తెలుగోడిగా పుట్టడం ఆయన దురదృష్టం....!

దర్శకుడు త్రివిక్రమ్‌ ఓ సినిమా ఫంక్షన్‌లో గేయ రచయిత సిరివెన్నెల సీతారామ శాస్త్రి గురించి మాట్లాడుతూ ఆయన తెలుగువాడిగా పుట్టడం ఆయన దురదృష్టం..మన అదృష్టం అన్నారు. అంటే ఇతర రాష్ట్రంలోనో, దేశంలోనే పుట్టుంటే గొప్పగా గుర్తింపు వచ్చేదని అర్థం. అయితే జాతీయ పతాక రూపశిల్పి పింగళి వెంకయ్య తెలుగోడిగా పుట్టడం కచ్చితంగా ఆయన దురదృష్టమే. అందులో సందేహం లేదు. ఎందుకు? ఆయన ఎవరో దేశ ప్రజలకు (చరిత్రకారులకు తప్ప) తెలియదు కాబట్టి. గత డెబ్బయ్‌ ఏళ్లుగా ఏ ప్రభుత్వమూ గుర్తించలేదు కాబట్టి. 

ఇక పింగళి వెంకయ్య తెలుగోడిగా పుట్టడం మన అదృష్టమని తెలుగు పాలకులు, నాయకులు అనుకోవడంలేదు కాబట్టి. దేశానికి స్వాతంత్య్రం వచ్చి డెబ్బయ్‌ ఏళ్లయిందని మురిసిపోయిన నాయకులు, పాలకులు దేశవ్యాప్తంగా జెండా పండుగ ఘనంగా నిర్వహించారు. నరేంద్ర మోదీ సర్కారు దేశభక్తిని ప్రజ్వలింపచేసింది. కొన్నిచోట్ల కిలోమీటర్ల పొడవైన తిరంగా జెండాలను ప్రదర్శించి దేశభక్తిలో తమకు సాటిలేదనిపించుకున్నారు. సాధారణంగా 75 ఏళ్లకు జరిపే ఉత్సవాలకు ఓ ప్రత్యేకత ఉంటుంది. పాతికేళ్లు, యాభై ఏళ్లు, డెబ్బయ్‌ఐదేళ్లు, వందేళ్లు ....ఇలా ఈ సందర్భాల్లో ఏ ఉత్సవాలైనా ఘనంగా నిర్వహిస్తుంటారు. 

కాని మోదీ సర్కారు 70 ఏళ్ల సందర్భంలోనే బాగా హడావుడి చేసింది. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు నిండినప్పుడు తాను అధికారంలో ఉండే అవకాశం ఉండకపోవచ్చుని మోదీ భావించినట్లుగా ఉంది. అందుకే ఎక్కువ హడావుడి చేశారేమో...! ఏది ఏమైనా స్వాతంత్య్ర దినోత్సవాన్ని ఘనంగా చేయడం అభినందనీయం. కాని 70 ఏళ్ల క్రితం దేశం స్వాతంత్య్రం పొందిన సందర్భంలో సగర్వంగా అంబరాన్ని తాకిన మువ్వన్నెల పతాకం రూపశిల్పిని దేశం మర్చిపోవడం దురదృష్టం కాక మరేమిటి? ఏ విదేశంలోనూ పతాక సృష్టికర్తకు ఇలాంటి దుస్థితి ఉండకపోవచ్చు. 

పింగళి వెంకయ్యను దేశం గుర్తు పెట్టుకోలేదనే విషయం ఇప్పుడు కొత్తగా చెప్పుకోవల్సిందేమీ కాదు. స్వాతంత్య్రం వచ్చిన కొందకాలానికే ఆయన పేరు మరుగునపడిపోయింది. కారణం...తెలుగోడిగా పుట్టడమే కాకుండా తెలుగువాళ్లు పట్టించుకోకపోవడం. తెలుగోళ్లు ఎప్పుడైనా ఇతర రాష్ట్రాలవారిని, దేశాలవారిని గుర్తుపెట్టుకుంటారు. గుర్తిస్తారు. కాని మనవాళ్లను పట్టించుకోరు. తెలుగు రాష్ట్రాల్లో  మహాత్మాగాంధీ, నెహ్రూ, వల్లభాయ్‌పటేల్‌, ఇందిరాగాంధీ, రాజీవ్‌ గాంధీ, అంబేద్కర్‌, పూలే...ఇలాంటివారి విగ్రహాలు కోకొల్లలుగా ఉన్నాయి. వారి విగ్రహాలు ఉండొద్దని అర్థం కాదు. 

