నంద్యాల ఎన్నికలపై అధికార, ప్రతిపక్ష పార్టీలు అప్పుడే వ్యూహరచన ప్రారంభిచాయి. శిల్పా మోహన్‌రెడ్డి చేరితో వైసీపీ బలం పుంజుకుంది. అయితే శిల్పా అభ్యర్థిత్వం వల్ల నంద్యాలలో ఎలాంటి అనుకూల, ప్రతికూలతలున్నాయి, వాటిని ఎలా అధిగమించాలనేదానిపై వైసీపీ దృష్టి కేంద్రీకరించింది. గెలుపు సమీకరణాలకు శ్రీకారం చుట్టింది.
నంద్యాల పట్టణంలో శిల్పా మోహన్‌రెడ్డికి గట్టి పట్టుంది. ఆయన ఏ పార్టీలో ఉన్నా ప్రజోపయోక కార్యక్రమాలతో పట్టణ ఓటర్లలో మెప్పు పొందాడు. నంది రైతు సమాఖ్య ఏర్పాటు చేసి రైతులకు ఎరువులు, పురుగుమందులను సబ్సిడీపై అందజేస్తున్నారు. స్థానిక మహిళలు, డ్వాక్రా సంఘాలకు వడ్డీలేని రుణాలు అందజేస్తున్నారు.
శిల్పా వాటర్ ప్లాంట్ ద్వారా క్యాన్ నీటిని రెండు రూపాయలకు, శిల్పా సహకార్ పేరుతో నెలకొల్పిన సూపర్ మార్కెట్ ద్వారా తక్కవ ధరకే నిత్యావసరాలు అందజేస్తూ పట్టణ ప్రజల్లో శిల్పా ఆదరణ సాధించారు. అయితే అంతే స్థాయిలో ఎస్పీవై రెడ్డి కూడా పట్టణంలో బలగం సంపాదించుకున్నాడు. పట్టణంలో గణనీయ సంఖ్యలో ఉన్న ముస్లింలలో మెజారిటీ వర్గం వైసీపీ వైపే ఉంది.
ముస్లింలలో పట్టున్న మాజీ మంత్రి ఫరూక్‌కు ఆది నుంచి భూమా వర్గంతో విభేదాలున్నాయి. దీంతో ఆయన భూమా బ్రహ్మనందరెడ్డి అభ్యర్థిత్వాన్ని ఎంతమేర బలపరుస్తారనేదానిపై అనుమానాలున్నాయి. మరో కీలక సామాజిక వర్గం వైశ్యులు మెజారిటీ టీడీపీ వైపు మొగ్గు చూపుతున్నా వ్యక్తిగతంగా శిల్పాతో వారికి మంచి అనుబంధం ఉంది.
2014 ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీ చేసినప్పుడు శిల్పాకు వైశ్యులు అండగా నిలిచారు. మరి వారిలో ఎంత మందిని ఈసారి తనకు అనుకూలంగా మార్చుకుంటారన్నది కీలకం. నంద్యాల గ్రామీణంలో రెడ్డి, బలిజ సామాజిక వర్గాలదే ఆధిపత్యం. గత ఎన్నికల్లో రెడ్లు పూర్తిగా వైసీపీ వైపు నిలవగా, బలిజలు టీడీపీని ఆదరించారు.
ఇప్పడు కూడా అలాంటి పరిస్థితే కనబడుతోంది. అన్నింటికీ మించి నియోజకవర్గంలోని గోస్పాడు మండలం ఎన్నికల్లో కీలకపాత్ర పోషించనుంది. గతంలో ఆళ్లగడ్డ నియోజకవర్గంలో ఉన్న గోస్పాడు 2009లో నియోజకవర్గాల పునర్విభజన అనంతరం నంద్యాల నియోజకవర్గంలో చేరింది. భూమా కుటుంబానికి పట్టున్న ఈ మండలంలో గంగుల ప్రతాపరెడ్డి మద్దతు వైసీపీ చాలా అవసరం.
మండలంలో భూమా కుటుంబానికి దీటుగా గంగుల ఫ్యామిలీకి ప్రాభవం ఉంది. మండలంలో ఎనిమిది మంది ఎంపీటీసీలు, జడ్పీటీసీ సభ్యురాలు, రాష్ట్ర మార్క్‌ఫెడ్ ఉపాధ్యక్షుడు పీపీ నాగిరెడ్డి, పలువురు సర్పంచులు శిల్పాతోపాటు వైసీపీలో చేరారు. వీరంతా శిల్పా, గంగుల వర్గీయులు. భూమా వర్గం చాలా మంది టీడీపీలోనే కొనసాగుతున్నారు. కాబట్టి ఈ నిర్ణాయక మండలంలో గంగుల సేవలు వైసీపీకి అవసరపడనున్నాయి.