ఉన్నది ఉన్నట్లుగా - రాజధాని కార్డు

తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి పదవి మరోసారి చేపట్టి మూడేళ్లవుతోంది. ఎన్నికల ముందు వాగ్దానాలు చాలా వుండొచ్చు. ఎన్నికల తరువాత చేసిన పనులు ఎన్నో కొన్ని వుండొచ్చు. కానీ చంద్రబాబు అధికార సాధన మంత్రంగా మాత్రం 'అమరావతి నిర్మాణం' అన్నదే కనిపిస్తోంది. వినిపిస్తోంది.

ఎన్నికల ముందు రాజధాని లేకుండా చేసారు, మనకంటూ సరైన రాజధాని నిర్మించాలంటే అనుభవం కావాలి అన్న పాయింట్ ను బలంగా జనాల్లోకి తీసుకెళ్లడంతో తెలుగుదేశం పార్టీ, దాని అనుకూల మీడియా విజయం సాధించాయి. జనం కూడా నిజమే కదా అనుకున్నారు. అలా అనుకోవడానికే ఆస్కారం వుంది కూడా. అదే కనుక చంద్రబాబు అప్పుడే, 'నేను రాజధాని అమరాతి దగ్గర కడతా... దానికి భూములు ఇలా సేకరిస్తా, దాన్ని ఇలా ఎగ్జిక్యూట్ చేస్తా', అని వివరంగా చెప్పివుంటే పరిస్థితి వేరేగా వుండేది. సరే, అయిందేదో అయింది.

ఇప్పుడు మళ్లీ ఎన్నికలు వస్తున్నాయి. ఇవ్వాళ కాకుంటే ఏణ్ణర్థం తరువాత. కానీ ఇప్పటికీ ఇంకా చంద్రబాబు నాయుడు కానీ ఆయన అనుకూల మీడియా కానీ అమరాతి కార్డునే ఎన్నికల ట్రంప్ కార్డుగా వాడేందుకు ప్రయత్నిస్తున్నాయి. నిజానికి నిన్న మొన్నటి వరకు అభివృద్ధిని, ఇది చేసాం, అది చేసాం అని ఎంత చెప్పినా, అది పెద్దగా జనాల్లోకి వెళ్లలేదు. కానీ అదే సమయంలో తెలుగుదేశం ప్రభుత్వం వచ్చాక అవినీతి పెరిగిపోయింది అన్నది జనాల్లోకి బాగా వెళ్లిపోయింది.

అవినీతి విశ్వరూపం

స్మార్ట్ సిటీగా నెంబర్ వన్ కాదు, విశాఖ అవినీతిలో కూడా నెంబర్ వన్ అని మిత్రపక్షం భాజపానే కితాబిచ్చింది. విజయవాడ దగ్గర నుంచి విశాఖ దాకా అవినీతి వార్తలు వెల్లువెత్తాయి. దీంతో పాలకపక్షం ఏసీబీనీ ఉసిగొలిపి, అవినీతి అధికారుల భరతం పట్టడం ప్రారంభించింది. మూడేళ్లుగా తింటున్న నాయకులను వదిలేసి, ఉద్యోగస్థులనే టార్గెట్ చేస్తున్నారని గుసగుసలు మొదలయ్యాయి. దాంతో అసలే డీఏలు అందక అసంతృప్తితో వున్న ఉద్యోగులు దూరమయ్యే ప్రమాదం దాపురించింది. దాంతో దానికి కాస్త గ్యాప్ ఇచ్చారు.

మరోపక్క నంద్యాల ఉపఎన్నిక ప్రమాదం ముంచుకు వచ్చింది. నియోజకవర్గాల పెంపు అన్నది లేకపోతే, పరిస్థితి ఎలా వుంటుందో చిన్న ఉదాహరణ చూపిస్తోంది. ఇలా అన్ని విధాలా ఉక్కిరి బిక్కిరి అవుతున్న అధికార పక్షానికి ఇంక ఇఫ్పుడు మరోదారి దొరకడంలేదు.

