ఇది కదా అసలు సిసలు రికార్డు.!

ఓ హిందీ సినిమా సాధించిన అత్యధిక వసూళ్ళ రికార్డుని, ఓ తెలుగు సినిమా హిందీలోకి డబ్‌ అయి కొల్లగొట్టిందంటే ఆషామాషీ విషయం కాదు. ఇది కదా అసలు సిసలు రికార్డు అంటే. అవును, ఆ రికార్డ్‌ని సొంతం చేసుకుంది 'బాహుబలి'. హిందీలో 'బాహుబలి ది కంక్లూజన్‌' 500 కోట్ల వసూళ్ళను, అదీ ఇండియాలో సాధించడం చాలా చాలా చాలా అరుదైన రికార్డుగా చెప్పుకోవాలి. 

'బాహుబలి ది కంక్లూజన్‌'కి ముందు అత్యధిక వసూళ్ళు సాధించిన హిందీ సినిమా 'దంగల్‌'. అమీర్‌ఖాన్‌ హీరోగా వచ్చిన 'దంగల్‌' రికార్డుల్ని 'బాహుబలి' చాలా తేలిగ్గానే కొల్లగొట్టేసింది. ఓవరాల్‌ వసూళ్ళలో 'దంగల్‌'ని 'బాహుబలి' ఎప్పుడో దాటేసింది. మొట్టమొదట 1000 కోట్ల వసూళ్ళు సాధించిన సినిమాగా 'బాహుబలి' రికార్డులకెక్కిన విషయం విదితమే. 

చైనాలో 'దంగల్‌' విడుదలయ్యాక, 'బాహుబలి ది కంక్లూజన్‌'కి మళ్ళీ పోటీ షురూ అయ్యింది. ప్రస్తుతం ఓవరాల్‌ వసూళ్ళలో (అన్ని బాషలు కలుపుకుని) 'బాహుబలి'ని 'దంగల్‌' దాటేసింది. అయితే, ఇండియాలో 'బాహుబలి ది కంక్లూజన్‌' సృష్టించిన రికార్డుల్ని కొల్లగొట్టడం బహుశా ఇప్పట్లో ఏ హిందీ సినిమాకీ సాధ్యం కాదేమో.

Show comments