ఫలితం అలా వస్తే.. బాబు ప్రభుత్వానికి కౌంట్‌ డౌనే!

ఏపీలో ఎక్కడా కూడా ఎన్నికలను ఎదుర్కొనడానికి తెలుగుదేశం పార్టీ ఏ మాత్రం ఇష్టంతో లేదు. పెండింగ్‌లో ఉన్న మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికలను నిర్వహించడానికి ముందుకు రాకపోవడం అయితేనేం.. ఫిరాయింపుదారులకు మంత్రిపదవులు ఇచ్చి.. వారిచేత రాజీనామా చేయించకపోవడం ద్వారానైతేనేం.. తెలుగుదేశం పార్టీకి ఎన్నికలంటే చాలా భయం ఉందనే విషయం స్పష్టంగానే అర్థం అవుతోంది. ఎన్నికలంటే.. అవి స్థానిక సంస్థల కోటాలో జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లాగా ఉండాలి. అదీ టీడీపీ కోరిక. క్యాంపు రాజకీయాలు, బెదిరింపులు, కిడ్నాప్‌లు, కొనుగోళ్లు.. వీటితో వ్యవహారాలను సెటిల్‌ చేసుకునే ఎన్నికలేమైనా ఉంటే ఏమైనా చెప్పండి.. వాటికి తెలుగుదేశం రెడీ. టీడీపీ పరిస్థితి మరీ ఇలా తయారవుతుందని ఎవ్వరూ ఊహించి ఉండరు కాబోలు. 

మరి ఇలాంటి పరిస్థితుల నడుమ తెలుగుదేశం పార్టీ ఏ మాత్రం కోరుకోని తరహా ఎన్నిక ఒకటి వచ్చింది. అదే నంద్యాల ఉపఎన్నిక. ఇప్పటికే ఈ నియోజకవర్గాన్ని పెదబాబు, చినబాబులు కలిసి కూడా బ్యాలెన్స్‌ చేయలేకపోతున్నారు. సానుభూతి అస్త్రాన్ని ఉపయోగించుకుని ఈ ఎన్నికల్లో నెట్టుకురావాలని టీడీపీ భావిస్తోంది. అయితే ఆ సానుభూతి ఉంటుందా? అనేదే పెద్ద మిస్టరీ! భూమా నాగిరెడ్డి మరణించారు కానీ.. అంత మాత్రాన ఆయన కూతురు నంద్యాల నుంచి పోటీచేస్తే సానుభూతి వెల్లువెత్తుతుంది అనే నమ్మకం క్రమంగా తగ్గిపోతోంది. ఈ నియోజకవర్గం నుంచి పోటీచేసి తీరతాం.. అని తొలిరోజు నుంచే ప్రతిపక్ష వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ స్పష్టంచేస్తూ వస్తోందంటే... ఇక్కడ 'సానుభూతి' ప్రభావం ఎంతో అర్థం చేసుకోవచ్చు. పార్టీ మారి.. భూమా నాగిరెడ్డి ప్రధానమైన సామాజికవర్గం నుంచి సానుభూతిని కోల్పోయారు. 

తన తండ్రికి ఏమైనా జరిగితే దానికి చంద్రబాబే బాధ్యత వహించాలని.. భూమా నాగిరెడ్డి బతికి ఉన్న రోజుల్లో మాట్లాడిన అఖిలప్రియ, చివరకు భూమా నాగిరెడ్డి మరణించాకా.. చంద్రబాబు బొమ్మ పెట్టుకుని ఓటు అడిగితే.. ఓటేసే వాళ్లు కన్నీళ్లు పెట్టుకుంటారా? నిజమే జనాలు సెంటిమెంటల్‌ ఫూల్సే.. కానీ తమ వెర్రి తనానికి కూడా జనాలు ఒక హద్దంటూ పెట్టుకుంటున్నారు. దాన్ని క్రాస్‌ చేయరు. నంద్యాల ఉపఎన్నికల్లో సానుభూతి అంశం చాలా చిన్నది. ఇక్కడ మిగిలింది పోల్‌ మేనేజ్‌మెంట్‌. డబ్బు. ప్రభుత్వ వ్యతిరేకత. ఈ మూడు అంశాలే ఎన్నికలను ప్రభావితం చేయబోతున్నాయి.

 చంద్రబాబు పాలన తీరుపై ప్రజాభిప్రాయం ఎలా ఉంది? అనేది కొంత వరకూ క్లారిటీ వస్తుంది. ఇక డబ్బు పంపకం, కనీసం అరడజను మంది మంత్రులు వెళ్లి నంద్యాలలో కూర్చోవడం.. వంటి అంశాలు.. పోలీస్‌ వ్యవస్థను అధికార పార్టీ ఉపయోగించుకోవడం.. ఇవన్నీ కూడా టీడీపీకి సానుకూలంగా నిలిచే అంశాలు. అయితే ప్రభుత్వ వ్యతిరేకత బలంగా ఉంటే.. ఇవన్నీ కూడా దూదిపింజలే. ఫిరాయింపుదారులపై ప్రజలు ఎలాంటి ధోరణితో ఉన్నారు.. చంద్రబాబు పాలన మీద ఎలాంటి అభిప్రాయం ఉంది.. అనే అంశాలకు నంద్యాలలో సమాధానం దొరకవచ్చు. అయితే ఇలాంటి ఉపఎన్నికల్లో అధికార పార్టీలు విజయం సాధించడం జరుగుతూ ఉంటుంది. 

ఇటీవల కర్నాటకలో నంజనగూడు, గుండ్లుపేట ఉపఎన్నికల్లో తీర్పులను కూడా పరిశీలించాలి. కర్నాటకలో సిద్దరామయ్య ప్రభుత్వంపై తీవ్రమైన వ్యతిరేకత ఉందంటున్నా.. అక్కడ కాంగ్రెస్‌ పార్టీ విజయం సాధించింది. అలాంటి భిన్నమైన ఫలితం గనుక నంద్యాలలో వస్తే.. చంద్రబాబు సర్కారుకు కౌంట్‌డౌన్‌ మొదలైనట్టే...! మరి నంద్యాల ఏం చెబుతుందో చూడాలి!!

Show comments