కౌంట్ డౌన్ మొదలయ్యింది.. జులై 19వ తేదీన, తెలంగాణ ఎక్సయిజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ 'సిట్' యెదుట ప్రముఖ దర్శకుడు పూరిజగన్నాథ్, డ్రగ్స్ కేసులో విచారణకు హాజరు కావాల్సి వుంటుంది. ఆ రకంగా ఫస్ట్ ఛాన్స్ పూరిజగన్నాథ్‌కే దక్కిందన్నమాట. తెలంగాణని, 'విశ్వనగరం' హైద్రాబాద్‌నీ కుదిపేసిన డ్రగ్స్ రాకెట్ చిత్ర విచిత్రంగా కార్పొరేట్ విద్యా రంగం నుంచి సినీ రంగం వైపుకు 'టర్న్' తీసుకుంది. దాంతో, సినీ ప్రముఖులు అడ్డంగా బుక్కయిపోయారిప్పుడు.
19వ తేదీన పూరిజగన్నాథ్ విచారణకు హాజరు కానుండగా, ఆ తర్వాత ఛాన్స్ హీరోయిన్ ఛార్మికి దక్కిందట. ఆమెకు 20వ తేదీన 'అపాయింట్‌మెంట్' ఖరారయ్యింది. ముమైత్ ఖాన్ (జులై 21), సుబ్బరాజు (జులై 22), కెమెరామెన్ శ్యాం కె నాయుడు (జులై 23) హాజరు కానున్నారట. రవితేజ 24న సిట్ విచారణను ఎదుర్కోవాల్సి వుంటుంది. ఆర్ట్ డైరెక్టర్ చిన్నా 25న, నవదీప్ 26న, తరుణ్ 27న, తనీష్, నందులకు 28వ తేదీన విచారణ తప్పదట. ఇప్పటికే, ఆయా వ్యక్తులకు నోటీసులు కూడా అందాయి.
అయితే, పైన పేర్కొన్న వ్యక్తుల్లో కొంతమంది తమకు అసలు నోటీసులే అందలేదని నిన్న మొన్నటిదాకా చెప్పుకుంటూ వచ్చారు. తనీష్, నందు తమకు నోటీసులు అందలేదని చెబితే, నవదీప్, సుబ్బరాజు మాత్రం తమకు నోటీసులు అందాయని చెప్పారు. పూరి, ఛార్మి నోటీసులపై స్పందిచలేదు. ముమైత్ తనకు నోటీసులు అందలేదంటూ మీడియాకి క్లాస్ తీసుకున్న విషయం విదితమే.
మొత్తమ్మీద, డ్రగ్స్ కేసులో విచారణ సందర్బంగా సినీ ప్రముఖులకు ఎలాంటి ప్రశ్నలు ఎదురవుతాయో, విచారణ తర్వాత పరిణామాలు ఎలా మారతాయో వేచి చూడాల్సిందే.