'పరుగు ఆపడం ఒకకళ..' అప్పుడెప్పుడో శోభన్‌బాబు జీవిత చరిత్రను గ్రంథస్తం చేసిన ఒక రచయిత ఆ బయోగ్రఫీకి పెట్టిన పేరు అది. నిజమే.. నిస్సందేహంగా చాలా గొప్ప జీవితసత్యం అది. పరుగును ఆపడం ఒకకళ.. ప్రత్యేకించి కళాకారుల్లో అలాంటి ధోరణి అరుదుగా కనిపిస్తుంది. తాము ఎక్కడ ఆపాలో వాళ్లకు తెలియాలి. తెలియకపోతే యాక్సిడెంట్లు అవుతాయి. పరుగు అర్థంలేనిది అవుతుంది. మరి అలాంటి అర్థంలేని పరుగును కొనసాగిస్తున్న వాళ్లు సినిమా రంగంలో చాలా మందే కనిపిస్తున్నారు. దేనికైనా ఒక పరిమితి ఉంటుంది, వీలుకానప్పుడు ఆపడం మంచిది. అదే వీరు అర్థం చేసుకోవడంలేదు. ప్రేక్షకులను విసిగించడమే పనిగా పెట్టుకున్నట్టుగా వీరు వ్యవహరిస్తున్నారు. అలాగని వీళ్లను తక్కువ చేసి మాట్లాడటంలేదు.. వీళ్లు నిస్సందేహంగా గొప్ప దర్శకులే. అయితే ఇప్పుడుకాదు. వీరు నిస్సందేహంగా గొప్ప సినిమాలు తీశారు. అది కూడా ఇప్పుడు కాదు. నిస్సందేహంగా వీళ్లు ప్రేక్షకులను ఆనందపెట్టారు. ఇది కూడా ఇప్పుడు కాదు!
ఈ జాబితాను తయారు చేస్తే అది చాలా పెద్దదే అవుతుంది. ఇండస్ట్రీలో సినిమాలు ఒకప్పుడెప్పుడో అద్భుతాలు చేసి.. ఇప్పుడు చెత్త సినిమాలు తీస్తున్న వారు ఎంతో మంది కళ్ల ముందే కనిపిస్తున్నారు. అసలు వీళ్లు ఎందుకు ఇలాంటి సినిమాలు తీస్తున్నారని కాదు, అసలు వీళ్లెందుకు సినిమాలు తీస్తున్నారు? అనేదే ఇక్కడ ప్రశ్న. కొత్త సినిమాలు తీసి పాత వాటిపై గౌరవాన్ని పోగొడుతున్నారు. వీరి క్లాసిక్స్ కేవలం యూట్యూబ్‌కే పరిమితం అయ్యాయి. థియేటర్లలో వీళ్ల సినిమాలు చూస్తుంటే.. వాళ్లు వీళ్లేనా.. అనే సందేహాలు కలుగుతున్నాయి. ఈ మధ్యకాలంలో ఇలా ప్రేక్షకులను విసిగి వేసారెత్తించిన వారి అనుభవాలతో.. అందరి దర్శకులకూ ఇదొక చురక. జాగ్రత్తగా ఉండమని సూచన.
అదే లాస్ట్ సినిమా అయితే మేలేమో!
'ఓం నమో వేంకటేశాయ..' సినిమా రూపకల్పన సమయంలో ఇదే దర్శకుడిగా తన ఆఖరి సినిమా అవుతుంది, అని అనేవాడట దర్శకుడు కె.రాఘవేంద్రరావు. ఆ భక్తిరస చిత్రంతో కెరీర్‌ను ముగించాలని రాఘవేంద్రుడు తనతో అన్నాడని అందులో నటించిన నాగార్జున చెప్పాడు. అయితే సినిమా విడుదల సమయంలో మాత్రం.. అది తన ఆఖరి సినిమా కాదని దర్శకేంద్రుడు చెప్పాడు. తనకు ఇంకా డ్రీమ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయని ఆయన అన్నారు. అందుకు సంబంధించిన వివరాలు కూడా ఏవో చెప్పారాయన.
