వైఎస్ కు సాధ్యం కానిది

ప్రస్తుత తెలంగాణ, ఆంధ్ర ముఖ్యమంత్రులు ఇద్దరు నడుస్తున్న బాట ఒక విధంగా కొన్నాళ్ల క్రితం అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి నడిచిన బాటనే. అందులో సందేహం లేదు. అయితే వైఎస్ ఎల్ కెజీ, యుకెజీ లెవెల్లో వెళ్తే, చంద్రులిద్దరు టెన్త్ లెవెల్లో వెళ్తున్నారు. ఎవరినీ ఖాతరు చేయకపోవడం, తను అనుకున్నది తానుచేసుకుంటూ వెళ్లడం, ఎదుటి పార్టీలను నిర్వీర్యం చేయాలని చూడడం ఇవన్నీ వైఎస్ ఫార్ములాలే. వీటితో పాటు, అభివృద్ధి చేసి చూపించడం కూడా ఆయన ఫార్ములాయే. ముఖ్యంగా నీటిపారుదల ప్రాజెక్టులను కీలకంగా తీసుకోవడం, సంక్షేమ పథకాలు అమలు చేయడం వంటివి ఆయన స్టయిల్ నే.కేసిఆర్, బాబు గడచిన మూడేళ్లలో దాదాపుగా ఇదే బాటన వైఎస్ కన్నా రెండు ఆకులు ఎక్కువ చదివినట్లు పయనిస్తున్నారు. 

అయినా కూడా వైఎస్ కు ఒక్కటి మాత్రం చేతకాలేదు. సాధ్యం కాలేదు. కొడుకును ఎమ్మెల్యే ను చేసి, మంత్రిని చేసి, వారసుడిగా పార్టీ మీద రుద్దగలగడం. అది మాత్రం కుదరలేదు. కాంగ్రెస్ జాతీయ పార్టీ కాబట్టి, హై కమాండ్ వుంది కాబట్టి సాధ్యం కాలేదేమో అని అనుకోవడానికి లేదు. ఎందుకంటే అప్పట్లో సోనియా వద్ద వైఎస్ ఆడిందే ఆట. అందులో సందేహం లేదు. అందువల్లే జగన్ ను ఎంపీగా చేయగలిగారు.

అంటే జగన్ ను ఎమ్మెల్యేగా చేయాలనుకుని వుంటే చేసి వుండేవారు. కానీ మరెందుకో చేయలేదు. అదే ఎమ్మెల్యేను చేసి, మంత్రిని చేసి వుంటే, బహుశా రాష్ట్ర రాజకీయ ముఖచిత్రం వేరుగా వుండి వుండేదేమో? ఎందుకంటే జగన్ మంత్రిగా వుండి వుంటే, వైఎస్ మరణానంతరం కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేసులో ముందుకు వెళ్లడం అనేది జగన్ కు సులువై వుండేదేమో? కానీ ఒక్కటే అనుమానం అప్పట్లో వైఎస్ ఇలాగే చేసి వుంటే, ప్రతిపక్ష తెలుగుదేశం కానీ, వైఎస్ కుటుంబం అంటే ఒంటి కాలిపై లేచే మన మెజారిటీ తెలుగు మీడియా కానీ ఎలా స్పందించి వుండేవో? వారసత్వ రాజకీయాలపై ఎక్కడలేని నీతి, నియమాలు గుర్తు తెచ్చుకుని, మొత్తం రాష్ట్రమే అధోగతి పాలయిపోతోందన్నంత రేంజ్ లో తెగ బాధపడిపోయి వుండేవి. సీనియర్లు ఇంతమంది వుండగా, జగన్ లాంటి జూనియర్ ను ఎమ్మెల్యేను, మంత్రిని చేసేసారని నానా యాగీ చేసి వుండేవి. 

బహుశా కాంగ్రెస్ లో ఎవరన్నా అప్పట్లో, ఆ సందర్భంగా అసంతృప్తి గళం వినిపిస్తే, దాన్ని లోపల పేజీల్లో తొక్కేయకుండా, ఫ్రంట్ పేజీలోకి తెచ్చి, నానా బీభత్సం చేసేవేమో? ఈ హడావుడి ఏ లెవెల్ లో వుండి వుండేదన్నది చెప్పలేం కానీ, ఒకటి మాత్రం కచ్చితంగా చెప్పగలరం, కేటిఆర్, లోకేష్ లు మంత్రులుగా మారినంత స్మూత్ గా మాత్రం జరిగి వుండేది కాదు మన మీడియా పరంగా. అది మాత్రం గ్యారంటీ వెనకేసుకు వస్తున్నారు.

ఇప్పుడు మన మీడియా ఎన్ని సన్నాయి నొక్కులు నొక్కుతోంది. సీనియర్లకు, సమర్థులకు పెద్ద పీట అంటోంది. లోకేష్ సీనియర్ ఎలా అవుతారో? సమర్థత ఎప్పుడే ఎలా తెలిసిందో? ఇటు గ్రామాల్లో, అటు పట్టణాల్లో అందరికీ పరిచయం అయ్యేలా లోకేష్ కు ఆ రెండు శాఖలు కేటాయించారట. మరి ఇలాంటి కోరిక మిగిలిన మంత్రులకు వుండదా? మార్కెటింగ్, గిడ్డంగులు, భాషాభివధ్ది, క్రీడలు, స్త్రీ శిశు సంక్షేమం ఇలాంటివి అన్నీ ఎంత గొప్ప శాఖలో మంత్రులకు తెలియంది కాదు. 

కానీ ఇవన్నీ పక్కన పెట్టి లోకేష్ వల్ల పార్టీలో సీనియర్లకు ఎలాంటి అన్యాయం జరగలేదని, అసలు అసంతృప్తే లేదనే విధంగా మీడియా సర్దుబాటు చేసుకుంటూ వస్తోంది. పార్టీ పెట్టినప్పటి నుంచి వుంటూ, దాదాపు కంటిన్యూగా ఎమ్మెల్యేగా వుంటూ వస్తున్న గౌతు శివాజీ లాంటి వాళ్లను పక్కన పెట్టి మరీ లోకేష్ కు మంత్రి పదవి ఇస్తే ఈ మీడియాకు ఆనలేదు. అదే కనుక అప్పట్లో ఇదే పని వైఎస్ చేసి వుంటే, ఈ మీడియా ఎలా ఒళ్లు విరుచుకుని వుండేదో ఊహించుకోవాల్సిందే. దానికి ఏ మాత్రం జంకకుండా వైఎస్ అప్పట్లో డెలిబిరేట్ గా ముందుకు వెళ్లి వుంటే..ఎలా వుండి వుండేదో మరి. కానీ వైఎస్ ఆ పని మాత్రం ఎందుకో చేయలేకపోయారు.

Show comments