మొక్కుబడి డైలాగుల్తో వెంకయ్య నవ్వులపాలు!

వెంకయ్యనాయుడు అనే సీనియర్‌ నాయకుడికి అసలు ఆత్మసాక్షి అనేది ఉంటుందో లేదో గానీ.. నరం లేని తన నాలుకతో మాటలను మెలితిప్పడంలో తనను మించిన వారు లేరనే నమ్మకం మాత్రం పుష్కలంగా ఉంటుంది. అందుకే ఆయన ఎడా పెడా కౌంటర్లు వేసేస్తుంటారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదా సాధించే విషయంలో మోడీ సర్కారు విస్పష్టంగా వంచనకు పాల్పడిన నేపథ్యంలో.. అదే ప్రభుత్వంలో తానొక కీలక మంత్రిగా ఉన్నప్పటికీ కూడా.. ఏమాత్రం ప్రభావం చూపలేకపోయిన వెంకయ్యనాయుడు.. తన వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి అప్పటినుంచి నానా పాట్లు పడుతూనే ఉన్నారు. కేవీపీ ప్రెవేటు మెంబరు బిల్లు నేపథ్యంలో గురువారం నాడు రాజ్యసభలో జరిగిన చర్చలో కూడా కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు ముందు వెనుకలుచూసుకోకుండా.. మరీ మొక్కుబడి, పడికట్టు డైలాగులు వల్లించడం విశేషం. 

''ఏపీకి ఎన్డీయే ప్రభుత్వం చేసినంత సాయం గతంలో ఏ ప్రభుత్వమూ చేయలేదని'' ఆయన అంటున్నారు. అసలు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం ఏర్పడినదే.. ఎన్డీయే సర్కారు అవతరించిన తర్వాతే కదా..! పాత ప్రభుత్వాలు దానికి నిధులివ్వడం ఎలా కుదురుతుంది? మొక్కుబడిగా.. లేదా అలవాటుగా ప్రతిదానికీ పాత ప్రభుత్వాలు చేయని పని మేంచేశాం అంటూ డప్పు కొట్టుకోవడంలో భాగంగా.. వెంకయ్య ఈ డైలాగు కూడా వల్లించేస్తే.. ప్రజల ముందు నవ్వులపాలు అయిపోతాం అనే వెరపు ఆయనకు కలిగినట్లు లేదు. 

ప్రత్యేకహోదా అంశాన్ని బిల్లులో పెట్టాలంటూ ఆనాడే తాను డిమాండ్‌చేశానని వెంకయ్య నొక్కి వక్కాణిస్తున్నారు. లోక్‌సభకు మళ్లీ బిల్లు వెళ్లాల్సి వస్తుందిగనుక, దాన్ని తప్పించడానికి అలా జరిగిందని అంటున్నారు. నిజానికి వెంకయ్య నాయుడు వాదన కాంగ్రెస్‌ పార్టీని సమర్థిస్తున్నట్లుగా ఉంది. కాంగ్రెస్‌ ఎందుకు బిల్లులో ప్రత్యేకహోదా అంశాన్ని చొప్పించలేకపోయిందో.. వెంకయ్యనాయుడు చాలా విపులంగా వారి తరఫున వివరణ ఇస్తున్నట్లుగా ఇది కనిపిస్తోంది. ఇది ఎలా ఉన్నదంటే.. 

''వెంకయ్యనాయుడు, అరుణ్‌ జైట్లీ తదితరులు డిమాండ్‌ చేసిన తరువాత.. ప్రత్యేకహోదాను ఇవ్వడానికి అనుకూలంగా ప్రధాని మన్మోహన్‌సింగ్‌ రాజ్యసభలో ప్రకటన చేశారు. దానికి ప్రతిపక్ష భాజపా కూడా ఆమోదించింది. బిల్లులో ఆ అంశం పెట్టడం వలన మళ్లీ లోక్‌సభలో ఓటింగ్‌ కు వెళ్లవలసి ఉంటుంది గనుక.. దాన్ని తప్పించడానికి.. రాజ్యసభలో బిల్లు ఆమోదం పొందడానికి భాజపా సహకరించింది.'' 

.. వెంకయ్య వివరణ ఈ రూపంలో ఉంది. అంటే ప్రధాని ఇచ్చిన హామీని సాంకేతికంగా బిల్లులో పెట్టలేకపోయారు తప్ప.. ఆహామీ ప్రభుత్వాధినేత ఇచ్చినదికాదని చెప్పలేరు కదా..! ఆ విషయాన్ని వెంకయ్యే ఒప్పుకుంటున్నారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల ప్రచారం యావత్తూ అదే ప్రత్యేకహోదా గురించి మాట్లాడారు కదా.. ఇప్పుడు జనం ఆమాటల గురించే అడుగుతున్నారు. వెంకయ్యనాయుడు కనీసం మౌనం పాటించినా... ఆయన మీద జనం జాలిపడగలరేమో గానీ.. ఇలా తనకు ప్రమేయం లేదన్నట్లుగా, ప్రత్యేకహోదాకు సంబంధించిన హామీలకు, ఆనాడు వల్లించిన మాటలకు తనకు బాధ్యత లేదన్నట్లుగా ఇప్పుడు బుకాయించడానికి చేసే ప్రయత్నం మాత్రం ఆయన మీదున్న గౌరవాన్ని పలచనచేస్తుంది. 

కానీ స్థూలంగా ఒక విషయం మాత్రం అర్థమవుతోంది. ఆంధ్రప్రదేశ్‌కు అర్హమైన రెవిన్యూ లోటు, ప్రత్యేకహోదా వంటి వాటి విషయంలో కేంద్రంలోని మోడీ సర్కారును ప్రభావితంచేసి వాటిని సాధించగల సత్తా వెంకయ్యనాయుడుకు లేదు. ఆయన తొలి ప్రాధాన్యం మోడీ కోటరీలోని తన స్థానాన్ని కాపాడుకోవడం వరకే ఉంటున్నది. అలాంటి నేపథ్యంలో ఆయన ఏపీ ప్రజలు కోరుకునే ప్రయోజనాల గురించి పట్టించుకుంటారని ఆశించడం భ్రమ. 

Show comments