అయితే 'ఓం నమో వేంకటేశాయ' సినిమా చూసిన తర్వాత మాత్రం.. దర్శకేంద్రుడు ఇక విరమించుకోవడమే మేలేమో అని ఆయన అభిమానులు అంటున్నారు. అవును ఆయన గొప్ప దర్శకుడే.. తన తరం దర్శకులంతా తెరమరుగు అయిపోయాకా కూడా రాఘవేంద్రరావు గొప్ప సినిమాలు తీశాడు. వంద సినిమాలకు దర్శకత్వం వహించాడు. తన కథ అయిపోయిందనుకున్న దశలో 'అన్నమయ్య', 'శ్రీమంజునాథ' 'శ్రీరామదాసు' వంటి సినిమాలతో కొత్తరూట్లో దూసుకొచ్చాడు. యువదర్శకులకు పోటీ ఇచ్చాడు. అయితే.. వాటిని మినహాయిస్తే.. రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన ఇతర సోషల్, భక్తిరస చిత్రాలేవీ ఏ రకంగానూ ప్రేక్షకులను ఆకట్టుకోలేదు.
అప్పుడెప్పుడో 'అల్లరి బుల్లోడు' అంటూ తన ఫార్ములా మేరకు సినిమా తీసిన రాఘవేంద్రరావు డిజాస్టర్‌ను చవిచూశాడు. ఆ తర్వాత 'ఝుమ్మందినాదం'తో మరో ప్లాఫ్‌ను ఎదుర్కొన్నాడు. ఇక 'ఓం నమో వేంకటేశాయ' సినిమాతో దర్శకేంద్రుడు విమర్శలను ఎదుర్కొన్నాడు. ఏ కథతో సినిమా తీసిన బొడ్డూ, పాలు, పళ్లు తప్పవా? అని క్రిటిక్స్ ప్రశ్నించారు. మరి ప్రశ్నిస్తున్న వారికి రాఘవేంద్రరావు అనుభవంలో సగం వయసు కూడా లేదు. మరి అలాంటి వారికి అవకాశం ఇవ్వడం కన్నా.. రాఘవేంద్రుడు పరువు ఆపితే అంత కన్నా గొప్పేముంది?
కె.విశ్వనాథ్ చాలించినట్టే కదా..?
గత ఇరవై సంవత్సరాల్లో రెండే సినిమాలకు దర్శకత్వం వహించాడు కళాతపస్వి. వాటిలో ఒకటి 'స్వరాభిషేకం' రెండో 'శుభప్రదం' తన ఫార్మాట్‌లోనే సినిమాలు చేసిన ఈయన వాటితో ఏ వర్గం ప్రేక్షకులనూ ఆకట్టుకోలేకపోయారు. వయసురీత్యా చూసినా.. విశ్వనాథ్ ఇక దర్శకత్వాన్ని ఆపేసినట్టే. ఒకరకంగా ఎక్కువ సినిమాల జోలికి వెళ్లకుండా.. నటన మీద కాన్సన్‌ట్రేట్ చేసి విశ్వనాథ్ ఆ విభాగంలో తన ప్రత్యేకతను నిరూపించుకున్నారు.
మణిరత్నం సార్.. ఇలా విసిగిస్తారెందుకు?
తెలుగు వ్యక్తి కాదు కానీ.. తెలుగు సినిమాపై శాశ్వత ప్రభావాన్ని చూపిన దర్శకుడు మణిరత్నం. తమిళంలో మణిరత్నం తీసే ప్రతి సినిమా.. అక్కడితో పాటు ఇక్కడ కూడా భారీ ఎత్తున విడుదల అవుతుంది. మణిరత్నంకు తెలుగునాట భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. మణిరత్నంతో సినిమా అంటే తెలుగు సినీ స్టార్లు కూడా ఉత్సాహవంతులవుతారు. ఆయన దర్శకత్వంలో నటించడం తమ భాగ్యంగా ఫీలవుతారు. అయితే ఇలాంటి క్రేజ్ ఉన్న సమయంలోనే మణిరత్నం కూడా తప్పుకుంటే మంచిది.