సెంటిమెంట్ కార్డ్

తెలంగాణలో కేసీఆర్ తరచూ సెంటిమెంట్ అస్త్రం బయటకు తీస్తున్నట్లు, ఇప్పుడు చంద్రబాబు రాజధాని అస్త్రాన్ని బయటకు తీస్తున్నారు. రాజధాని నిర్మాణం 2019 నాటికి కనీసం ఎంతోకొంత కనిపించకపోతే జనం ఇక 'అనుభవం' ఇంతేనా అనుకునంటారు. అందుకే తన తప్పులేదు, ప్రతిపక్షం అడ్డం పడుతోంది అన్న కలరింగ్ ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నారు.

తప్పుడు మెయిళ్లు ఇస్తున్నారని, కావాలని కుట్ర చేస్తున్నారని, వాళ్లపై కేసులు పెడతామని అంటున్నారు. రాజధాని నిర్మాణానికి కేంద్రం నిధులు ఇవ్వాల్సి వుంది. ప్రపంచ బ్యాంకు కూడా ఇవ్వనని అనడంలేదు. తన దృష్టికి ఎవరో తీసుకువచ్చిన విషయాలు నిజమో కాదో తెలుసుకోవాలనుకుంటోంది. 

ఆ మాత్రం దానికి ఉలిక్కి పడడం దేనికి? అంటే రాజధాని నిర్మాణ పక్రియలో ప్రపంచ బ్యాంక్ నిబంధనలను పాటించడం లేదా? పోనీ వదిలేయండి. బ్యాంక్ ఇస్తుందనే నిర్మాణానికి దిగలేదు కదా? అదీ కాక, వేలాది ఎకరాలు తెచ్చి, ఎవరికి పడితే వాళ్లకు తమ చిత్తానికి ఇచ్చుకుంటూ పోతున్నారు. అసలు భూములు సేకరించింది దేనికి? చేస్తున్నది ఏమిటి? ఇదంతా రాజధాని కార్డ్ ను అలా సజీవంగా వుంచే ప్రయత్నం చేయడం ప్రారంభించారు.

జనం నమ్ముతారా?

సరే, జనం దృష్టి మరలించడం కోసమో, లేదా మరోసారి అధికారం ఇవ్వాల్సిందే, లేదూ అంటే రాజధాని సాధ్యంకాదు అని చెప్పడం కోసమో బాబు అండ్ కో ఇలాంటి ప్రచారానికి దిగితే దిగి వుండొచ్చు. కానీ జనం నమ్ముతారా అన్నది అనుమానం. ఎందుకంటే రాజధాని వ్యవహారం 2014 నాటికి రాష్ట్రం అంతటికీ పట్టింది. ఇప్పుడు రాయలసీమ వాసులకు, ఉత్తరాంధ్ర వాసలకు అస్సలు పట్టని వ్యవహారం. కేవలం దక్షిణ కోస్తాకు మాత్రమే పరిమితమైపోయింది. 

దానికి తోడు రాజధాని అంటే కావాల్సిన భవనాలు నిర్మించి, సదుపాయాలు కల్పించే దిశగా వెళ్లకుండా, ముందుగా వివిధ సంస్థలకు స్థలాలు ఇవ్వడం, రియల్ ఎస్టేట్ వ్యాపారానికి తెరతీయడం వంటి వ్యవహారాలు జరుపుతున్నారు. ఇవన్నీ జనం గమనిస్తూనే వున్నారు. జనం 2014 నాడు రాజధాని అంటే అనుకున్నది వేరు, ఇప్పుడు బాబు చేస్తున్నది వేరు.

దాంతో జనాలకు రాజధాని మీద ఆసక్తి పోయింది. ఇది వాస్తవం. రాజధాని రెడీ అవుతుంది, మనకు ఉపాధి, వ్యాపార అవకాశాలు వస్తాయి అన్న ఆలోచన జనాలకు లేదు. ఆ ఆలోచన ఎవరికన్నా వుందీ అంటే కేవలం కృష్ణా, గుంటూరు జిల్లాల వారికి మాత్రమే. అందువల్ల మరోసారి రాజధాని సెంటిమెంట్ రాజేయడం వల్ల బాబు అండ్ కోకు ఏమన్నా ఒరిగేది వుంటుందా అన్నది అనుమానమే.

