బాబూ...అవాక్కయక్యారా? టాలీవుడ్ అంతే!

చంద్రబాబు అవాక్కయ్యారట. అర్జెంట్ గా దీని వైనం ఏమిటో కనుక్కోమని పార్టీ కీలక బాధ్యులను ఆదేశించారట. ఇదంతా నిన్నటికి నిన్న జరిగిన సంగతి. టాలీవుడ్ జనాల సంగతి చంద్రబాబుకు తెలియంది కాదు. బాబుగారు దిగిపోయి రాజశేఖర్ రెడ్డి సిఎమ్ అయిన తరువాత మెల మెల్లగా ఆయన వైపు తిరిగారు. మళ్లీ రాజశేఖర్ రెడ్డి పోయాక బాబు వైపు తిరిగారు. టాలీవుడ్ జనాల్లో సగానికి పైగా జనాలకు సామాజిక వర్గ బంధాలు వుంటాయి. అందువల్ల వారు బాబుతోనే వుంటారు అని జనాలు ఏనాడో ఫిక్సయిపోయారు. అందుకు తగ్గట్టే చాలా మందికి తెలుగుదేశంతో అనుబంధాలు వున్నాయి. 

కానీ ఇటీవల ఎప్పుడైతే రాష్ట్రం రెండు ముక్కలయిందో, అప్పుడు టాలీవుడ్ జనాలు కేటిఆర్ , కేసిఆర్ ల వైపు తిరగడం ప్రారంభించారు. బాబు అనుకూల మీడియాకు రెండు ఎడిషన్లు వున్నాయి కాబట్టి, రెండు చోట్ల రెండు బాకాలు పట్టుకుని ఊదడం ప్రారంభించింది. అందువల్ల నో ప్రాబ్లమ్. ఈ బాకా వారికి వినపడదు..ఆ బాకా వీరికి వినపడదు. సో మీడియాకు సమస్య లేదు. 

కానీ టాలీవుడ్ లో అందరికీ ఆ తెలివితేటలు లేవు. కొందరు అటు ఇటు కూడా మేనేజ్ చేయగలుగుతున్నారు. మిగిలిన వారు మాత్రం బాబు వంక చూడడం మానేసారట. ఇది ఇప్పటిదాకా పెద్దగా పట్టించుకోలేదు కానీ, నిన్నటికి నిన్న మాత్రం పార్టీ కీలక సమావేశంలో బాబు గారు కాస్త సీరియస్ గా మాట్లాడినట్లు వినికిడి. 

ఇంతకీ అసలు సంగతి ఏమిటంటే, హరిత హారం అంటే తెలంగాణ రాష్ట్రం హడావుడి చేస్తే టాలీవుడ్ జనాలు అంతా పదులు సంఖ్యలో జనాలను, కార్లను, మీడియాను చుట్టూ పెట్టుకుని, ఎవరో తవ్విన గోతిలో ఓ మొక్కనాటి హమ్మయ్య, మేము సైతం మొక్కనాటాం అని అనిపించారు. కానీ అదే చంద్రబాబు కూడా కోటి మొక్కలు నాటడం అనే హడావుడి చేస్తే ఒకరిద్దరు తప్ప వేరెవరు ఆంధ్రకు వెళ్లి ఎక్కడన్నా ఓ మొక్కనాటిన పాపాన పోలేదు.

ఈ వైనం అలా వుంచితే కృష్ణ పుష్కరాల సందర్భంగా చంద్రబాబు పని గట్టకుని ఓ మంత్రిని మరి కొంతమందిని పురమాయించి, చాలా మంది సినిమా జనాలకు పుష్కర స్నానానికి రండీ అంటూ పిలుపులు అందించారు. మగ ఆహ్వానితులు కాబట్టి, పాపం బొట్టు పెట్టలేదు కానీ, మిగతా అంత పనీ చేసారు. కానీ ఏ ఒక్క నటుడు కూడా పుష్కరానికి వచ్చిన దాఖలా లేదు. ఇదే చంద్రబాబు చాలా అసంతృప్తి మిగిల్చిందట. పుష్కరాలు ఇంకా రెండు, మూడు రోజులు వున్నాయి. అయితే సెలవులు ఏవీ లేవు.

ఇలాంటపుడు సినిమా నటులు వస్తే కాస్త ప్రచారం, మరి కాస్తే క్రేజ్ వస్తుంది. అందువల్ల ఇప్పటికైనా ఎవరైనా వస్తారేమో ఫాలో అప్ చేయమని, వస్తామంటే ఏర్పాట్లు చేయమని బాబుగారు పార్టీ జనాలను ఆదేశించారట. మరి కృష్ణలో మునిగేందుకు ఎవరయినా కదుల్తారో లేదో?

Show comments