డ్రగ్స్ గొడవ : మంత్రులకు కేసీఆర్ అక్షింతలు!

డ్రగ్స్ గొడవకు మంత్రులకు సంబంధం ఏమిటి? డ్రగ్స్ తీసుకుంటున్న వారిలో మంత్రులు కూడా ఉన్నట్లుగా ఎక్కడా వార్తల్లో రాలేదు కదా..! మంత్రి వారిని ముఖ్యమంత్రి ఎందుకు మందలించినట్లు అని ఆశ్చర్యపోతున్నారా? మంత్రులు డ్రగ్స్ వాడకందార్లు కాకపోవచ్చు గానీ.. ఈ కేసు వ్యవహారం నేపథ్యంలో వారికి అక్షింతలు మాత్రం తప్పలేదు.

తమ పరిధిని మించి ఇతర వ్యవహారాల్లో వేలు పెట్టినందుకు, ఆశ్రితుల్ని కాపాడడానికి ప్రయత్నించినందుకు వారు గులాబీబాస్ ఆగ్రహానికి గురికావాల్సి వచ్చినట్లుగా తెలుస్తోంది. స్వయంగా కేసీఆర్ ఈ విషయంలో జోక్యం చేసుకుని, అకున్ సభర్వాల్‌కు సర్వాధికారాలు ఇచ్చేయడం, సెలవు కూడా రద్దు చేసుకోమని చెప్పి, ఎంతటి వారు ఇందులో ఉన్నా ఉపేక్షించే అవసరం లేదని గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడం అంతా ఇందుకు నిదర్శనమే అని తెలుస్తోంది.

కెల్విన్ పుణ్యమాని బయటకు వచ్చిన డ్రగ్స్ వ్యవహారంలో సినీ పరిశ్రమకు చెందిన అనేక మంది ప్రముఖుల పేర్లు ఉన్నాయి. ప్రముఖులు అనగానే.. వారి వారి స్థాయిలో వారికి పైరవీ మార్గాలు ఉంటాయి. ఆ రకంగా ప్రముఖులందరూ కూడా ప్రభుత్వంలోని పెద్దల ద్వారా పైరవీలకు ప్రయత్నించారు. తెలంగాణ ప్రభుత్వంలోని కొందరు మంత్రులు ఈ కేసు వ్యవహారంలో జోక్యం చేసుకున్నట్లుగా సమాచారం.

డ్రగ్స్ వ్యవహారంలో పాఠశాలల పాత్ర గురించిన ఎపిసోడ్ బయటకు రావడంపై విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి ఓపెన్ గానే అసహనం వ్యక్తం చేశారు. ‘పోలీసులు కాస్త ఎక్కువ చేస్తున్నారని’ వ్యాఖ్యానించారు. కాగా, తెరవెనుకనుంచి పోలీసుల మీద ఒత్తిడి తెచ్చి, కొందరు ప్రముఖుల విషయంలో ఫేవర్ చేయడానికి ప్రయత్నించిన మంత్రులు కూడా ఉన్నారనేది సమాచారం. ఈ ఒత్తిళ్ల నేపథ్యంలోనే అకున్ సభర్వాల్ సెలవుపై వెళ్లడానికి కూడా నిర్ణయించుకున్నట్లు వార్తలొచ్చాయి.

అయితే సీఎం కేసీఆర్ స్వయంగా జోక్యం చేసుకుని.. అకున్ సభర్వాల్ సెలవుపై వెళ్లకుండా ఆపారు. ఆయనకు పూర్తి అధికారాలు ఇస్తూ, ఎంతటి పెద్దల ప్రమేయం ఉన్నా చట్ట ప్రకారం వ్యవహరించాల్సిందిగా అధికారమిచ్చారు. ‘బ్రాండ్ హైదరాబాద్’ గా తీర్చిదిద్దాలనుకుంటూ ఉంటే.. ఇలాంటి మచ్చలు పరువు తీస్తయానే ఉద్దేశంతో కేసీఆర్ దృఢంగా వ్యవహరించినట్లు తెలుస్తోంది.

సభర్వాల్‌తో సంభాషణలోనే ఒత్తిళ్ల గురించిన ప్రస్తావన కూడా వచ్చిందని, కేసీఆర్ సీరియస్ అయి.. తన టీంలోని కొందరు మంత్రులను, ఈ కేసులో జోక్యం చేసుకున్న ఇతర నాయకులను మందలించారని తెలుస్తోంది. మొత్తానికి ఎలాంటి ఒత్తిళ్లూ లేకుండా కేసు దర్యాప్తు మరికాస్త ముందుకు సాగితే.. అనేకమంది ప్రముఖులు జాతకాలు కూడా బహిర్గతమయ్యే అవకాశం ఉంది.

Show comments