బాబు కుటుంబం పాలతో కాలకూట రాజకీయం!

అధికారంలో ఉంటే ఎన్ని అడ్డదారులు తొక్కవచ్చో అన్నింటినీ అడ్డదిడ్డంగా వాడేస్తున్నట్టుంది చంద్రబాబు కుటుంబం. రాజకీయ అవినీతి, రాజధాని భూముల వ్యవహారం, సదావర్తి భూముల కుంభకోణం వంటి వ్యవహారాల్లో బాబు అండ్‌ కో మీద వస్తున్న విమర్శల సంగతి అంటుంచితే.. అధికారంలో ఉన్నామని ఇతర వ్యవస్థలనూ, పరిశ్రమలూ దెబ్బతీసే వ్యవహారానికీ తెర తీశారు. రాయలసీమ నాలుగు జిల్లాల సాక్షిగా అధికారం మాటున దోపిడీ కొనసాగుతోంది. పైకి ఎలాంటి ఆధారమూ లేకుండా సాగుతున్న దోపిడీ ఇది! నిరూపించాలంటే జేజెమ్మ దిగొచ్చినా సాధ్యం కాదు! అలాంటి స్కెచ్‌ మేరకు ఇక్కడ దోపిడీ జరుగుతోంది!

మరి ఈ పక్కా ప్రణాళికతో జరుగుతున్న దోపిడీలో ప్రభుత్వమో.. లేక ప్రైవేట్‌ వ్యవస్థలో నష్టపోతుంటే.. అదో ఎత్తు! కానీ ఇక్కడ నష్టపోతున్నది రైతులు! బాబు కుటుంబ వ్యాపారాల పుణ్యమో.. లేక ఆయన అధికారంలోకి వచ్చిన పాపమో కానీ.. రాయలసీమ నాలుగు జిల్లాల్లో పాడి పరిశ్రమ బాధిత స్థానంలో నిలుస్తోందిప్పుడు. పాలూ, పళ్లు అమ్ముకుని బతుకుతున్నాం.. అని బాబు కుటుంబం తరపు నుంచి తరచూ ప్రకటనలు వస్తూ ఉంటాయి. అయితే.. ఆ పాలూ, పళ్ల అమ్మకంలో కూడా బెదిరింపులు, దౌర్జాన్యాలు, అమాయక రైతులను మోసం చేయడాలూ కూడా ఉంటాయని ఈ తతంగంతో స్పష్టం అవుతోంది.

చేసేది పాల వ్యాపారమే అయినా.. కాలకూట విషతుల్యమైన రాజకీయం నడుస్తోంది ఇప్పుడు. ఎవరూ పైకి చెప్పుకోలేకపోవడం ఒక ఎత్తు అయితే, ఈ వ్యవహారంతో సగటు పాడి రైతు ఎంతగా నష్టపోతున్నాడో అతడికీ అర్థం కాకపోవడం మరో ఎత్తు. విషయం ఏమిటంటే.. రాయలసీమ జిల్లాల్లో డైరీల నుంచి ఒక ప్రధానమైన ఫిర్యాదు వినిపిస్తోంది. దాని సారాంశం ఏమనగా... పాల సేకరణ విషయంలో హెరిటేజ్‌ డైరీ కన్నా ఎక్కువ ధరను ఏ డైరీ కూడా కోట్‌ చేయకూడదు అనేది! పాడి రైతుల నుంచి పాల సేకరణకు బోలెడన్ని డైరీలు పోటీ పడుతున్న సంగతి తెలిసిందే. మార్కెట్‌లో ఎన్నిరకాల బ్రాండ్ల పాలు, పెరుగులు  అందుబాటులో ఉన్నాయో.. ఆ డైరీలు అన్నీ కూడా రైతుల నుంచి దేనికి అది పాల సేకరణ చేస్తాయి. రైతుల నుంచి సేకరించిన పాలను ప్రాసెసింగ్‌ చేసి అవి అమ్ముకుంటాయి.

