ఆంధ్రా ఎన్నికలపై కేసీఆర్ జోస్యం!

తెలంగాణ ముఖ్యమంత్రి, గులాబీ బాస్ కల్వకుంట్ల చంద్రశేఖరరావు.. 2019 నాటికి ఆంధ్రప్రదేశ్ లో జరగబోయే ఎన్నికల ఫలితాల గురించి తనదైన మార్కుతో జోస్యం చెప్పారు. అదే 2019 ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో ఫలితాల గురించి తాను స్వయంగా చేయించిన సర్వేలో విపక్షం కాంగ్రెస్ కు కేవలం రెండే సీట్లు దక్కుతాయంటూ సొంత జోస్యం చెప్పిన కేసీఆర్... పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ లో రాబోయే ఎన్నికల నాటికి రాజకీయ స్థితిగతుల గురించి.. ఒకానొక తన మిత్రుడు చెప్పాడంటూ.. సర్వే వివరాలను వెల్లడించారు. 

కేసీఆర్ వెల్లడించిన ప్రకారం.. వచ్చే ఎన్నికల్లో ఏపీలో జగన్ దే పైచేయిగా ఉంటుంది. ఇది ఒక మిత్రుడు చెప్పిన సర్వే వివరాలు అని ఆయన అన్నారు గానీ.. వాటి ప్రకారం.. వైఎస్సార్ కాంగ్రెస్ కు 45 శాతం ఓట్లు లభిస్తాయి. తెలుగుదేశానికి 43 శాతం ఓట్లు దక్కుతాయి. అదే భారతీయ జనతా పార్టీకి 2.6 ఓట్లు మాత్రమే పడతాయి. అదే సమయంలో.. పవన్ కల్యాణ్ తన జనసేన పార్టీ ద్వారా ఎన్నికల బరిలోకి ప్రవేశిస్తే.. ఆయన సాధించగలిగేది 1.2 ఓట్ల శాతం మాత్రమే. 

కేసీఆర్ చెప్పిన ఈ జోస్యం బహుశా చాలా మందికి షాకింగ్ గానే ఉండొచ్చు. తొలిషాక్ చంద్రబాబుకు అనుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే.. ఆయనలో ఒక మూల ఓటమి గురించిన భయం ఉన్నది గనుకనే నానారకాల వ్యూహాలతో ప్రజలను మభ్యపెట్టడానికి ప్రయత్నిస్తున్నారనేది పలువురి అంచనా. నిజానికి చంద్రబాబు కంటె పెద్ద షాక్ పవన్ కల్యాణ్ కు అనుకోవాలి. అన్నిచోట్ల పోటీచేస్తాం అని ప్రకటిస్తున్న పవన్ కల్యాణ్ కు కేవలం 1.2 శాతం ఓట్లే దక్కుతాయా? అనేది బహుశా ఆయన అభిమానులకు కూడా మింగుడుపడకపోవచ్చు. 

ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న కేసీఆర్.. ప్రెస్ మీట్ పెట్టి ఈ వివరాలను వెల్లడించారు. ఈ పర్యటనలో ప్రధానితో కూడా భేటీ అయిన ఆయన... తాను అసెంబ్లీ సీట్ల పెంపు గురించి ప్రస్తావించానని.. 2024 వరకూ సీట్ల పెంపు ఉండకపోవచ్చునని కూడా చల్లగా తేల్చేశారు. నిజానికి ఏపీలో తెలుగుదేశం పార్టీకి ఇది ఇంకా పెద్ద షాక్ అనుకోవాలి. ఆ రకంగా కల్వకుంట్ల చంద్రశేఖరరావు.. హస్తినాపురం నుంచి చంద్రబాబునాయుడుకు షాక్ ల మీద షాక్ లు ఇస్తున్నారని జనం భావిస్తున్నారు. 

Show comments