కాని వారి విగ్రహాలతో పోలిస్తే 'తెలుగు మహానుభావులు, మహామహులు' విగ్రహాలు ఎన్నున్నాయి? తెలుగువారి పేర్లు ఎన్ని సంస్థలకున్నాయి? 1998 వరకు రాష్ట్రంలో (ఉమ్మడి) వెంకయ్య విగ్రహం కూడా లేదు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రముఖ ఆంగ్ల పత్రిక 'లైవ్‌ మింట్‌' పింగళి వెంకయ్య మీద రాసిన వ్యాసాన్ని మన తెలుగు నాయకుల్లో, పాలకుల్లో ఎంతమంది చదివారో తెలియదు. 'వెంకయ్య గురించి దేశ ప్రజల్లో చాలా తక్కువమందికి మాత్రమే తెలుసు' అని ఆ పత్రిక పేర్కొంది. నిజమే...! తెలిసిన ఆ తక్కువమందైనా పాతతరం వారు, చరిత్రను అధ్యయనం చేసినవారై ఉంటారు. 

అంతర్జాతీయ క్రికెట్‌ మ్యాచ్‌ల్లో ఇండియా గెలిస్తే ఒక దృశ్యం మనకు తప్పనిసరిగా కనబడుతుంది. మ్యాచ్‌ గెలవగానే మన క్రీడాకారులు జాతీయ పతాకాన్ని చేత పట్టుకొని కేరింతలు కొట్టుకుంటూ, ఆనందంతో మైదానం చుట్టూ తిరుగుతుంటారు. కాని వారికి దాని రూపశిల్పి ఎవరో తెలియదు. ప్రస్తుతం ఇతర రాష్ట్రాల వారికి కూడా తెలిసిన తెలుగు నాయకుడు వెంకయ్య నాయుడు. ఎందుకు? ఆయన ఓ జాతీయ పార్టీకి చెందిన సీనియర్‌ నాయకుడే కాకుండా, కేంద్ర మంత్రి కూడా. పింగళి వెంకయ్య గొప్ప విద్యాధికుడు, నిజమైన గాంధేయవాది, నిరాడంబరుడు, సృష్టికర్త. 

ప్రజలు రాజకీయ నాయకులను గుర్తుపెట్టుకున్నంతగా సృష్టికర్తలను ఎందుకు గుర్తు పెట్టుకుంటారు? 1964లో వెంకయ్య పేదరికంలో మగ్గుతూ ఓ పూరిగుడిసెలో మరిణించారని మరో ఆంగ్ల పత్రిక రాసింది. దేశానికి సేవ చేస్తున్నామని డబ్బా కొట్టుకునే ఏ నాయకుడైనా ఇలాంటి స్థితిలో మరణిస్తున్నాడా? భారత ప్రభుత్వం వెంకయ్య స్మారకార్థం ఒక పోస్టల్‌ స్టాంపు విడుదల చేయడం తప్ప మరే పనీ చేయలేదు. పింగళికి 'భారతరత్న' ఇవ్వాలన్న ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వ సిఫార్సును కేంద్రం పట్టించుకోలేదు. ఇక మరెప్పుడూ ఆ ప్రయత్నం చేయలేదు.  

'వెంకయ్య ఏ గౌరవాల కోసం అర్రులు చాచలేదు' అని మింట్‌ రాసింది అక్షరాల నిజం. ''నేనింతా ఒక పిడికెడు మట్టే కావొచ్చు...కాని కలమెత్తితే ఒక దేశపు జెండాకున్నంత పొగరుంది''...అన్నారు ప్రముఖ కవి గుంటూరు శేషేంద్ర శర్మ. ఇక్కడ పొగరు అంటే సార్వభౌమాధికారమని అర్థం. ఆ అధికారం ఉంది కాబట్టే ప్రధాని మోది తన ప్రసంగంలో పాకిస్తాన్‌ను తీవ్రంగా హెచ్చరించారు. మనుషులు మరణించి బూడిదగా మారినా దేశం జెండా శాశ్వతం. ఆ శాశ్వతత్వానికి ప్రాణం పోసినవాడు పింగళి వెంకయ్య. 

Show comments