వదినమ్మ చెబుతోంది.. అర్థం చేసుకోరూ.!

పవర్‌స్టార్‌ పవన్‌కళ్యాణ్‌ మాజీ సతీమణి రేణు దేశాయ్‌కి పెద్ద సంకటమే వచ్చింది. అభిమానుల 'అతి' అభిమానం ఆమెకు కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతోంది. 'పవన్‌కళ్యాణ్‌ నుంచి మీరు విడిపోవడం ఏమీ బాగా లేదు.. వదినమ్మా, అన్నయ్య పవన్‌కళ్యాణ్‌తో మళ్ళీ కలిసిపోరూ..' అంటూ సోషల్‌ మీడియాలో రేణుదేశాయ్‌ని ఉద్దేశించి అభిమానులు ఎడా పెడా పోస్టింగ్స్‌తో అదరగొట్టేస్తున్నారు. 

అందరికీ తెల్సిన విషయమే, రేణుదేశాయ్‌తో పవన్‌కళ్యాణ్‌కి రెండో పెళ్ళి జరిగిందని. చాలాకాలం క్రితం పవన్‌కళ్యాణ్‌కి మొదటి పెళ్ళి జరిగింది. ఆ పెళ్ళి గురించిన వివాదం, 2009 ఎన్నికల సమయంలో తెరపైకొచ్చింది.

ప్రజారాజ్యం పార్టీకి పవన్‌కళ్యాణ్‌ పెళ్ళి అప్పట్లో టెన్షన్‌ పెట్టింది లెండి. ఎలాగో, మొదటి పెళ్ళి వివాదం సెటిల్‌ అవడం, అప్పటికే సహజీవనం చేస్తోన్న రేణుదేశాయ్‌ని పవన్‌కళ్యాణ్‌ అధికారికంగా పెళ్ళిడడం జరిగిపోయాయి అప్పట్లో. 

ఏమయ్యిందో, మళ్ళీ పవన్‌కళ్యాణ్‌ మనసు మారింది. రేణుదేశాయ్‌తోనూ వైవాహిక బంధం తెగిపోయింది. కొత్తగా అన్నా లెజ్‌నెవా అనే రష్యా అమ్మాయిని పెళ్ళాడాడు. రేణుదేశాయ్‌ - పవన్‌కళ్యాణ్‌ల వైవాహిక జీవితానికి గుర్తుగా అకిరా, ఆద్య జన్మిస్తే, పవన్‌కళ్యాణ్‌ - లెజ్‌నెవా జంటకీ ఓ అమ్మాయి జన్మించింది.

ప్రస్తుతం పవన్‌కళ్యాణ్‌ సతీమణి అన్నా లెజ్‌నెవానే. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ, పవన్‌కళ్యాణ్‌ ఇంకొకరికి భర్త. ఇప్పుడు నన్ను మళ్ళీ పవన్‌కళ్యాణ్‌తో కలిసి వుండమని చెప్పడం మీకు తగదు.. అంటూ సోషల్‌ మీడియాలో అభిమానులకు విజ్ఞప్తి చేసింది రేణుదేశాయ్‌. 

రేణుదేశాయ్‌తో పవన్‌కళ్యాణ్‌ విడాకులు తీసుకున్నా, వారిద్దరి మధ్యా 'స్నేహం' అలాగే కొనసాగుతోంది. ఆద్య, అకిరా రేణుదేశాయ్‌ దగ్గరే వుంటున్నారు. నిర్మాతగా, దర్శకురాలిగా చిన్న చిన్న సినిమాలతో రేణు దేశాయ్‌ తన ఉనికిని చాటుకునేందుకు ప్రయత్నిస్తోంది.

అప్పుడప్పుడూ మాజీ భర్త, స్నేహితుడు పవన్‌కళ్యాణ్‌తో మధుర జ్ఞాపకాల్ని నెమరువేసుకుంటోంది. ఇక్కడే, అభిమానులు మళ్ళీ తమ 'అన్న, వదిన' కలిసి వుంటే బావుంటుందని కోరుకునేలా పరిస్థితులు ప్రేరేపిస్తున్నాయి. 

అలా అభిమానుల 'అతి' అభిమానం రేణుదేశాయ్‌కి చిక్కులు తెచ్చిపెడుతున్నట్టుంది.. అందుకే, వదినమ్మ - పవన్‌ అభిమానుల్ని ఉద్దేశించి 'నన్ను ఇబ్బంది పెట్టొద్దు.. అర్థం చేసుకోండి..' అంటూ సున్నితంగానే క్లాస్‌ తీసుకోవాల్సి వచ్చింది సోషల్‌ మీడియా సాక్షిగా. 

Show comments