పార్టీలకు మళ్లీ అగ్ని పరీక్ష...!

మొన్ననే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. గెలిచన పార్టీలు, ఓడిన పార్టీలు ఇప్పుడిప్పుడే కుదట పడుతున్నాయి. అయినప్పటికీ వాటికి కంటి మీద కునుకు లేదు. ఎందుకు? ఏప్రిల్‌ 22వ తేదీన దేశ రాజధాని ఢిల్లీలో మున్సిపల్‌ ఎన్నికలు జరగబోతున్నాయి. గత ఎన్నికలు 2012లో జరిగాయి.  బీజేపీ, కాంగ్రెస్‌, ఢిల్లీలో అధికారంలో ఉన్న ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) మొదలైన ప్రధాన పార్టీలన్నీ ప్రస్తుతం ప్రచారంలో మునిగితేలుతున్నాయి. మున్సిపల్‌ ఎన్నికలను స్థానిక సంస్థల ఎన్నికలని అంటుంటాం. ఆ ఎన్నికలను స్థానిక సమస్యలే ప్రభావితం చేస్తాయి. జాతీయ రాజకీయాలతో సంబంధం ఉండదు. కాని ఢిల్లీ దేశ రాజధాని కావడంతో ఢిల్లీ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికలు దేశవ్యాప్తంగా ఆసక్తి కలిగిస్తాయి. జాతీయ మీడియా (ఇంగ్లీషు, హిందీ) అక్కడే కేంద్రీకృతమై ఉండటంతో మున్సిపల్‌ ఎన్నికలకూ  ప్రాధాన్యం లభిస్తుంది. ఇక్కడి గెలుపోటములను జాతీయ పార్టీలు సీరియస్‌గా తీసుకుంటాయి. 

ఢిల్లీ మున్సిపల్‌ ఎన్నికల్లో పార్టీలు తీవ్రస్థాయిలో ప్రచారం చేస్తున్నాయి. పుష్కరానికి పైగా ఢిల్లీ మున్సిపాలిటీని పరిపాలిస్తున్న బీజేపీ కేంద్ర నాయకులకు రంగంలోకి దింపింది. మొన్నటి ఎన్నికల్లో గోవా, పంజాబ్‌ ఎన్నికల్లో ఓడిపోయిన ఢిల్లీ పాలక పార్టీ 'ఆప్‌'కు మున్సిపల్‌ ఎన్నికలు లిట్మస్‌ టెస్ట్‌వంటివని చెప్పొచ్చు. రెండేళ్లకు పైగా ఢిల్లీలో అధికారంలో ఉన్న అరవింద్‌ కేజ్రీవాల్‌ పార్టీ పనితీరు మున్సిపల్‌ ఎన్నికలపై ప్రభావం చూపుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. 2014లో కేంద్రంలో భారీ మెజారిటీతో బీజేపీ అధికారంలోకి వచ్చి నరేంద్ర మోదీ ప్రధాని అయిన తరువాత ఆ విజయోత్సాహం ఎక్కువ కాలం నిలవలేదు.

2015లో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్‌ 70 స్థానాలకుగాను 67 సీట్లు సాధించి అధికారంలోకి వచ్చి బీజేపీకి దిమ్మతిరిగే షాక్‌ ఇచ్చింది. ఉత్తరప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌లో విజయాలు సాధించి, మరో రెండు రాష్ట్రాల్లో ప్రభుత్వాలను ఏర్పాటు చేసి మంచి ఊపు మీద ఉన్న బీజేపీ ఢిల్లీ మున్సిపల్‌ ఎన్నికల్లో ఆప్‌ను దెబ్బ కొట్టాలనుకుంటోంది. ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ ఎన్నికల బాధ్యతను మనీష్‌ సిసోడియా మీద పెట్టినట్లుగా ఉంది. ఆయన ఇంటింటికీ తిరుగుతున్నారు. అరవింద్‌ కూడా త్వరలో ప్రచారంలో పాల్గొంటారు. బీజేపీ ముగ్గురు కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్‌ (దక్షిణ ఢిల్లీ), సంజీవ్‌ బల్యన్‌ (ఉత్తర ఢిల్లీ), జితేంద్ర సింగ్‌ (తూర్పు ఢిల్లీ)లకు ప్రచార బాధ్యతలు అప్పగించింది. మొత్తం ప్రచారం వ్యూహాన్ని కాషాయ పార్టీ అధ్యక్షుడు అమిత్‌ షా రూపొందించారు. ఢిల్లీలో కోల్పోయిన పట్టును తిరిగి సాధించేందుకు మున్సిపల్‌ ఎన్నికలు మంచి అవకాశమని కాంగ్రెసు నాయకులు భావిస్తున్నారు. పంజాబ్‌లో ఆప్‌ను మట్టి కరిపించిన ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అమరీందర్‌ సింగ్‌ను కాంగ్రెసు ప్రధాన ప్రచారకర్తగా రంగంలోకి దించుతోంది.

ప్రధాని నరేంద్ర మోదీ సైతం మున్సిపల్‌ ఎన్నికలపై సీరియస్‌గానే ఉన్నారు. ఆయన ప్రధాని కాబట్టి ఈ ఎన్నికల్లో ఆయన కనబడరు. అయినప్పటికీ ఢిల్లీని చేజారనివ్వవద్దని ఆయన అమిత్‌ షాకు చెప్పారట. సాధారణంగా పెద్ద మున్సిపాలిటీల (మహానగరాలు) ఎన్నికలు ఆసక్తికరంగానే ఉంటాయి. ఢిల్లీ దేశ రాజధాని కావడంతో దేశవ్యాప్తంగా ఆసక్తి ఉంటుంది. రాష్ట్ర రాజధాని నగరాల్లో జరిగే మున్సిపల్‌ ఎన్నికలు ఆ రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తికరంగా, చర్చనీయాంశంగా ఉంటాయి. జీహెచ్‌ఎంసీ ఎన్నికలు తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్‌లోనూ కీలకమయ్యాయి. ఆ ఎన్నికల చర్చ, ప్రభావం తెలంగాణకే పరిమితం కాలేదు. 

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ విడిపోయాక తొలిసారిగా జరిగిన ఎన్నికలు కాబట్టి తీవ్ర ఉత్కంఠ కలిగించాయి. ఆంధ్రా ప్రజలు లక్షల్లో ఉన్న హైదరాబాదులో ఎలాంటి ఎన్నికలు జరిగినా దాని ప్రకంపనలు ఆంధ్రాకు పాకుతాయి. తెలంగాణ ఉద్యమంలో ఆంధ్రావారిని నానా తిట్లు తిట్టిన కేసీఆర్‌ జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో వారిని అక్కున చేర్చుకోవడంతో ఆంధ్రా పార్టీగా ముద్రపడిన టీడీపీ కనుమరుగైంది. పెద్ద నగరాల్లో మున్సిపల్‌ ఎన్నికలు పార్టీల జాతకాలు మార్చేవిధంగా ఉంటాయి. ఆంధ్రప్రదేశ్‌లో కొన్ని నగరాల్లో ఎన్నికలు జరగాల్సి ఉంది. ఆ ఎన్నికల్లో టీడీపీని మట్టి కరిపించాలని వైకాపా కాచుకుకూర్చుంది. కాబట్టి మున్సిపల్‌ ఎన్నికలే కదా అని నిర్లక్ష్యంగా ఉంటే పార్టీల భవిష్యత్తు తారుమారవుతుంది.

Show comments