టాలీవుడ్‌ 2016 - హాఫ్‌ ఇయర్లీ రిపోర్ట్‌

మైండ్‌ బ్లాక్‌ చేసిన డిజాస్టర్స్‌... రిలీఫ్‌ ఇచ్చిన సర్‌ప్రైజ్‌ హిట్స్‌!

ఈ ఏడాది ఇప్పటికే ఫిఫ్టీ కొట్టేసింది. కొత్తేడాదిలో ఆరు నెలలు ఇట్టే కరిగిపోయాయి. హాఫ్‌ ఇయర్లీ రిపోర్ట్‌ చూసుకుంటే తెలుగు సినిమాకి ఈ సంవత్సరం బాగుందా, బాలేదా అంటే బాలేదని కొట్టి పారేయలేం, బాగుందని గట్టిగా అనలేం. తప్పకుండా వంద కోట్లు కొల్లగొడతాయని నమ్మిన సినిమాలు కొన్న వాళ్లని ఆశల ఆకాశం నుంచి అధఃపాతాళానికి పడేస్తే, పెద్దగా ఆశలు పెట్టుకోని చిత్రాలు అనూహ్య ఫలితాలు సాధించి తెలుగు సినీ విపణి కుప్పకూలిపోకుండా కాపాడాయి. ఒక అతి భారీ పరాజయం వచ్చి మార్కెట్‌ వర్గాలని నీరుగార్చేస్తే, దాని వెనుకే వచ్చిన సినిమాలు కొన్ని కన్నీళ్లు తుడిచాయి. 'ఇంటర్వెల్‌' టైమ్‌కి ఈ ఏడాది తెలుగు సినిమా చాలా ఎత్తు పల్లాలు చూసేసింది. స్క్రీన్‌ప్లే పరిభాషలో చెప్పుకోవాలంటే... గ్రాఫ్‌లో అప్‌ అండ్‌ డౌన్స్‌ చాలానే ఉన్నాయి కానీ, ఓవరాల్‌గా ఫస్ట్‌ హాఫ్‌ డిజప్పాయింట్‌ చేయలేదు, అలాగని ఎక్సయిటూ చేయలేదన్నమాట. 

సంక్రాంతికి కానీ మొదలు కానీ సినీ సందడి ఈ ఏడాది క్యాలెండర్‌లో మొదటి రోజే స్టార్ట్‌ అయింది. రెండు డిజాస్టర్లతో డీలా పడ్డ రామ్‌కి 'నేను శైలజ'తో కొత్త ఉత్సాహం వచ్చింది. సంక్రాంతి ముందు సీజన్‌ సినిమాలకి అనుకూలం కాదనేది వాస్తవమే అయినప్పటికీ 'నేను శైలజ' ప్రేక్షకులని అమితంగా ఆకట్టుకుని విజయఢంకా మోగించింది. 

ఈమధ్య కాలంలో ఎప్పుడూ లేని విధంగా సంక్రాంతికి ఒకటీ, రెండూ కాదు ఏకంగా నాలుగు సినిమాలు రిలీజయ్యాయి. వీటిలో అన్నీ చెప్పుకోతగ్గవే కావడంతో సంక్రాంతికి బాక్సాఫీస్‌ కళకళలాడిపోయింది. అయితే అంతిమంగా ప్రేక్షకులని మెప్పించిన సినిమాలే విజయ దరహాసం చిందించాయి. మిగిలినవి పండగ సంబరాలతో సరిపెట్టుకున్నాయి. సంక్రాంతికి వచ్చిన సినిమాల్లో అనూహ్య విజయాన్ని అందుకున్నది 'సోగ్గాడే చిన్నినాయనా'. నాగార్జున ద్విపాత్రాభినయం చేసిన ఈ రొమాంటిక్‌ ఫాంటసీ చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. గతంలో ఫలానా హీరో సినిమా విజయం సాధిస్తే 'ఇదీ రేంజు' అని ఒక లెక్క ఉండేది. ఆ పడికట్టు బాక్సాఫీస్‌ లెక్కలని తుంగలోకి తొక్కి 'సోగ్గాడే' సంక్రాంతి మొనగాడయ్యాడు. నాగార్జున కెరీర్లోనే అతి పెద్ద విజయంగా నిలిచిన ఈ చిత్రం దాదాపు యాభై కోట్ల షేర్‌ సాధించడంతో తెలుగు సినిమా ట్రేడ్‌ పండితులే అవాక్కయ్యారు. మూడు సినిమాలతో పోటీ పడి, సంక్రాంతి సీజన్‌లో రెవెన్యూని వాటన్నిటితో షేర్‌ చేసుకుని మరీ ఈ షేర్‌ సాధించడమంటే మాటలు కాదు. పెట్టిన పెట్టుబడికి రెండింతలకి పైగా రాబట్టుకున్న 'సోగ్గాడే చిన్నినాయనా' ఈ ఏడాదికి అదిరిపోయే ఆరంభాన్నిచ్చింది. 