'కడలి', 'ఓకే బంగారం', 'చెలియా' వంటి సినిమాలు రూపొందించడానికి అయితే మణిరత్నం అక్కర్లేదు. కడలి ఏం తీశాడు, ఎందుకు తీశాడో ఆయనకే తెలియదు. ఒక ఓకే బంగారం మరీ గొప్ప చిత్రం ఏమీకాదు. కేవలం రెహమాన్ మ్యూజిక్‌తో, బీజీఎమ్‌తో ఆ సినిమా బయటపడింది. ఇక చెలియా సంగతి చెప్పనక్కర్లేదు. అంతకు ముందు కూడా మణిరత్నం రావన్ వంటి డిజాస్టర్లనే తీశాడు.
చాలు.. ఎన్నో గొప్ప సినిమాలు తీశారు. యూట్యూబ్‌లో వాటిని చూస్తే ప్రేక్షకులు ఆనందంగా ఉన్నారు. వాటిని చూసినప్పుడల్లా మణిపై గౌరవం పెరుగుతుంది. మరి అ రకంగానే ఈ దర్శకుడు ధన్య జీవి. మరి అలాంటప్పుడు ఎందుకీ ఆరాటం? ఈతరం వారి చూపులో మణిరత్నం చీప్ అయిపోకూడదు. లాగి లాగి.. పలుచబడే కంటే.. పరిమతులు పెట్టుకుని ఉంటనే విలువ. మణిరత్నం ఈ తత్వాన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
వంశీగారూ.. సరిగా విడుదల చేసుకోండి..
మరో తెలుగు దిగ్దర్శకుడు వంశీ. పరిచయం అక్కర్లేని పేరు. ఖాతాలో క్లాసికల్ సినిమాలున్నాయి. కథకుడిగా తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేశారు. తెలుగు ప్రేక్షకులకు చిరకాలం గుర్తుండిపోతారు. మరి అలాంటి వంశీ గారేంటి.. అలాంటి సినిమాలు తీస్తున్నారు? అసలు వంశీగారి నిర్మాతలను అనాలి ఫస్ట్. ఆ సినిమాలు ఎప్పుడు విడుదల అవుతాయో కూడా తెలీదు. టైటిల్స్ మార్చుతారు.. విడుదల చేస్తారు, చేయరు.. వంశీ అభిమానులకే ఇది ఏ మాత్రం నచ్చడంలేదు. విడుదల చేసుకోవడం రానప్పుడు ఆ సినిమాలను రూపొందించడం ఎందుకు? అనేది ఒక ప్రశ్న. ప్రస్తుతం వంశీ తన ఆల్‌టైమ్ క్లాసిక్ 'లేడీస్ టైలర్'కు సీక్వెల్ పనిలో ఉన్నాడు. మరి టైలరింగ్ కథను ఫ్యాషన్ డిజైనర్‌గా మార్చి ఈ దర్శకుడు ఈ తరాన్ని మురిపించగలడా? మురిపిస్తే ఫర్వాలేదు. లేకపోతే.. గౌరవంగా రిటైర్ కావడం వంశీ అభిమానులను ఆనంద పెట్టే అంశం కాదా?
ఎస్వీకే, కోదండరామి రెడ్డిలు కూడా అంతే...