సర్వేలు బాబూ సర్వేలు

మరోపక్క ఎన్నికలు దగ్గరకు వస్తున్న కొద్దీ సర్వేశ్వరులకు పని పెరిగిపోయింది. ఎవడి పంచాంగం వాడిది అన్నట్లుగా ఎవడి సర్వే వాడిది. కానీ అధికారపక్షం తనంతట తాను చేయించుకుంటున్న సర్వేలు కాస్త కలవరం కలిగిస్తున్నాయన్నదే రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నది. 

అధికారపక్షంలో కుమ్ములాటలు, అవినీతి, ప్రభుత్వ ఉద్యోగుల్లో పెరుగుతున్న అసంతృప్తి, కాపులు, బీసీల వ్యవహారాలు అన్నీ కలిసి జనాల్లో అధికారపక్షం ఓట్ల శాతానికి కన్నం పెట్టడం ప్రారంభమైంది అన్నది ఆ సర్వేల సారాంశం. పైగా కాంగ్రెస్ పార్టీని జనం కాస్త కనికరిస్తున్నారని బాబే చెప్పారు. కాంగ్రెస్ ఓటుబ్యాంక్ 10శాతం పెరిగింది అంటున్నారు.

కానీ అదికాదు కీలకం. పార్టీని క్షమించినా, క్షమించకపోయినా, ఆ పార్టీ నాయకులు మెల్లగా జనంలో తిరగడం ప్రారంభమయింది. కాంగ్రెస్ వదిలి దేశంలోకో, వైకాపాలోకో వచ్చిన కాంగ్రెస్ నాయకులు అందరూ బాగానే తిరుగుతున్నారు. దీంతో మిగిలిన వారు కూడా జంప్ చేయడానికి అవకాశం చూసుకుంటున్నారు. తెలుగుదేశం పార్టీలో అందుకు చాన్స్ లేదు. సో, వాళ్లు వైకాపాలోకి వెళ్తే..? 

దేశవ్యాప్తంగా జరిగింది అని తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా చెబుతున్న సర్వేలో తేడా వున్న ఓట్లశాతం ఏడు మాత్రమే. కానీ అదే సర్వేలో తటస్థ ఓటర్లు పదిశాతం వున్నారు. పైగా ఆ సర్వే అన్నది భాజాపాతో పొత్తు వుంటేనే. అదే లేకపోతే? అందుకే ఇప్పటి నుంచే భాజపా-తేదేపా పొత్తును ఖరారు చేసినట్లే తెలుగుదేశం అనుకూల మీడియా ప్రవర్తిస్తోంది.

వెంకయ్య నాయుడు లాంటి హితైషులు వున్నందున పొత్తుకు ఇబ్బంది రాదనే అనుకుందాం? మరి అలాంటపుడు జనసేన పరిస్థితి? పోనీ దాన్నీ ఏదో విధంగా కలిపేసుకుంటారు అనుకుందాం? మరి మైనారిటీ ఓటు బ్యాంక్? నోట్లరద్దు కష్టాలు. రైతులు ఈ నోట్ల రద్దుతో పడుతున్న పాట్లు? ఇవన్నీ సమస్యలే. 

వీటన్నింటికీ సంజీవినీలా పనికి వస్తుంది రాజధాని మంత్రం అనుకుంటోంది అధికారపార్టీ. కానీ, ఇప్పుడు రెండు జిల్లాలు మినహా మిగిలిన జిల్లాల జనాలకు రాజధాని మీద ఒక్కశాతం కూడా ఆసక్తి లేదు అన్నది వాస్తవం. ఆ సంగతి ముందు బాబు అండ్ కో తెలుసుకోవాలి.  అప్పుడు వేరే ఎత్తుగడ వేసుకునే అవకాశం వుంటుంది.

-ఆర్వీ

Show comments