'సోగ్గాడే' టాప్‌ లెవల్లో షేక్‌ చేసేస్తే, 'ఎక్స్‌ప్రెస్‌ రాజా' తన లెవల్లో కదం తొక్కేసాడు. మొదటి వారంలో మిగతా మూడు పెద్ద సినిమాల తాకిడికి ఇబ్బంది పడిన 'ఎక్స్‌ప్రెస్‌ రాజా' రెండవ వారం నుంచీ పుంజుకుని నిర్మాతలకి లాభాల పంట పండించాడు. ఎన్టీఆర్‌, సుకుమార్‌ల 'నాన్నకు ప్రేమతో' క్లాస్‌ ప్రేక్షకుల నుంచి మార్కులు పొందినా, మాస్‌ని మెప్పించలేకపోయింది. యుఎస్‌లో రెండు మిలియన్‌ డాలర్లు సాధించిన ఈ చిత్రం లోకల్‌ మార్కెట్‌లో అంతంత మాత్రంగానే ఆడింది. ఎన్టీఆర్‌ కెరీర్లో బిగ్గెస్ట్‌ గ్రాసర్‌ అనయితే అనిపించుకుంది కానీ, యంగ్‌ టైగర్‌ ఎదురు చూస్తోన్న ఆ భారీ విజయాన్ని మాత్రం అందించలేకపోయింది. సంక్రాంతి బరిలోనే దిగిన 'డిక్టేటర్‌' పండగ సీజన్నయితే క్యాష్‌ చేసుకోగలిగింది కానీ పరాజయాన్ని మాత్రం తప్పించుకోలేకపోయింది. 

మొత్తానికి బ్లాక్‌బస్టర్‌ చిన్నినాయనా, సూపర్‌హిట్‌ శైలజ-రాజా, అబౌ యావరేజ్‌ నాన్నకు ప్రేమతో రూపంలో ఈ ఏడాదికి ఆరంభం అదిరిపోయింది. ఓపెనింగ్‌ సీన్‌ అదిరిపోయినా కానీ, వెంటనే గ్రాఫ్‌ డౌన్‌ అయింది. వరుసగా మూడు విజయాలతో దూసుకెళుతోన్న రాజ్‌ తరుణ్‌కి 'సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు'లో ఫ్లాప్‌ టేస్ట్‌ ఎలాగుంటుందో తెలిసింది. భలే భలే మగాడివోయ్‌, సోగ్గాడే చిన్నినాయనాతో వరుసగా రెండు బ్లాక్‌బస్టర్లు అందుకున్న లావణ్య 'లచ్చిందేవికి ఓ లెక్కుంది' అంటూ వేసిన లెక్క తప్పింది. బెల్లంకొండ శ్రీను అలియాస్‌ 'అల్లుడు శీను' స్పీడుకి 'స్పీడున్నోడు' సడన్‌ బ్రేక్‌ వేసేసింది. సునీల్‌, దిల్‌ రాజు కలయికలో వచ్చిన 'కృష్ణాష్టమి' నష్టాలకి చిరునామా అయి కూర్చుంది. తనయుడి కోసం నిర్మాత అవతారం ఎత్తిన సాయికుమార్‌ 'గరం'తో చేతులు కాల్చుకోవాల్సి వచ్చింది. 

