమన్యాయం' అన్న మాట మాట్లాడింది లేదు. విభజన తప్పదని తెలుసుకున్నాక మాత్రం 'సమన్యాయం' పేరుతో నానా యాగీ చేయడం అందరం చూశాం కదా.! 

తెలంగాణ సెంటిమెంట్‌ని కేసీఆర్‌ ఎలాగైతే పొలిటికల్‌గా క్యాష్‌ చేసుకుంటున్నారో, అదే తరహాలో విభజన సెంటిమెంట్‌ని రగిల్చి పొలిటికల్‌గా మైలేజీ పొందాలని చంద్రబాబు తాపత్రయ పడ్తున్నారు. అందుకే, జూన్‌ 2 నుంచి నవ నిర్మాణ దీక్షల పేరుతో హడావిడి చేస్తున్నారు. గడచిన మూడేళ్ళుగా ఇదే పరిస్థితి. ముచ్చటగా మూడోస్సారి ఇప్పుడు నవ నిర్మాణ దీక్షలు జరుగుతున్నాయి. కానీ, ఏం లాభం.? ఈసారి నవ నిర్మాణ దీక్షలు అట్టర్‌ ఫ్లాప్‌ అయ్యాయి. 

జూన్‌ 8, 2014 - ఇదే రోజున చంద్రబాబు ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణ స్వీకారం చేశారు. అదీ అమరావతిలో. అప్పటికీ ఇప్పటికీ అమరావతిలో వచ్చిన ఒకే ఒకే మార్పు 'తాత్కాలిక పరిపాలనా భవనాల సముదాయం'. ఇందులో సెక్రెటేరియట్‌తోపాటు, ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ - శాసనమండలి నిర్మితయ్యాయి. కానీ, ఇక్కడా చంద్రబాబుకి ఝలక్‌ తగిలింది.. అదీ నవ నిర్మాణ దీక్షల సీజన్‌ సందర్బంగా. 

ఒక్క వానకే తాత్కాలిక నిర్మాణాలు నీరుగారిపోయాయన్న విమర్శలు వెల్లువెత్తుతున్న వేళ, ఆ తలనొప్పిని తప్పించుకోడానికి చంద్రబాబు పడ్తున్న పాట్లు చూస్తోంటే నవ్వురాకుండా వుండదు. ఎంతో ఆర్భాటంగా నవ నిర్మాణ దీక్షలు చేసేస్తోంటే, వాటికి జనం నుంచి స్పందన లేని ప్రస్తుత పరిస్థితుల్లో కొత్తగా ఈ తాత్కాలిక పరిపాలనా భవనాలు నీరుగారిపోతున్నాయన్న విమర్శలతో మొత్తంగా చంద్రబాబు సర్కార్‌ పరువుపోయిందిప్పుడు. 

పోనీ, పోలవరం ప్రాజెక్టు పేరుతో హడావిడి చేద్దామనుకున్నా, కేంద్రం నుంచి రావాల్సిన స్థాయిలో నిధులు రావడంలేదాయె. 2018 నాటికి ప్రాజెక్ట్‌ పూర్తి చేస్తామని గతంలో చెప్పిన చంద్రబాబు సర్కార్‌, 'గ్రావిటీతో నీళ్ళు తెస్తాం..' అంటూ కొత్త పల్లవి అందుకుంది. అదన్నా, 2018 నాటికి పూర్తవుతుందా.? అన్నది ప్రస్తుతానికి మిలియన్‌ డాలర్ల ప్రశ్నే. సందట్లో సడేమియా మళ్ళీ ప్రత్యేక హోదా ఉద్యమం ఊపందుకోవడంతో దాన్ని తుంగలో తొక్కిన చంద్రబాబుకి మైండ్‌ బ్లాంక్‌ అయిపోయింది. 

మొత్తమ్మీద, మూడేళ్ళ పాలన తర్వాత చంద్రబాబు మైండ్‌లో 'ఏమి సేతుర లింగా..' అన్న ఆవేదన తప్ప, ఏదో సాధించేశాం, సాధించేస్తామన్న నమ్మకం మాత్రం కన్పించడంలేదాయె.!

Show comments