చంద్రబాబు 'సోషల్‌' నీతులు.!

సోషల్‌ మీడియాలో కొందరు ఔత్సాహికులు తమ వికృత చేష్టలతో వెకిలితనం ప్రదర్శిస్తోన్న మాట వాస్తవం. కానీ, ఏం చేస్తాం.? సోషల్‌ మీడియాకి అడ్డుకట్ట వేయడం అంత తేలిక కదా. వందలు, వేలల్లో కాదు, లక్షల్లో వున్నాయి సోషల్‌ మీడియా ఖాతాలు. వ్యవస్థ మీద అసహనం పెరిగిపోయినా, ప్రత్యక్షంగా ఏమీ చేయలేకపోతున్న సామాన్యులు.. సోషల్‌ మీడియాలో తమ అభిప్రాయాల్ని ఇతరులతో పంచుకుంటున్నారు. ఇక్కడే, ఆ అసహనం హద్దులు మీరి, వికృత చేష్టలకు కారణమవుతోంది. 

టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుగారి పుత్రరత్నం, మంత్రి నారా లోకేష్‌ మీద సోషల్‌ మీడియాలో ఈ మధ్యకాలంలో కామెంట్లు శృతిమించుతున్నాయి. ఆ మాటకొస్తే, ఈ పైత్యం వైఎస్‌ జగన్‌ విషయంలోనూ ఎక్కువగానే కన్పిస్తోంది. సినిమా సెలబ్రిటీలని లేదు, పొలిటికల్‌ సెలబ్రిటీలని లేదు, క్రికెటర్లు అని లేదు.. సోషల్‌ మీడియా దెబ్బకి ఎవరైనాసరే, బెంబేలెత్తాల్సిందే. 

కానీ, మంత్రి అయ్యాక నారా లోకేష్‌ తన మీద పుట్టుకొస్తున్న కామెంట్లను తట్టుకోలేకపోతున్నారు. ఇంకేముంది, చట్ట సభలపై వ్యంగ్యంగా కార్టూన్లు వేశారంటూ రవికిరణ్‌ అనే వ్యక్తి మీద కేసులు నమోదయ్యాయి ఆంధ్రప్రదేశ్‌లో. రవికిరణ్‌ని ఏపీ పోలీసులు హైద్రాబాద్‌లో అదుపులోకి తీసుకున్నారు కూడా. పెద్దల సభ ముందు, పోర్న్‌ ఫొటో పెట్టి, 'పెద్దలకు మాత్రమే' అంటూ కామెంటేయడమేనట నిందితుడు చేసిన నేరం. ఇదెంతవరకు సబబు.? అన్నది వేరే విషయం. 

చట్ట సభల్లో ప్రజా ప్రతినిథులు ఏం చేస్తున్నారు.? 'నీ... పాతేస్తా నా కొడకా..' అంటూ అధికార పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే, ప్రతిపక్ష పార్టీకి చెందిన ఇంకో ఎమ్మెల్యేని దూషించింది ఇదే చట్ట సభల్లో. అది పిల్లలు వినకూడని భాష అని చెప్పేందుకు 'పెద్దలకు మాత్రమే' అనంటే తప్పేంటట.? అసలు విషయం అది కాదు, 'పప్పు' అంటూ లోకేష్‌ మీద ఎడా పెడా కామెంట్లు వేయడం. అలాగని అరెస్ట్‌ చేయడానికి వీల్లేదు కాబట్టి, చట్ట సభల గౌరవం పేరుతో కొత్త రూట్‌ వెతుక్కున్నారన్నమాట. 

ఏదిఏమైనా, ఇది కేవలం కక్ష సాధింపు మాత్రమే. ఇందులో ఇంకో మాటకు తావు లేదు. సోషల్‌ మీడియాలో కొందరు హద్దులు మీరుతున్నారని చంద్రబాబు, ఈ వ్యవహారంపై స్పందించారుగానీ, వైఎస్‌ జగన్‌ మీద కామెంట్లేసినప్పుడు ఎందుకు అరెస్టులు జరగలేదు.? జగన్ దాకా ఎందుకు.? స్వయంగా చంద్రబాబు మీద కామెంట్లేసినప్పుడు ఎందుకు అరెస్టులు జరగలేదు.? ప్రభుత్వాధినేతగా ఈ ప్రశ్నలకు చంద్రబాబు సమాధానం చెప్పి తీరాల్సిందే.

Show comments