ఈ నేపథ్యంలో.. తెలుగు నాట అనేక డైరీ సంస్థలు మంచి స్థాయిలో మార్కెట్‌ కలిగి ఉన్నాయి. వీటి మధ్య అమ్మకాల విషయంలోనే కాదు, పాల సేకరణ విషయంలో కూడా పోటీ ఉంది. అమ్మే పాల విషయంలో తక్కువ ధర, మంచి నాణ్యత ఇచ్చే కంపెనీ పాలు ఎక్కువగా అమ్ముడవుతాయి. సేకరణ విషయంలో దీనికి రివర్స్‌.. ఎక్కువ ధర చెల్లించే డైరీకి రైతులు పాలు పోస్తారు.

మరి మంచి మార్కెటింగ్‌ అవకాశాలు ఉన్న డైరీ సంస్థలు.. రైతుల నుంచి ఎంతగా వీలైతే అంతగా పాలు సేకరిస్తాయి. ఈ సేకరణలో ప్రధాన కంపెనీల మధ్య పోటీ ఉంది. రైతుల దగ్గర ఉత్పత్తి అయ్యే వాటిలో ఇలాంటి పోటీ ఏదైనా ఉంది అంటే.. అది ప్రస్తుతానికి పాల విషయంలోనే! మరి ఈ పోటీ రైతుకు మేలు చేస్తుంది. కానీ.., అదెప్పుడంటే.. అధికారంలో ఉన్న వారికి సొంతంగా డైరీలు లేనప్పుడు మాత్రమే!

ఒకవేళ ముఖ్యమంత్రి కుటుంబానికే ఓన్‌గా ఒక డైరీ సంస్థ ఉంటే.. దాని దౌర్జన్యం ఎలా ఉంటుందో.. ఇప్పుడు సీమ పాడి రైతులను, డైరీ సంస్థలను కదిలిస్తే అర్థం అవుతుంది. ఇప్పటికే హెరిటేజ్‌ డైరీ విషయంలో పలు ఆరోపణలు వచ్చాయి. చంద్రన్న మజ్జిగ పంపిణీ సమయంలో.. కలెక్టర్లు హెరిటేజ్‌ నుంచే మజ్జిగ కొనాలని ఆదేశాలు జారీ చేయడం, చంద్రన్న కానుకతో హెరిటేజ్‌ నెయ్యి పూర్తిగా నిల్వలు ఖాళీ అవుతున్నాయనే.. ఆరోపణలు ఉన్నాయి. ప్రతిపక్షాలు ఈ విమర్శలను గట్టిగా చేస్తున్నాయి.

ఇప్పుడు పల్లెల్లో పాల సంగతికి వస్తే.. హెరిటేజ్‌ డెయిరీ దందా ఆసక్తికరంగా, అన్యాయంగా ఉందని రైతులు మొరపెట్టుకుంటున్నారు. వారి వెర్షన్‌ ప్రకారం.. పాల సేకరణలో హెరిటేజ్‌ చెప్పిందే ధర. ఆ సంస్థ కోట్‌ చేసే మొత్తానికి మించి.. మరే సంస్థ కూడా కోట్‌ చేయకూడదు! ఇదీ రాయలసీమ నాలుగు జిల్లాల్లో అనధికారికంగా అమలవుతున్న నియమం.. ఈ విషయాన్ని చెబుతున్నది రైతులు, పాల సేకరణ కర్తలు! పాలకు ఎంత డిమాండ్‌ ఉన్నా.. ఏ డైరీ కంపెనీ కూడా హెరిటేజ్‌ కన్నా ఎక్కువ ధర పెట్టి కొనడానికి లేదు!

