తెలుగుదేశం అధినేత, ఏపీ ముఖ్యమంత్రి పరిశీలించాల్సిన యూనిసెఫ్ నివేదిక ఇది. ఐక్యరాజ్య సమితి అనుబంధ విభాగం అయిన యూనిసెఫ్ అంతర్జాతీయంగా శిశుమరణాల రేటు, బాలల సంరక్షణ కోసం తక్షణం చేపట్టాల్సిన చర్యల గురించి వివరిస్తూ..అందులో ప్రధానమైన హెచ్చరికను భారత్ కోసమే జారీ చేసింది యూనిసెఫ్.
ఈ సంస్థ అంచనాల ప్రకారం చూస్తే.. ఇప్పుడే కాదు.. రాబోయే పదిహేను సంవత్సరాల్లో కూడా అంతర్జాతీయ స్థాయిలో శిశుమరణాల రేటు విషయంలో భారత్ అత్యంత దుర్భర స్థానంలోనే ఉంటుంది. ఈ విషయంలో పాకిస్తాన్ , కాంగో, అంగోలా వంటి దుర్భర దారిద్ర్యపు దేశాల సరసన మనదేశం ఉంది.. ఉండబోతోంది!
ఒకవైపు రాబోయే రోజుల్లో అమెరికా, బ్రిటన్, రష్యా.. వంటి అగ్రరాజ్య ల సరసన ఉండబోతున్నామని మన పాలకులు చెబుతున్నా… జీవన ప్రమాణాల విషయంలో వచ్చే పదిహేనేళ్లలో కూడా మన స్థాయి కాంగో, అంగోలాల కన్నా మెరుగ్గా ఉండదని యూనిసెఫ్ తేల్చి చెప్పింది.
2016-30 ల మధ్య ప్రపంచ వ్యాప్తంగా దాదాపు ఏడు కోట్ల శిశు మరణాలు సంభవించే అవకాశం ఉందని… అందులో దాదాపు కోటి ముప్పై లక్షల శిశుమరణాలు ఇండియాలో సంభవిస్తాయని యూనిసెఫ్ వివరించింది! మరి కోటీ ముప్పై లక్షల శిశుమరణాలు అంటే.. అది సామాన్యమైన విషయం కాదు. చాలా దేశాల జనాభా కన్నా ఇది చాలా ఎక్కువ!
ఈ పరిణామంపై ఆందోళణ వ్యక్తం చేస్తూ.. ఈ పరిస్థితిని అరికట్టడానికి చర్యలు తీసుకోవాలని కూడా యూనిసెఫ్ భారత పాలకులకు హెచ్చరించింది! వాస్తవ పరిస్థితి ఇలా ఉంటే.. మన పాలకులు మాత్రం ఏదేదో మాట్లాడతారు. మరీ ముఖ్యంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయితే.. రాబోయే రోజుల్లో దేశంలో జన సమతుల్యత దెబ్బతింటుందని.. అందుకే వీలైనంత ఎక్కుమందిని కనండని ఉద్భోదిస్తున్నాడు! ఒకసారి కాదు.. బాబుగారికి ఇదో పని!
పడకింటి విషయాల గురించి మాట్లాడి.. ముసిముసి నవ్వులు నవ్వే ముసలోళ్లలా మాట్లాడుతున్నాడు ఏపీ ముఖ్యమంత్రి. ఎక్కువమంది పిల్లలను కనండి, స్వార్థం పెంచుకోవద్దు.. కండోమ్ వాడొద్దు.. ఇలా మాట్లాడటమా విజన్?
గ్రామీణ ప్రాంతాల్లో పిల్లలకు పౌష్టికాహారం లేదు, వాళ్లకు సరైన వైద్య సేవలు లేవు..శిశుమరణాల రేటు విషయంలో మన పరిస్థితి అంగోలా కన్నా దారుణంగా ఉందని స్పష్టం అవుతోంది. మరి పడకింటి ముచ్చట్లు మాట్లాడే ముందు.. ఈ పరిస్థితిని చంద్రబాబు వంటి విజనరీ అర్థం చేసుకుంటే మంచిదేమో!