ప్రత్యేక హోదా గురించి డిమాండ్ చేసే హక్కు ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌కి లేదు..
భూ కుంభకోణంపై మాట్లాడే నైతిక హక్కు వైఎస్ జగన్‌కి ఎక్కడిది.?
అవినీతి గురించి జగన్ మాట్లాడటం హాస్యాస్పదం కాక మరేమిటి.?
పార్టీ ఫిరాయింపుల గురించి వైఎస్ జగన్ మాట్లాడితే అంతా నవ్విపోరా.?
ఇలా చెప్పుకుంటూ పోతే, అధికార పార్టీ నేతలు వైఎస్ జగన్ విషయంలో చాలా సందర్భాల్లో ఇలాంటి ప్రశ్నలు చాలా చాలానే వేస్తూ వస్తున్నారు. అక్రమాస్తుల కేసులో వైఎస్ జగన్ ఆరోపణలు ఎదుర్కొంటున్నంతమాత్రాన, వైఎస్ జగన్ ప్రతిపక్ష నేత అన్న విషయాన్ని అధికార పార్టీ నేతలు మర్చిపోతే ఎలా.?
నిజానికి, వైఎస్ జగన్ మీద అక్రమాస్తుల ఆరోపణలు వచ్చిన తర్వాత, ఆయన జైలుకు వెళ్ళి వచ్చిన తర్వాతే 2014లో ఎన్నికలు జరిగాయి. రాష్ట్ర ప్రజానీకం, తెలుగుదేశం పార్టీకి అధికారం కట్టబెడితే, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్షం హోదా ఇచ్చారు.
అసలంటూ, ప్రతిపక్షమంటే ఏంటి.? అన్న విషయం చంద్రబాబుకే బాగా తెలుసు. ఎందుకంటే, ఆయన పదేళ్ళు ప్రతిపక్ష నేతగా పనిచేశారు మరి. కానీ, ప్రతిపక్ష నేత ఏం మాట్లాడాలి.? ఏం మాట్లాడకూడదు.? అన్న విషయాల మీద చంద్రబాబుకే సరైన అవగాహన లేనట్టుంది.
ప్రతిపక్షం అంటే, ప్రభుత్వాన్ని ప్రశ్నించేది అని చంద్రబాబుకి ఎప్పటికి తెలుస్తుంది.? ఏమో, మళ్ళీ చంద్రబాబు ప్రతిపక్ష నేత హోదాలోకి వస్తే తప్ప ఆయనకి తెలిసిరాదేమో.!
2019 ఎన్నికల్లో పరిస్థితులు తారుమారై, జగన్ ఆశిస్తున్నట్లుగా ఆయన ముఖ్యమంత్రి అయితే, ప్రతిపక్ష నేతగా చంద్రబాబు మారితే.. అప్పుడు చంద్రబాబు పరిస్థితి ఎలా వుంటుంది.? అప్పుడూ పార్టీ ఫిరాయింపులుంటాయి.. అప్పుడూ అధికారపక్షం, ప్రతిపక్షాన్ని అణచివేయడం అంటూ జరుగుతుంది. చట్ట సభల్లో ఇప్పుడెలాగైతే ప్రతిపక్షానికి మాట్లాడే అవకాశాన్ని అధికారపక్షం ఇవ్వడంలేదో.. అప్పుడూ అదే జరగబోతోంది.
ఏ రాజకీయ నాయకుడైనా, ఏ పార్టీ అధినేత అయినా.. భవిష్యత్తుని కూడా దృష్టిలోపెట్టుకుని వ్యవహరించాలి. అధికారం వున్నప్పుడు విర్రవీగితే, అదికారం పోయాక తమ భవిష్యత్తు ఏంటన్నది ఆలోచించుకోవాలి.
విశాఖలో లక్ష ఎకరాల భూ కుంభకోణం జరిగిందని ప్రతిపక్షం ఆరోపిస్తున్నప్పుడు, ఆ ఆరోపణలపై సమాధానం చెప్పాల్సిందిపోయి.. అసలు ప్రశ్నించే నైతిక హక్కే లేదని అనడమేంటి.? పైగా, జగన్ విశాఖలో మహాధర్నా చేస్తే, దానికి వ్యతిరేకంగా టీడీపీ నేతలు ధర్నా చేస్తారట.. ఇదెక్కడి సంప్రదాయమో ఏమో.!
జగన్‌ని ఎలాగైనా విమర్శించొచ్చుగాక.. ప్రతిపక్షానికి, ప్రతిపక్ష నేతకు ప్రభుత్వాన్ని విమర్శించే నైతిక హక్కు లేదని అధికార పార్టీ పదే పదే మాట్లాడటమంటే, అసలిది ప్రజాస్వామ్యమా.? చంద్రబాబు మార్కు రాచరికమా.? రాచరికమే ప్రజాస్వామ్యమని చంద్రబాబు భావిస్తే.. ముందు ముందు ఇంకొకరి రాచరికంలో, చంద్రబాబు అండ్ టీమ్ పరిస్థితి ఎలా వుంటుందో ఏమో ఊహించుకోవడమే కష్టం కదా.!