ఆ పత్రిక యజమాని ఏమో కొంత కాలం కిందట వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరాడు. గతంలో మంత్రిగా కూడా పనిచేసిన అనుభవం ఉన్న ఆయన తన తనయుడితో పాటు వైసీపీలో చేరాడు. ఆయన తనయుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున కాకినాడ మేయర్ అభ్యర్థి అనే ప్రచారమూ ఉంది. త్వరలోనే జరగనున్న మున్సిపల్ ఎన్నికలకు సదరు పత్రిక యజమాని తనయుడు ప్రిపేర్ అవుతున్నాడని తెలుస్తోంది.
మరి వారి రాజకీయాల సంగతలా ఉంటే.. వారి యాజమాన్యంలోని పత్రికలో మాత్రం బాబు భజన పతాక స్థాయికి చేరడం విశేషం! ఎంతలా ఉంటే.. ఇంకా రెండు నెలల తర్వాత ఎప్పుడో జరిగే అమెరికా అధ్యక్ష పదవీ ప్రమాణ స్వీకారానికి అప్పుడే బాబుకు ఆహ్వానం అందింది అని రాసుకునేలా! అసలు అమెరికా అధ్యక్ష ఎన్నికల పోలింగే ఇంకా జరగలేదు.. హిల్లరీ గెలుస్తుందా, ట్రంప్ గెలుస్తాడా? అనే అంశం గురించి.. అమెరికన్ మీడియానే భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తోంది. ప్రపంచ ప్రసిద్ధి చెందిన అమెరికన్ వార్తా సంస్థలు కూడా.. సర్వేలు చేయించుకున్నా… ఈ విషయంపై గట్టిగా అభిప్రాయాన్ని చెప్పలేకపోతున్నాయి.
అమెరికన్ మీడియాకు ఈ విషయంలో అంతుబట్టకపోయినా.. తెలుగు మీడియా మాత్రం హిల్లరీ గెలిచేసినట్టే.. ఆమెను బాబుగారే గెలిపించేస్తున్నారు.. హిల్లరీకి బాబుకు బంధుత్వం కూడా ఉన్నట్టే.. లోకేష్ బాబు, చెల్సియాల మధ్య అనురాగం ఉంది.. అంటూ ఏదేదో తోచినట్టుగా రాసుకుపోతోంది.
ఇంతజేసీ.. అలా రాసిన పత్రిక యొక్క యజమాని మాత్రం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత! ఇది మాత్రమే కాదు.. సదరు పత్రికలో తెలుగుదేశం భజన పీక్స్ కు చేరి చాలా కాలం అయ్యింది. మరి ఈ విషయాల గురించి వైకాపా అధినేతకు తెలుసునో లేదో! వైకాపా ఫ్యాన్సేమో ఆ పత్రిక యజమాని వైకాపాలో చేరగానే.. తమకు ఇంకో పత్రిక కలిసొచ్చిందని భావించారు. కానీ అందులోనేమో.. వాంతి వచ్చే రాతలు కొనసాగుతున్నాయి.
మరి తిప్పి తిప్పి కొట్టినా.. సదరు పత్రిక సర్క్యులేషన్ రోజూ ఐదారు వేలు ఉండదని.. జగన్ ఆంతరంగికులు కూడా ఈ వ్యవహారాన్ని లైట్ తీసుకున్నారేమో!