ఏ సంస్థ అయినా.. హెరిటేజ్‌ సంస్థ కన్నా తక్కువ ధరకే పాలను సేకరించుకోవాలి. దీని వల్ల ఏం జరుగుతుందో వేరే వివరించనక్కర్లేదు. హెరిటేజే అన్ని డైరీల కన్నా ఎక్కువ ధర చెల్లించినట్టు అవుతుంది, దీంతో పాలన్నీ ఆ సంస్థ క్యాన్లలోకే పడతాయి. ప్రస్తుతం పాలకు, పాల ఉత్పత్తులకు ఉన్న డిమాండ్‌ దష్ట్యా.. రైతులకు మరింత చెల్లిస్తూ పాలను సేకరించడానికి అనేక సంస్థలు సిద్ధంగా ఉన్నాయి. అదే జరిగితే.. ఒకదానికీ మరో దానికీ పోటీ ఏర్పడి రైతు బాగుపడతాడు. అయితే ఇలాంటి పోటీ మొదలైతే.. రైతులు బాగుపడటం మాటేమిటో కానీ, తమకు వచ్చే లాభాలు తగ్గిపోతాయనేది చంద్రబాబు నాయుడి కుటంబం లెక్క.. అనేది ఈ వ్యాపార పోకడలను గమనిస్తున్న వారు చెప్పే మాట.

తమకు లాభాలు తగ్గకుండా ఉండటానికి.. అధికారాన్ని అడ్డం పెట్టుకుని.. అన్ని డైరీలనూ అదుపు చేస్తూ పాల సేకరణ విషయంలో రైతులకు తీవ్రమైన నష్టాలను మిగులుస్తోందనే ఆరోపణలను ఎదుర్కొంటోంది చంద్రబాబు కుటుంబం. అయితే ఈ విషయంపై ఎవరూ నోరు విప్పే పరిస్థితి లేదని డైరీ వ్యాపారులు అంటున్నారు. అధికారంలో ఉన్న వారి దందాలకు అడ్డు చెబితే ఏం జరుగుతుందో... కొన్ని టీవీ ఛానళ్ల ప్రసారాలు ఆగిపోవడాన్ని చూస్తే అర్థం కావడం లేదా? అని పేరు చెప్పుకోవడానికి ఇష్టపడని ఒక డైరీ సంస్థ ప్రతినిధి పరిస్థితిని అంతా ఏకరువు పెట్టాడు. హెరిటేజ్‌ కన్నా ఎక్కువ ధరను చెల్లించి పాలను సేకరించకూడదు.. అనే అధికారిక ఉత్తర్వు ఎక్కడా ఉండదని, కానీ ఇదే నియమం ఈ పరిశ్రమలో గట్టిగా అమలవుతోందని.. దీన్ని చంద్రన్న పాల మాఫియాగా అభివర్ణించాడు ఆ ప్రతినిధి.

ఏ వ్యాపారాన్ని అయితే తాము చేస్తున్నామని.. దాని మీదే ఆధారపడి బతుకున్నామని చంద్రబాబు చెప్పుకొంటూ ఉంటాడో.. ఆ వ్యాపారాన్ని కూడా అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఆక్రమంగా సాగిస్తున్నారనే ఆరోపణ గట్టిగా వినిపిస్తోంది. వెనుకటికి.. చిత్తూరు జిల్లాలో సహకార డైరీలను ముంచేశాడనే బలమైన ఆరోపణ కూడా ఉంది చంద్రబాబు మీద. అలాగే.. ప్రస్తుతం కూడా లాభాల బాటన ఉన్న ప్రభుత్వ సహకార డైరీ తరపున కూడా రైతులకు సకాలంలో చెల్లింపులు చేయక, దానికి పాలు పోస్తున్న రైతులను హెరిటేజ్‌ బాట పట్టించేందుకు కూడా కుట్ర జరుగుతోందనే ఆరోపణలూ ఉన్నాయి. మరి కుటుంబ వ్యాపారాలను కాపాడుకోవడానికి బాబు ఇంతగా అధికార దుర్వినియోగం చేస్తున్నాడంటూ... రాయలసీమ పాల రైతులు చంద్రబాబుపై దుమ్మెత్తిపోస్తున్నారు!

Show comments