'బాహుబలి' - వెయ్యి కోట్లు ఎలాగంటే.!

'బాహుబలి' - ది కంక్లూజన్‌తో సినిమాగా ముగిసింది. 'బాహుబలి ది కంక్లూజన్‌' వెయ్యి కోట్ల రూపాయల వసూళ్ళ మార్కుని చేరుకుంది. వెయ్యి కోట్లు.. బట్‌ నాటౌట్‌. అవును, వెయ్యి కోట్లకు మించి 'బాహుబలి ది కంక్లూజన్‌' క్రియేట్‌ చేయబోయే సరికొత్త బెంచ్‌ మార్క్‌ ఎలా వుండబోతోందో రానున్న రోజుల్లో తెలుస్తుంది. 

'వెయ్యి కోట్లు లక్ష్యం..' అని 'బాహుబలి ది కంక్లూజన్‌'కి ముందు సినిమా యూనిట్‌ చెబుతోంటే, 'అదెలా సాధ్యం.?' అని అంతా ముక్కున వేలేసుకున్నారు. 'ఇదిగో ఇలా సాధ్యం..' అని ఇప్పుడు 'బాహుబలి ది కంక్లూజన్‌' నిరూపించింది. టాలీవుడ్‌, కోలీవుడ్‌, బాలీవుడ్‌.. ఇలా ఎక్కడా, సినిమా మీద నెగెటివ్‌ కామెంట్స్‌ పెద్దగా లేవు. వసూళ్ళ విషయంలో అసలు వివాదమే లేదు. వంద కోట్లు, రెండొందల కోట్లు, మూడొందల కోట్లు, ఐదు వందల కోట్లు.. ఇలా లెక్క పెరుగుతూనే వుంది. ఇప్పుడది 'వెయ్యి కోట్ల'ను టచ్‌ చేసింది. ఈ మార్క్‌ అందుకున్న తొలి తెలుగు సినిమా. ఆ మాటకొస్తే, ఇదే ఈ మార్క్‌ అందుకున్న తొలి ఇండియన్‌ సినిమా కూడా.! 

ముందుగా, తెలుగు సినిమాకి ఇంతటి ఫనతను తీసుకొచ్చినందుకు దర్శక ధీరుడు రాజమౌళికి, తెలుగువారంతా 'సాహోరే.. రాజమౌళీ..' అనాల్సిందే. ఆ తర్వాతి క్రెడిట్‌ నిర్మాతలది. రాజమౌళి నమ్మి, ఇంతటి బడ్జెట్‌ పెట్టడమంటే చిన్న విషయం కాదు. ఆ తర్వాతి క్రెడిట్‌ నటీనటులది, ఇతర టెక్నీషియన్లదీ. ప్రభాస్‌, అనుష్క, రానా, తమన్నా, సత్యరాజ్‌, రమ్యకృష్ణ.. ఇలా ఎవరికి వారే. ఆయా పాత్రల్లో ఒదిగిపోవడం, జీవించడం వేరు.. సినిమా కోసం ప్రాణం పెట్టేశారు. ఇక్కడ, ప్రత్యేకించి రాజమౌళి కుటుంబం గురించి కూడా ప్రస్తావించాలి. రమా రాజమౌళి, కీరవాణి, వల్లి.. ఇలా ఒకరేమిటి.? 'బాహుబలి' విషయంలో వారి కృషి చాలా చాలా ప్రత్యేకం. 

ఇక, 'బాహుబలి' సినిమాలో ఎంత మేటరుంటుందో ముందే ఊహించాడు బాలీవుడ్‌ నిర్మాత కరణ్‌ జోహార్‌. అందుకే, మార్కెటింగ్‌ని పక్కాగా ప్లాన్‌ చేశాడు. హిందీ సినిమాలకి ధీటుగా 'బాహుబలి ది కంక్లూజన్‌'ని హిందీలో విడుదల చేశాడాయన. ఆ మార్కెట్‌ స్ట్రాటజీ పక్కాగా వర్కవుట్‌ అయ్యింది. అన్నీ కలిసొచ్చి.. ఇదిగో, ఇప్పుడిలా ప్రపంచ వ్యాప్తంగా మొత్తం 1000 కోట్లు వసూళ్ళు చేసి, 'బాహుబలి ది కంక్లూజన్‌' సరికొత్త రికార్డుని నెలకొల్పింది. 

ఏది ఏమైనా, 'బాహుబలి' మన తెలుగు సినిమా. మన తెలుగు సినిమా సత్తాని ప్రపంచానికి చాటి చెప్పిన సినిమా. మొత్తం 'బాహుబలి' టీమ్‌కి మనమంతా 'సాహోరే..' అనాలిప్పుడు.

Show comments