జనవరి గోదావరిలా ఉరకలేస్తే... ఈ ఫ్లాప్‌లతో ఫిబ్ర'వర్రీ' స్టార్ట్‌ అయింది. కాకపోతే 'కృష్ణగాడి వీర ప్రేమగాథ', 'క్షణం'లాంటి మెరుపులతో కాస్త ఊరట దక్కింది. కృష్ణగాడి ప్రేమగాధ వీరత్వం చూపించకపోయినా అబౌ యావరేజ్‌ అనిపించుకుంది. 'క్షణం' చిన్న సినిమాల్లో మణిపూస అనే కితాబులు అందుకోవడంతో పాటు విజయాన్నీ సొంతం చేసుకుంది. పరీక్షల సీజన్‌కి భయపడి పెద్ద సినిమాలన్నీ వేసవి సెలవుల కోసం వేచి చూస్తోన్న తరుణంలో వచ్చిన చిన్న సినిమాల్లో పెద్ద విజయాలేం రాకపోవడంతో ఫిబ్రవరి, మార్చి నెలల్లో తెలుగు సినిమా బాక్సాఫీస్‌ బద్ధకించింది. మార్చి మొదటి మూడు వారాల్లో 'కళ్యాణ వైభోగమే', 'గుంటూర్‌ టాకీస్‌' మినహా కాస్తయినా సందడి చేసిన సినిమాలే లేకుండా పోయాయి. వేసవి జోరు మొదలు కావడానికి ముందొచ్చిన 'ఊపిరి' ఉత్తమాభిరుచి ఉన్న ప్రేక్షకుల మన్ననలు అందుకుంది. ఓవర్సీస్‌లో సూపర్‌హిట్‌ అయిన ఈ సినిమా ఇక్కడ ఏ సెంటర్స్‌లో బాగా రన్‌ అయింది. యువ హీరోలు సందీప్‌ కిషన్‌ 'రన్‌' మీద, నారా రోహిత్‌ 'సావిత్రి'పైన పెట్టుకున్న ఆశలు తలకిందులయ్యాయి.

'బాహుబలి' తర్వాత అంతటి విజయాన్ని సాధిస్తుందనే నమ్మకంతో 'సర్దార్‌ గబ్బర్‌సింగ్‌' చిత్రంపై దాదాపు బాహుబలికి పెట్టినంత పెట్టుబడి పెట్టిన బయ్యర్లకి షాక్‌ తగిలింది. తొలి రోజు నిజంగానే 'బాహుబలి' మాదిరిగా బాక్సాఫీస్‌ని షేక్‌ చేసిన సర్దార్‌ బండారం రెండో రోజుకే బయట పడిపోయింది. మొత్తంగా యాభై కోట్లకి పైగా షేర్‌ వచ్చినా కానీ భారీ పెట్టుబడుల కారణంగా అతి పెద్ద డిజాస్టర్లలో ఒకటిగా మిగిలిపోయింది. సర్దార్‌ తర్వాత వచ్చిన 'ఈడోరకం ఆడోరకం' మాస్‌ని ఆకట్టుకుని విజయాన్ని సొంతం చేసుకుంది. అయితే 'సర్దార్‌' భారాన్ని తీర్చే భారీ విజయం కావాల్సిన లోటుని మాత్రం 'సరైనోడు' తీర్చింది. విమర్శకుల్ని మెప్పించలేకపోయిన ఈ మాస్‌ మసాలా చిత్రం వేసవి సెలవులని ఫుల్‌గా క్యాష్‌ చేసుకుంది. అల్లు అర్జున్‌ చిత్రాల్లోనే అతి పెద్ద విజయాన్ని అందుకున్న సరైనోడు పీక్‌ సమ్మర్‌లో ఒక పెద్ద సినిమా విజయాన్ని సాధిస్తే ఎంత లాభం పొందుతుందో చూపించింది. ఈ ఏడాదికి ఇప్పటి వరకు బిగ్గెస్ట్‌ గ్రాసర్‌గా నిలిచిన 'సరైనోడు' సెకండ్‌ హాఫ్‌లో రాబోతున్న భారీ చిత్రాలకి బెంచ్‌ మార్క్‌ సెట్‌ చేసింది. సమ్మర్‌లో మొత్తంగా మూడు సార్లు అదృష్టాన్ని పరీక్షించుకున్న నారా రోహిత్‌కి తుంటరి, సావిత్రి, రాజా చెయ్యి వేస్తే రూపంలో ఫ్లాప్‌ హ్యాట్రిక్‌ మాత్రమే దక్కింది. 

