ఎక్కడ పుట్టిందో, ఎలా పుట్టిందో ఓ అయిడియా అయితే పుట్టింది. ఇప్పుడు ఆ అయిడియాతో సోషల్ నెట్ వర్క్ ఊగిపోతోంది. విశాఖ తీరంలో నిరసన అంటూ ట్వీట్ లు మోత మోగిపోతున్నాయి.
సోషల్ నెట్ వర్క్ లో ట్వీట్ లు చేయడం అంటే ఫేస్ బుక్ లో లైక్ చేయడం అంత ఈజీ. స్మార్ట్ ఫోన్ పట్టుకుని, బాత్ రూమ్ కమోడ్ మీద కూర్చుని కూడా పని కానించేయవచ్చు. కానీ నాయకుడు అనేవాడు చేయాల్సింది ట్వీట్లు కాదు..కార్యాచరణ.
నిజంగా పవన్ కళ్యాణ్ కు కార్యాచరణపై అంతటి ఆసక్తి వుండి వుంటే, ఇప్పటికే విశాఖ చేరిపోవాలి. బీచ్ లో కూర్చుని, ఎవరు అడ్డుకుంటారో..చూస్తా అని సవాల్ విసరాలి. ఇదే జరిగితే ఉత్తరాంధ్ర ఊగిపోతుంది. మూడు జిల్లాల యువత కట్టలు తెంచుకుని ఆర్ కే బీచ్ కు చేరుకుంటుంది.
కానీ పవన్ ఆ పని చేస్తారా? అన్నది అనుమానంగా వుంది. నిన్నటి నుంచి ట్వీట్ లు మోత మోగిస్తున్నారు కానీ, 'నే వస్తున్నా' అని మాత్రం చెప్పడం లేదు. పైగా ఈ రోజు చిత్రంగా ఆంధ్ర ప్రజలు కేంద్రంలో నాయకులకు కట్టుబానిసలు కారు అని ట్వీట్ చేసారు.
నిజానికి నిరసన కార్యక్రమానికి అనుమతి ఇవ్వనంటున్నది రాష్ట్రం కానీ కేంద్రం కాదు. రాష్ట్రం అనుమతి ఇచ్చి, ఆపై కేంద్రం స్పందించకపోతే అప్పటి సంగతి. ముందు అసలు నిరసనే తెలియచేయనివ్వడం లేదు కదా?
నాయకుడు కావాలంటే ఇది అదను
ఫైటింగ్ మోడ్ లో వున్నవాడినే జనం ఎప్పుడూ నాయకుడిగా గుర్తిస్తారు కానీ, మీనమేషాలు లెక్కపెట్టేవాడిని కాదు. పవన్ మాటలు, ట్వీట్లు పదునే కానీ, చేతలు ఆ రేంజ్ లో కనిపించడం లేదు.
మరోపక్క తెలుగుదేశం పార్టీ కూడా జగన్ ను టార్గెట్ చేస్తోంది కానీ పవన్ ను కాదు. ఇది చూసి జనం ఏమనుకుంటారు. ఇదేదో బాబు-పవన్ ల మ్యాచ్ ఫిక్సింగ్ అనుకోరా? పవన్ కనీసం ఇదిగో నా వైజాగ్ టికెట్ అని ట్విట్టర్ లో పోస్ట్ చేసినా, రెస్పాన్స్ వేరుగా వుంటుంది. టాలీవుడ్ లోని ఒక వర్గం ఈ మొత్తం వ్యవహారంపై సైలెంట్ గా వుంది. పైగా ఇప్పటికే వాట్సప్ లో వైజాగ్ నిరసనకు వ్యతిరేక ప్రచారం ఊపందుకుంది.
మరి ఇలాంటి సమయంలో పవన్ చేయాల్సింది మరిన్ని ట్వీట్లు కావు. స్పష్టంగా కనిపించే కార్యాచరణ. కానీ అదే ఈ క్షణం వరకు పవన్ వైపు నుంచి కనిపించడం లేదు. కచ్చితంగా నిరసన కనిపించాలంటే,జనసేన తరపున లేఖ ఇవ్వవచ్చు. లేదా నేరుగా ఆయనే వెళ్లి అక్కడ రంగంలోకి దిగవచ్చు. అంతే కానీ ట్వీట్లో యువతను రెచ్చగొట్టి యుద్దానికి పంపించి, జనసేనాని మాత్రం వెనకన వుండిపోవడం కాదు.సేనాని ఎప్పుడూ ముందే వుండాలి.
నిజానికి ఇది పవన్ కు గోల్డెన్ చాన్స్. ఇప్పుడు కనుక విశాఖ వెళ్లి పవన్ ఫైటింగ్ మోడ్ లోకి వెళ్తే, రాష్ట్ర రాజకీయాల సీన్ మారిపోతుంది. జగన్ ను వెనక్కు నెట్టి పవన్ ముందుకు వెళ్లిపోతాడు. బాబు కూడా కేంద్రంలో వుండాలా? వద్దా? అన్న ఆలోచనలోపడతారు? కేంద్రం దిగిరాక తప్పని పరిస్థితి వస్తుంది. ఇలాంటి చాన్స్ ను వదులుకున్నా, ఏదో ఒక హామీతో ఈ నిరసన నీరు కార్చినా ఇక ఎప్పటికీ పవన్ ను జనం నమ్మరు.