చంద్రబాబు ప్రజాస్వామిక నాటకం...!

ఎవరైనా మనకు మేలు చేసినప్పుడు థాంక్స్‌, థాంక్యూ, థాంక్స్‌ ఎ లాట్‌...ఇలా వివిధ రకాలుగా చెబుతుంటాం. ఇదే రాజకీయ నాయకులు విడుదల చేసే పత్రికా ప్రకటనల్లో ధన్యవాదాలు, కృతజ్ఞతలు అని చెబుతుంటారు. ఇప్పుడు చినబాబు అంటే ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి కుమారుడు కమ్‌ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ తన తండ్రికి, పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యులకు ధన్యవాదాలు తెలియచేశారు. ఎందుకు? వారంతా తనకు మేలు చేశారు, తన కోరిక నెరవేర్చారు కాబట్టి.

వారు ఇలా చేయడం సహజమే. కాని ఈ పనేదో ఇప్పటికిప్పుడే జరిగినట్లు, అందుకు తాను చాలా సంతోషపడుతున్నట్లు ఆయన ధన్యవాదాలు తెలుపుతూ ప్రకటన విడుదల చేశారు. ప్రజాస్వామ్యం పేరుతో ఇలాంటి నాటకీయ కార్యక్రమాలు చేయడం రాజకీయ పార్టీల్లో మామూలే. తాజాగా జరిగిన టీడీపీ పొలిట్‌బ్యూరో సమావేశంలో నేతలంతా తర్జనభర్జనలు పడి, చర్చోపచర్చలు జరిపి లోకేష్‌ను త్వరలో జరగబోయే ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో శాసనమండలికి పంపాలని నిర్ణయించారు. సరే మంత్రి పదవి కూడా డిసైడైపోయిందనుకోండి.

లోకేష్‌ను ఎమ్మెల్సీ చేయాలనుకోవడం, మంత్రి పదవి ఇవ్వాలనుకోవడం ఏనాడో జరిగిపోయాయి. జనాలకు తెలిసిన విషయమే. కాని తనకు తానై చినబాబుకు నేరుగా పదవి ఇవ్వాలని నిర్ణయించుకోలేదని, పొలిట్‌బ్యూరో సమావేశంలో చర్చలు జరిపి నిర్ణయించారని, కాబట్టి తాను అంగీకరించానని చంద్రబాబు, తమ్ముళ్లు చెప్పుకోవడానికి ఈ తతంగం నడిపించారు. పొలిట్‌బ్యూరో టీడీపీలో అత్యున్నత విధాన నిర్ణయక వేదిక. కీలక నిర్ణయాలన్నీ దాంట్లోనే చేస్తారు. పార్టీ ముఖ్యమైన నిర్ణయం తీసుకున్నప్పుడు పొలిట్‌బ్యూరో దానికి ఆమోదముద్ర వేస్తుంది. ఇతర విషయాలేమోగాని లోకేష్‌ను చట్టసభలకు పంపుతానని, మంత్రి పదవి ఇస్తానని చంద్రబాబు అంటే పొలిట్‌బ్యూరో 'నో' అంటుందా? పార్టీ ఫిరాయింపుల విషయంలో ప్రజాజ్వామికంగా వ్యవహరించని చంద్రబాబు కుమారుడిని ఎమ్మెల్సీని చేసే విషయంలో మాత్రం తాను ప్రజాస్వామ్యాన్ని గౌరవించే వ్యక్తినని చెప్పుకునేవిధంగా వ్యవహరించారు. శాసన మండలి  సభ్యత్వం, రాజ్యసభ సభ్యత్వమంటే దొడ్డిదారిని చట్టసభల్లోకి ప్రవేశించడమే.

రాజకీయాలకు అతీతులైన, ప్రజల నుంచి ఎన్నిక కాలేని విజ్ఞలైన పెద్దలు, వివిధ రంగాల నిపుణలు కూడా చట్టసభల్లో ఉంటే మంచిదనే ఉద్దేశంతో రాజ్యాంగ నిర్మాతలు శాసనమండలిని, రాజ్యసభను ఏర్పాటు చేశారు. అందుకే దీన్ని 'పెద్దల సభ' అన్నారు. కాని కాలక్రమంలో ఈ సభల్లో డబ్బులో పెద్దోళ్లు, పెద్దోళ్ల వారసులైన చిన్నోళ్లు, అధికార పార్టీకి ఇష్టులు..ఇలా నానా జాతుల వారు చేరుతున్నారు. వాస్తవానికి లోకేష్‌ను అర్జంటుగా ఎమ్మెల్సీని చేసి మంత్రి పదవి ఇవ్వకపోయినా వచ్చే నష్టం లేదు. 2019 ఎన్నికల్లో పోటీ చేయించి టీడీపీ అధికారంలోకి వచ్చినట్లయితే మంత్రిని చేయొచ్చు. కాని పక్క రాష్ట్రం తెలంగాణలో సీఎం కేసీఆర్‌ కుమారుడు కేటీఆర్‌ రాష్ట్రం ఏర్పడగానే మంత్రి అయ్యారు. చంద్రబాబుకు, తమ్ముళ్లకు ఇది బాధగానే ఉంది. అనుభవం లేని కేటీఆర్‌ మంత్రి అయినప్పటికీ సమర్థుడిగా పేరు తెచ్చుకున్నారు. ఆయన పనితీరులో టాలెంట్‌ కనబడుతోంది. కేటీఆర్‌ కంటే లోకేష్‌ ఎందులో తక్కువ? అనేది టీడీపీ నాయకులు వేసుకున్న ప్రశ్న. కేటీఆర్‌ను మంత్రిని చేసిన కారణంగా పార్టీ విజయాలకు బాగానే దోహదం చేశారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు బంపర్‌ మెజారిటీ సాధించిపెట్టారు. దీంతో కేసీఆర్‌ ఆయనకు మున్సిపల్‌ శాఖనూ కట్టబెట్టారు.

లోకేష్‌కూ మంత్రి పదవి ఇచ్చినట్లయితే వచ్చే ఎన్నికల్లో అది పార్టీకి ప్రయోజనకరంగా ఉంటుందని, రాష్ట్రాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తాడనే అభిప్రాయం టీడీపీ నాయకులకు ఉంది. అసలు లోకేష్‌ను కేంద్ర మంత్రివర్గంలో చేర్చి (రాజ్యసభకు పంపడం ద్వారా) ఆ హోదాతో తెలంగాణలో పార్టీని పటిష్టం చేయాలని, తెలంగాణ సర్కారు మంత్రిగా ఆయన్ని గౌరవించే పరిస్థితి ఉంటుందని కొందరు నాయకులు బాబుకు చెప్పారు. మరికొందరు చినబాబును ఎమ్మెల్యే చేయాలని, అందుకోసం తాము రాజీనామా చేస్తామని అన్నారు. కాని చివరకు ఇలా డిసైడైంది.

తన శక్తిసామర్థ్యాలపై నమ్మకం ఉంచి తనను ప్రతిపాదించినందుకు లోకేష్‌ బాబుకు, పొలిట్‌బ్యూరోకు ధన్యవాదాలు తెలిపారు. ప్రజలకు సేవ చేసేందుకు సిద్థంగా ఉన్నానన్నారు. సమర్థత సంగతి ఎలాఉన్నా తండ్రి మార్గదర్శకత్వంలో పనిచేయడం ఆయనకు సులభంగానే ఉంటుంది.

Show comments