నిర్మాతగా దిల్‌ రాజుని వేధించిన స్లంప్‌కి ఫైనల్‌గా 'సుప్రీమ్‌'తో బ్రేక్‌ పడింది. ఈ చిత్రం బాక్సాఫీస్‌ జర్నీ మిక్స్‌డ్‌ టాక్‌తో మొదలైనా కానీ స్టడీగా రన్‌ అయి సూపర్‌హిట్‌ స్టేటస్‌ దక్కించుకుంది. దీంతో పాటే వచ్చిన విక్రమ్‌ కుమార్‌, సూర్యల '24' క్లాస్‌ వర్గాన్ని ఆకట్టుకుంది. అయితే మాస్‌ ఈ సినిమాతో కనెక్ట్‌ కాకపోవడంతో ప్రశంసలకి తగిన ఆర్థిక ఫలితం దక్కకుండాపోయింది. 'సర్దార్‌' తర్వాత అంతటి అంచనాలతో, భారీ పెట్టుబడులతో వచ్చిన 'బ్రహ్మూెత్సవం' అందరినీ విస్మయ పరుస్తూ అత్యంత ఘోరమైన పరాభవాన్ని చవిచూసింది. ప్రతి ఏరియా పంపిణీదారునికీ ఈ చిత్రంపై సగానికి పైగా నష్టం వచ్చింది. సర్దార్‌ గబ్బర్‌సింగే అతి పెద్ద డిజాస్టర్‌ అనుకుంటే, దానిని తలదన్నేలా ఫ్లాపయిన బ్రహ్మూెత్సవం కనీసం నలభై కోట్ల షేర్‌ కూడా తెచ్చుకోలేకపోయింది. 

పీక్‌ సమ్మర్‌ని మిస్‌ అయిపోయినప్పటికీ త్రివిక్రమ్‌ 'అ ఆ' ఫ్యామిలీ ఆడియన్స్‌ని విశేషంగా ఆకట్టుకుని భారీ విజయాన్ని అందుకుంది. నితిన్‌ కెరీర్లోనే అతి పెద్ద విజయంగా నిలిచిన ఈ చిత్రం బ్రహ్మూెత్సవం చేసిన విధ్వంసం అనంతరం మార్కెట్‌ వర్గాలకి వెసులుబాటునిచ్చింది. ఇంటర్వెల్‌కి ముందు బ్రహ్మూెత్సవంతో పూర్తిగా పడిపోయిన గ్రాఫ్‌ మళ్లీ అ ఆ ఇచ్చిన బ్యాంగ్‌తో కుదురుకుంది. ఇదే టైమ్‌లో ఒక్క అమ్మాయి తప్ప, రైట్‌ రైట్‌ తదితర చిన్న చిత్రాలు ప్రభావం చూపించకపోయినా 'జెంటిల్‌మన్‌'గా నాని విజయాన్ని అందుకోవడం జూన్‌కి బోనస్‌ అయింది. జూన్‌ చివర్లో వచ్చిన సినిమాల ఫలితమేంటనేది ఇంకా తేలాల్సి ఉంది. ఇవన్నీ ఒకెత్తు అయితే ఈ ఏడాదికి అతి పెద్ద సర్‌ప్రైజ్‌ సక్సెస్‌ స్టోరీ మాత్రం 'బిచ్చగాడి'దే. తమిళం నుంచి అనువాదమయిన ఈ చిత్రం సెన్సేషనల్‌ హిట్‌ అయింది. పెట్టుబడిపై వచ్చిన లాభాలని లెక్కించుకుంటే, ఇటీవలి కాలంలో ఇంతకంటే పెద్ద హిట్టు లేదేమో అన్నట్టుగా చెలరేగిపోయింది. 

విజయాల సంఖ్య బాగానే కనిపిస్తున్నప్పటికీ 'సర్దార్‌ గబ్బర్‌సింగ్‌', 'బ్రహ్మూెత్సవం' చిత్రాల్లో ఏ ఒక్కటి అయినా అంచనాలని అందుకున్నట్టయితే ఫస్ట్‌ హాఫ్‌ బ్లాక్‌బస్టర్‌ అనిపించుకుని ఉండేది. ఇవి రెండూ దారుణమైన డిజాస్టర్లు కావడంతో మిగతా విజయాలు ఆ వెలితిని పూర్తిగా పూడ్చలేకపోయాయి. ఈ ఏడాది ద్వితీయార్థంలో కబాలి, జనతా గ్యారేజ్‌, బాబు బంగారం, ధృవ, ప్రేమమ్‌ తదితర భారీ చిత్రాలు రాబోతున్నాయి. అంచనాలున్న సినిమాలన్నీ అందుకు తగ్గట్టు పర్‌ఫార్మ్‌ చేసినట్టయితే సక్సెస్‌ఫుల్‌ సెకండ్‌ హాఫ్‌తో ఈ ఏడాది హిట్‌ అయిపోతుంది. 

- గణేష్‌ రావూరి

//twitter.com/ganeshravuri

Show comments