జాతీయ మీడియా: దేశంలోనే ధనికుడైన సీఎం.. చంద్రబాబు!

ఒకవైపు తన చేతికి వాచీ లేదు.. అని చెప్పుకునే చంద్రబాబు నాయుడు దేశంలోనే అత్యంత ధనికుడైన సీఎం అని జాతీయ మీడియా తేల్చింది. ముఖ్యమంత్రులు, ఆస్తులు, వారిపై ఉన్న నేరాభియోగాలు.. వంటి అంశాలపై అధ్యయనం చేసిన ఇండియాటుడే.. అందుకు సంబంధించిన గణాంకాలను వెల్లడించింది. ప్రత్యేకించి.. ధనుకి, పేద ముఖ్యమంత్రుల జాబితా ఆసక్తికరంగా ఉంది. ఆస్తుల విషయంలో.. తను నిరుపేదను అని చెప్పుకునే ఏపీ సీఎం చంద్రబాబుకు ఈ జాబితాలో తొలి స్థానం దక్కడం విశేషం. అది బాబు ఆస్తులు కొంతమంది వేరే రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పోలిస్తే.. కొన్ని వందల రెట్లు ఎక్కువగా ఉండటం విశేషం. వ్యక్తిగతంగా 177 కోట్ల రూపాయల ఆస్తులతో చంద్రబాబు నాయుడు అత్యంత ధనికుడైన సీఎంగా నిలుస్తాడని ఇండియాటుడే పేర్కొంది. 

బాబు స్థాయి ఆస్తులను కలిగిన ముఖ్యమంత్రి మరొకరు లేరని స్పష్టంచేసింది. ఈ జాబితాలో 129 కోట్లతో రెండో స్థానంలో ఉన్నాడు అరుణాచల్ ప్రదేశ్ సీఎం. మరి రెండో స్థానంలో ఉన్న వ్యక్తి కన్నా బాబు ఆస్తులు దాదాపు 48 కోట్లు ఎక్కువ కావడం గమనార్హం. అరుణాచల్ సీఎంవే భారీ ఆస్తులు అనుకుంటే.. చంద్రబాబువి అతి భారీ ఆస్తులు అని చెప్పాల్సి ఉంటుంది. ఇటీవలే పంజాబ్ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన కెప్టెన్ అమరీందర్ సింగ్ మూడో స్థానంలో, హిమచల్ సీఎం నాలుగో స్థానంలో ఉండగా.. ఐదో స్థానంలో కూడా తెలుగు రాష్ట్ర సీఎం ఉండటం విశేషం. పదిహేను కోట్ల రూపాయల ఆస్తులతో కేసీఆర్ ఈ జాబితాలో ఐదో స్థానంలో ఉన్నారు. కేసీఆర్ ఆస్తులతో పోలిస్తే చంద్రబాబు ఆస్తులు దాదాపు పన్నెండు రెట్లు ఎక్కువ! 

కేవలం వ్యక్తిగతంగా వందల కోట్లను పోగేసుకున్న వాళ్లే కాదు.. దేశంలో నిరుపేద సీఎంలు కూడా ఉన్నారు. వారిలో ముందున్నారు త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్ సర్కార్. అత్యంత నిజాయితీ పరుడిగా పేరు పొందిన ఈ కమ్యూనిస్టు పార్టీ లీడర్ ఆస్తులు కేవలం 26 లక్షల రూపాయలు మాత్రమే. ఈయన త్రిపురకు వరసగా రికార్డు స్థాయి కాలం పాటు సీఎంగా ఉంటూ వస్తున్నారు. నిరుపేద సీఎంలలో రెండో స్థానంలో ఉన్నారు జే అండ్ కే సీఎం మెహబూబా. ఆమె ఆస్తులు కేవలం 55 లక్షల రూపాయలు. హర్యానా, జార్ఖండ్ సీఎంలు కూడా పేదలే.

ఇక ఇటీవలే యూపీ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన యోగి ఆదిత్యనాథ్ నిరుపేదల్లో టాప్ ఫైవ్ లో ఉన్నారు. 72 లక్షల రూపాయల సంపదతో ఆయన ఈ జాబితాలో ఐదో స్థానంలో ఉన్నారు. నిరుపేద సీఎంలు ఎవ్వరూ మేము పేదలం అని ఎక్కడా చెప్పుకోవడం లేదు. ఆస్తుల ప్రకటన అంటూ హంగామా చేయడం లేదు. మేము నిజాయితీగా ఉంటున్నామని రోజుకోసారి చెప్పుకోవడం లేదు. ‘నిప్పు’లం అనడంలేదు. చేతికి వాచీ లేదు, చేతిలో చిల్లిగవ్వ లేదు అని అనడం లేదు.. బికారులమని ఆస్తుల ప్రకటన చేయడం లేదు, మేము మాత్రమే ఆస్తుల ప్రకటన చేస్తున్నామని చెప్పుకోవడం లేదు.. అత్యంత ధనిక ముఖ్యమంత్రి మాత్రమే.. ఈ పనులన్నీ చేస్తున్నారు. ఏమైనా ఆయన ప్రత్యేకత ఆయనదే!

Show comments