తన ఆల్‌టైమ్ సూపర్ హిట్ 'యమలీల' ఈ దశలో క్యాష్ చేసుకోబోయి భంగపడ్డారు ఎస్వీకే. 'యమలీల-2' అంటూ తీవ్రంగా నిరాశ పరిచాడు. ఒరిజినల్‌కు ఏమాత్రం సరిపోలని సినిమా చేశాడు. ఇక ఎస్వీకే గత పదేళ్లలో చేసిన సినిమాలేవీ కూడా ఏ మాత్రం ఆకట్టుకోలేదు. అయితే ఎస్వీకే మాత్రం తనలో ఉత్సాహం తగ్గిపోలేదంటారు. ప్రస్తుతం ఒక కథతో బాలయ్య, కమల్ హాసన్ వంటి వాళ్లను సంప్రదించినట్టుగా తెలుస్తోంది. మరి వారితో ఆ సినిమా పట్టాలెక్కలేదు. ఒకవేళ మళ్లీ వస్తాను సత్తా చాటతాను అనే కాన్ఫిడెన్స్ ఉంటే పర్వాలేదు, లేకపోతే.. ఎస్వీకే ఇండస్ట్రీలోనే మరోరకంగా ప్రేక్షకులకు దగ్గరకావడం మేలేమో. తన అనుభవాన్ని ఉపయోగించుకుని.. ఇండస్ట్రీలో మరోరకంగా నిలదొక్కుకోవడం ఈ సీనియర్‌కు కష్టంకాదు. దర్శకత్వమే అంతిమం కాదు కదా! ఒక కోదండరామిరెడ్డి.. తప్పుకున్నట్టే. అదే మేలు.
కోడిరామకృష్ణ సార్.. ఈ ఫెయిల్యూర్ల మాటేంటి?
వంద సినిమాలు పూర్తి చేసుకున్నా కూడా సంచలన సినిమాను తీసిన దర్శకుడు కోడి రామకృష్ణ. అరుంధతితో అద్భుతాన్నే నమోదు చేశారు. అయితే అరుంధతికి ముందు, అరుంధతికి తర్వాత కోడి చాలా సినిమాలే తీశారు. వాటి ఫలితాల గురించి మాట్లాడుకోవడం కూడా అనవసరం. 'నాగరహావు' అంటూ కోడి ఈ మధ్యనే ఒక డిజాస్టర్‌ను రూపొందించారు. అయినా కోడి తగ్గేది లేదంటున్నారు. మరి ఎందుకో అలా!
ఈ జాబితాలోకి మరికొందరిని కలపొచ్చు.. రామ్‌గోపాల్ వర్మను కూడా. ఈయన ఎందుకు సినిమాలు తీస్తున్నాడో ఎవరికీ తెలీదు. కేవలం తన కోసం మాత్రమే తను సినిమాలు తీస్తున్నానని వర్మ చెప్పుకొంటాడు. మరి అలాంటప్పుడు వాటిని విడుదల చేయడం ఎందుకు? ఈ మధ్య వర్మకు కూడా విడుదలలు కష్టం అయినట్టుగా ఉంది. హోం ప్రొడక్షన్‌లో అరడజను సినిమాలు విడుదలలు ఆగిపోయాయి. ఇక సర్కార్ త్రీకి కూడా అలాంటి ఇబ్బందులే ఉన్నట్టున్నాయి. మరో దర్శకుడు రేలంగి నరసింహారావు కూడా ఆకట్టుకోలేని సినిమాలు తీయడం కంటే ఆపితేనే మేలు కదా!
ఇండస్ట్రీలో నూటికి 90శాతం చిత్రాలు ఫెయిల్యూర్సే. మరి అలాంటి ఫెయిల్యూర్స్‌లో ఈ దర్శకులు కూడా భాగస్వామ్యులు అయితే తప్పేముంది? హిట్ కావాలనే ఎవరైనా సినిమా తీస్తారు కానీ, ప్లాఫ్ కావాలని కాదు కదా? వాళ్ల ప్రయత్నాలు వాళ్లు చేయడంలో తప్పేముంది? అనే వాదనను ఈ దర్శకుల విషయంలో వినిపింవచ్చు గాక.. అందుకే మొదట్లోనే చెప్పింది 'పరుగును ఆపడం ఒక కళ..' అని. అదెక్కడ, ఎప్పుడు ఆపాలో ఎవరికి వారే తెలుసుకోవాలి.