ఇద్దరు సీఎం ల డైరీలో ఒకరోజు!

ఇద్దరు ముఖ్యమంత్రుల డైరీలో ఒకరోజు జరిగిన పనిని పరిశీలిస్తే చాలా విషయాలు బోధపడుతాయి. ఆ సీఎం పని తీరును ఒకరోజు, ఈ సీఎం పనితీరును మరొకరోజు చూడడం కాదు. చరిత్రలోని ఒకేరోజును తీసుకుని, అదే రోజున ఆ ఇద్దరూ ఎలాంటి కార్యక్రమాల్లో నిమగ్నం అయి ఉన్నారో గమనిస్తే.. చాలా విషయాలు బోధపడతాయి.

ఆగస్టు 23, 2016 

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ డైరీలో.... 

ఇవాళ ముంబాయి కి వెళ్లారు. అక్కడి సహ్యాద్రి గెస్ట్‌ హౌస్‌లో బస చేశారు. తెలంగాణలో గోదావరి నది మీద నిర్మిస్తున్న మూడు కీలక నీటి ప్రాజెక్టులకు సంబంధించి, ఎగువ రాష్ట్రం అయిన మహా రాష్ట్ర తో అతి కీలకమైన మూడు ఒప్పందాలను కుదుర్చుకున్నారు. మహా రాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్‌ తో కలిసి ఈ ఒప్పందాల మీద సంతకాలు చేశారు. తెలంగాణ రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసే ఒప్పందాలుగా ఇవి చరిత్రలో నిలవబోతున్నాయి. 

హరీష్‌రావు, ఇతర అధికార్లతో కలిసి కేసీఆర్‌ ముంబాయి వెళ్లి ఈ ఒప్పందాలు చేసుకున్నారు. వీటితో నీటి వనరుల పరంగా తెలంగాణ దశ మారిపోతుందని అంతా భావిస్తున్నారు. కేసీఆర్‌ను అపర భగీరథుడిగా అందరూ కీర్తిస్తున్నారు. 

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు డైరీలో... 

ఉదయాన్నే పీవీసింధు హైదరాబాదునుంచి విజయవాడకు రావడానికి ప్రత్యేక విమానం ఏర్పాటుచేశారు. మంత్రులందరినీ విమానాశ్రయానికి ఘనస్వాగతం మరియు ఊరేగింపు ఏర్పాటుచేశారు. సన్మానానికి ఏర్పాటుచేసిన వేదిక మీద.. పీవీ సింధుతో కలసి చంద్రబాబు షటిల్‌ బ్యాడ్మింటన్‌ ఆడారు. తద్వారా.. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో మరిన్ని ఒలింపిక్స్‌ పతకాల విజేతలు తయారు కావడానికి ఆయన స్ఫూర్తి అందించారు. సింధు, గోపీచంద్‌లకు చెక్కులు, ఇంటిస్థలం పత్రాలు అన్నీ అందజేశారు. 

సాయంత్రం కృష్ణాహారతి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ పుష్కరాలను ఇంత ఘనంగా నిర్వహించడానికి తానెంత కష్టపడ్డదీ అక్కడ ప్రకటించారు. 

=== 
ఈ ఇద్దరు ముఖ్యమం త్రుల డైరీల్లో మంగళవారం గడచిన తీరు ఇది. 

కేసీఆర్‌ ఒకవైపు తన రాష్ట్రం గురించి, రాష్ట్రానికి శాశ్వత ప్రయోజనాలు చేకూర్చే అంశాల గురించి పనిచేస్తోంటే, చంద్రబాబు పుష్కరాలు, హారతి, సన్మానాలు అంటూ కాలం గడిపేశారు. కృష్ణా పుష్కరాలు తెలంగాణకు కూడా ఉన్నాయి. నిజానికి మహారాష్ట్రకు కూడా ఉన్నాయి. కృష్ణా నది పుట్టేదే మహారాష్ట్రలో! మరి ఆ రాష్ట్రాల ముఖ్యమంత్రులందరికీ.. నదిహారతిలో తరించడం కంటె.. ప్రజలకు సంబంధించిన అంశాలే కీలకం అనే అభిప్రాయం ఉంది. నుకనే వారు ఈ సంతకాల కార్యక్రమంలో పాల్గొన్నారు. పుష్కరాలను ఎప్పటిలాగే జరిగే సాధారణ కార్యక్రమం కింద పరిగణించారు. 

కానీ చంద్రబాబు తీరు వేరు. తన ప్రభుత్వం ఏమీ పనిచేయడం లేదు అనే సంగతిని ప్రజలు గుర్తించకుండా.. వారి దృష్టి మళ్లించడం ఆయనకు అన్నింటికంటె కీలకమైన విషయం. అందుకే ఎలాంటి ప్రాధాన్యం లేదా ప్రజోపయోగం లేని కృష్ణా పుష్కరాలు అనే అంశం మీద ఆయన సీఎం స్థాయిలో 12 రోజుల పాటూ పూర్తి సమయం వెచ్చించి.. ఇతర పనులను గంగలో కలిపేశారంటే ఆయన పోకడను అర్థం చేసుకోవచ్చు. 

చంద్రబాబు ఇదివరకటి తీరు వేరు. ఇప్పుడు ఆయన ఏం చేసినా సరే.. ఎలా చేస్తున్నారో పోల్చిచూడడానికి పక్కనే మరో తెలుగు రాష్ట్రపు సీఎం కూడా ఉన్నారు. అలా పోల్చిచూసినప్పుడు సామాన్యులకు అనిపించే విషయాలు ఇవి. 

Show comments